హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆహార నియమాలివి... | Sakshi
Sakshi News home page

హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆహార నియమాలివి...

Published Mon, Oct 24 2016 12:35 AM

హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆహార నియమాలివి...

సోరియాసిస్ తగ్గుతుందా?

 నా వయసు 32 ఏళ్లు. నాకు కొంతకాలంగా మోకాలి ప్రాంతంలో చర్మంపై దురదతో కూడి ఎర్రని ప్యాచ్‌లు వస్తున్నాయి. తెల్లని పొలుసులు కూడా రాలుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది సోరియాసిస్ వ్యాధిగా చెప్పారు. మందులు వాడుతున్నాను. కొద్దిపాటి ఉపశమనం మాత్రమే లభిస్తోంది. పైగా ఇప్పుడు మోచేయి ప్రాంతంలో కూడా ఇది కనిపిస్తోంది. హోమియో ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చా? సలహా ఇవ్వగలరు. - కృపాకర్, నిజామాబాద్

ఈమధ్యకాలంలో సోరియాసిస్ అనే మాట విననివారు ఉండవు. నేటి జీవనవిధానం, అధిక మానసిక ఒత్తిడి వల్ల ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ చల్లటి వాతావరణంలో వ్యాధిని ప్రేరేపించే అంశాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దాంతో వ్యాధి తీవ్రత పెరగవచ్చు. సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే శరీర రోగ నిరోధ వ్యవస్థలో కొంత అసమతౌల్యత కారణంగా అది మన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల కలిగే వ్యాధి ఇది. ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఇతర వైద్య విధానాల్లో సమర్థమైన చికిత్స అందుబాటులో లేదు. హోమియో ద్వారా ఇది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. సోరియాసిస్ వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ సొంత చర్మపు కణాలపై దాడి చేయడం వల్ల ఆ కణాలు ప్రభావితమవుతాయి. అవి ఎర్రగా మారి సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువగా వృద్ధి చెందుతుంటాయి. దాంతో అంతర్లీనంగా ఉండే కణాలు త్వరగా చర్మపు ఉపరితలాన్ని చేరుకొని వెండి రంగు పొలుసులలా రాలిపోవడం జరుగుతుంది. ఇది కీళ్లను, గోళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.

సోరియాసిస్ వివిధ రకాలుగా కనిపిస్తుంది: 1) సోరియాసిస్ వల్గారిస్ 2) గట్టేట్ సోరియాసిస్ 3) ఇన్వర్స్ సోరియాసిస్ 4) పస్టులార్ సోరియాసిస్ 5) ఎరిథ్రోడర్మక్ సోరియాసిస్

కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ జన్యుపరమైన, పర్యావరణ అంశాలు ఈ వ్యాధి కారణం కావచ్చని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. అధిక మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత, రోగనిరోధక వ్యవస్థలో అసమతౌల్యత వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు.

లక్షణాలు : సోరియాసిస్ తల, మోకాళ్లు, అరచేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.  చర్మం ఎర్రబారవడం, సాధారణం నుంచి అతి తీవ్రమైన దురద, చర్మంపై వెండి రంగు పొలుసులు ఊడిపోవడం కనిపిస్తుంది  సోరియాసిస్ ఏర్పడితే పొలుసులు రాలిపోవడంతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది  సోరియాసిస్ గోళ్లను ప్రభావితం చేస్తే అవి పెళుసుగా మారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి.  సోరియాసిస్ వ్యాధి తీవ్రంగా ఉంటే కీళ్లను ప్రభావితం చేసి కీళ్లనొప్పులు (సోరియాటిక్ ఆర్థరైటిస్)కి దారితీస్తుంది.

చికిత్స : హోమియో విధానం ద్వారా అందించే జెనెటిక్ కాన్సిట్యూషనల్ చికిత్స వల్ల ఎలాంటి చర్మ సమస్యలనైనా సమర్థంగా నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల వికటించిన రోగ నిరోధక శక్తిని సరిచేయవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావాలు, దుష్ఫలితాలు లేకుండా సోరియాసిస్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.

హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆహార నియమాలివి...
నా వయసు 64 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు ఆయాసం తీవ్రత పెరగడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, పాదాల వాపు ఉండటంతో దగ్గర్లోని డాక్టర్‌ను కలిశాను. హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఆయన నాకు కొన్ని పరీక్షలు చేసి జీవనశైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని తెలిపారు. నాలాంటి వారు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో దయచేసి వివరించండి.
- రాజారావు, కొండాపూర్

మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి...
ఉప్పు : ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనిబడితే ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని - బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంటి నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్ వంటివి ఉపయోగించుకోవచ్చు.

ద్రవాలు : కాళ్ల వాపు ఉంటే నీరు, మజ్జిగ లాంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తమ్మీద లీటరు కంటే తక్కువ తీసుకోవాలి. ఒంట్లో నీరు చేరుతున్న లక్షణాలు లేకపోతే ఒకటిన్నర లీటర్ల వరకు నీరు తాగవచ్చు.

విశ్రాంతి : గుండెవైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని  చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు.

మానసిక సాంత్వన : గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. వీరికి యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తున్నట్లు అధ్యయనాలలో గుర్తించారు.

ఈ మందులు వద్దు : గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. సంప్రదాయ ఔషధాలు, నాటు మందుల్లో ఏ అంశాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ వంటి సురక్షితమైన మందులు వాడుకోవచ్చు.

 వైద్యపరమైన జాగ్రత్తలు : గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు అవసరం కావచ్చు. కాబట్టి తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం ముఖ్యం.

Advertisement
Advertisement