అనుభవించాడు.. ఆరిపోయాడు.. | Sakshi
Sakshi News home page

అనుభవించాడు.. ఆరిపోయాడు..

Published Sat, Jul 25 2015 11:49 PM

అనుభవించాడు.. ఆరిపోయాడు.. - Sakshi

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాట చాలామందికి గుర్తుండే ఉంటుంది. పెద్దల మాటను చద్దిమూటగా భావించి, మన్నించే వారు లోకంలో కొద్దిమందే ఉంటారు. అన్నీ ఉన్నాక చద్దికూడుతోనే సరిపెట్టుకోవాల్సిన ఖర్మ మాకేంటనుకుంటారు కొందరు. అలాంటి శాల్తీలకు డబ్బు దస్కం దండిగా కలిసొస్తేనా..? జల్సా కులాసానుభవాల్లో మునిగి తేలిపోతారు. హెన్రీ సిరిల్ పేజెట్ అనే బ్రిటిష్ పెద్దమనిషి అలాంటి శాల్తీనే! అతగాడికి 27 ఏళ్ల వయసులో దాదాపు యాభై కోట్ల పౌండ్ల ఆస్తి కలిసొచ్చింది. ఆంగ్లో-శాక్సన్ వ్యవస్థలో 1880-98 వరకు ‘ఎర్ల్ ఆఫ్ అక్స్‌బ్రిడ్జి’ అనే రాచపదవిని కూడా వెలగబెట్టాడు.

అతగాడు పడవలాంటి కారులో బయలుదేరితే, ఆ కారు దారిపొడవునా సుగంధ పరిమళద్రవ్యాలను వెదజల్లేది. మరకత మణి మాణిక్యములు, వజ్ర వైడూర్యములు, ఇంపగు కెంపులు పొదగబడిన ఆభరణములు, అప్పటి ఫ్యాషన్లకు విభిన్న విలక్షణములగు సూటు బూటు హ్యాటాదులు ధరించి దర్పాన్ని ప్రదర్శించేవాడు. అతగాడి ధాటికి యాభైకోట్ల ఆస్తీ రెండేళ్లలోగానే హారతి కర్పూరం కంటే వేగంగా కరిగిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. చివరకు కోర్టు అతడిని దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. చివరకు ముప్పయ్యేళ్లయినా నిండక ముందే 1905 మార్చి 14న దయనీయ పరిస్థితుల్లో మరణించాడు.

Advertisement
Advertisement