మహిళా సాధికారతకు క్షీరాభిషేకం | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు క్షీరాభిషేకం

Published Wed, Feb 5 2014 12:19 AM

మహిళా సాధికారతకు  క్షీరాభిషేకం - Sakshi

 ప్రభుత్వ పథకాల వల్ల మహిళలకు ఉపాధి లభిస్తోందా?
 లేక మహిళల వల్ల ప్రభుత్వ పథకాలు
 విజయవంతమవుతున్నాయా?
 మొదటిది అందరూ అనుకునే అభిప్రాయం.  
 కానీ, చాలా సందర్భాల్లో రెండోదే జరుగుతోంది.
 ఇది అందరికీ తెలియవలసిన వాస్తవం.
 దానికి ... చిత్తూరు జిల్లాలో రోజురోజుకీ
 పెరుగుతున్న పాల డైరీలే సాక్ష్యం.
 ‘ఆడవాళ్లకైతేనే అప్పు ఇస్తాం’ అంటున్న
 అక్కడి బ్యాంకుల మాట దానికి రుజువు.
 నిజమైన మహిళా సాధికారతను
 నిలువుటద్దంలో చూపెట్టేదే ఈ కథనం

 
 ఒకప్పుడు చిత్తూరు పేరు చెప్పగానే పాడి పరిశ్రమ గుర్తుకొచ్చేది. ఇప్పుడు కూడా అంతే! అయితే మధ్యలో కొంతకాలం పాలు లేవు, నీళ్లు లేవు అన్నారు అక్కడి రైతులు. ఆవుని కొనుక్కోడానికి ప్రభుత్వం రుణాలిస్తే అప్పులు తీర్చుకుని చేతులు ముడుచుకున్నారు మగవారు. అప్పుడు ప్రభుత్వం కళ్లు తెరిచి అదే అప్పు ఆడవాళ్లకిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. ఆవుని కొనడం దగ్గర నుంచి డెయిరీలను నడిపేవరకూ అందరూ ఆడవాళ్లే ఉండడం న్యాయమనుకున్నారు. గ్రామ సమాఖ్యల్లోని మహిళలకు ‘కామధేనువు’ పేరుతో ఆవుల్ని కొనుక్కోవడానికి మండలసమాఖ్య అప్పులు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతే... చిత్తూరు పాలడెయిరీ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోడానికి  పునాది పడింది.
 
 ఏ ఏటికాయేడు...
 ఆరేళ్లక్రితం చిత్తూరులో 70 పాలశీతలీకరణ కేంద్రాలు (బల్క్ మిల్క్ సెంటర్లు- బిఎమ్‌సిలు) ఉండేవి. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పాల డెయిరీలు అప్పజెప్పాక ఏటా పదికి పైగా సెంటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ‘‘పథకాల ప్రయోజనం పూర్తిస్థాయిలో పేదలకు చేరాలన్నదే మా ఆశయం. కాని వాటిని సద్వినియోగం చేసుకుంటేనే కదా, వాటి ఫలితాలు అనుభవించేది. ఎప్పుడైతే పాల ఉత్పత్తి, సేకరణ, డెయిరీల నిర్వహణ గ్రామీణ మహిళలకు అప్పజెప్పామో... మా పని సగం సులువైంది. పూర్వం మగవారికి ఆవులు కొనుక్కోడానికి రుణాలు ఇచ్చినపుడు కూడా పెద్దగా ఫలితాలు చూడలేకపోయాం. ఇప్పుడు ఈ మహిళా రైతులు రుణాలు చెల్లించే పద్ధతిని చూసి బ్యాంకులు కూడా వాళ్లకైతేనే రుణాలు ఇవ్వడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి’’ అని చెప్పారు చిత్తూరు జిల్లా ఇందిర క్రాంతి పథకం ప్రాజెక్ట్ డెరైక్టర్ అనిల్‌కుమార్.
 
 అంతా మహిళలే...
 ప్రతి డెయిరీలో ఐదు సెక్షన్లు ఉంటాయి. పాలను పరీక్షించడం దగ్గర నుంచి కంటైనర్లలో నింపడం వరకూ అన్ని పనులు మహిళలే చూసుకుంటారు. గ్రామాల్లోనుంచి సెంటర్లకు పాలు తీసుకొచ్చే పనికూడా ఆడవాళ్లదే. ‘పాలమిత్ర’ పేరుతో సేకరించిన ప్రతి లీటరుకి ఇరవై అయిదు పైసలు కమీషన్ వచ్చే పథకాన్ని కూడా విజయవంతం చేశారు ఈ మహిళలు. సెంటర్ల నుంచి పాలు నేరుగా ఢిల్లీలో ఉన్న మదర్ డెయిరీఫామ్‌కి పంపిస్తారు. మదర్ డెయిరీవాళ్లు ఇక్కడి సెంటర్లవారికి కమీషన్ ఇస్తారు.
 
 నిజాయితీని కలిపి...
 నీళ్లు కలపకుండా పాలు దొరికే రోజులు పోయాయి. నీళ్లే కాదు కొందరు రకరకాల పౌడర్లు కూడా కలిపి కల్తీపాలను అమ్ముతున్నారు. చిత్తూరు డెయిరీఫామ్ మహిళలు ఈ విషయంలో చాలా నిజాయితీగా, జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి ఒక్క పాలచుక్కలో వారి నిజాయితీని కలిపి మరింత చిక్కని పాల కంటైనర్లలో నింపారు. దాంతో ఢిల్లీ మదర్ డెయిరీవాళ్లు  కమీషన్ రేటు ఎప్పటికప్పుడు పెంచారే కాని తగ్గించలేదు. ‘‘ఆరేళ్లక్రితం నేను కూడా మా బంధువులతో కలిసి బెంగుళూరుకి వలసపోదామనుకున్నాను. అయితే, ఆవుల్ని కొనుక్కోడానికి ఇక్కడ రుణాలు ఇస్తున్నారని తెలిసి ఆగిపోయాను. ప్రస్తుతం నా దగ్గర పది ఆవులున్నాయి. నాలాంటివారంతా కలిసి రుణాలు తీసుకుని ఆరేళ్లలో 30 వేల ఆవుల్ని కొన్నారు’’ అని ఎంతో సంతోషంగా చెబుతారు వరదరాజుపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ.
 
 ఆవుల్ని కొనడం, నాణ్యమైన పాలను సేకరించడం, ఆ పాలను సెంటర్లకు తరలించడం, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పంపడం... ఆ తర్వాత వచ్చిన లాభాలతో మరికొంత సంపాదన వచ్చే మార్గాలను వెతుక్కోవడం... ఇవన్నీ ఈ ఆరేళ్లలో చాలా చురుగ్గా సాగిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో రోజురోజుకీ పెరుగుతున్న పాలడైరీల వెనక మహిళా రైతుల పట్టుదల, పోటీతత్వం ఉన్నాయి. ‘కామధేనువు’ పథకాన్ని తమ పాలిట కల్పవృక్షంగా మార్చుకున్న  ఆ మహిళలకు సలామ్ చెబుదాం.
 - భువనేశ్వరి
 
      చిత్తూరు జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల సంఖ్య 114
      రోజుకు 3 లక్షల 60వేల లీటర్ల పాల ఉత్పత్తి
     శీతలీకరణ కేంద్రాలకు పాలుపోసే మహిళా రైతులు 50వేలమందికి పైగా
      ఒక్కో మహిళకు  ఖర్చులుపోను  ప్రతి ఆవు నుంచి నెలకు వచ్చే ఆదాయం రూ.4 నుంచి 5 వేలు
      స్వయం సహాయక బృందాలు ఇంతపెద్ద ఎత్తున పాల వ్యాపారం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement