నో అండం... ఓన్లీ బ్రహ్మాండం | Sakshi
Sakshi News home page

నో అండం... ఓన్లీ బ్రహ్మాండం

Published Sat, Dec 20 2014 12:15 AM

నో అండం...  ఓన్లీ బ్రహ్మాండం - Sakshi

కేకు శాకాహారమా మాంసాహారమా?
 
ఏదో ఒక ఆహారం... మాకైతే వద్దు బాబూ... ఎవరక్కడ! మీరేనా కేకు వద్దందీ? క్రిస్మస్ వస్తోంది, న్యూ ఇయర్ వస్తోంది. మధ్యమధ్య బర్త్‌డేలూ వస్తుంటాయి. వితౌట్ కేక్ ఎలా  వితౌట్ కేక్ అనడం లేదు, వితౌట్ ఎగ్ అంటున్నాం.  అంటే... గుడ్డు కలపని కేక్ దొరికితే కుమ్మేస్తారన్నమాట.  అంతేగా..!   మీరుగానీ అరేంజ్ చేస్తారేమిటి?  ఆల్రెడీ అరేంజ్డ్. కావలసిన పదార్థాలున్నాయి. తయారీ విధానం ఉంది.   బేక్ చేస్కోండి. కేక్ చేస్కోండి. కట్ చేస్కోండి. ఆ తర్వాత... ఏం చేస్కోవాలో మీకు చెప్పేటంతటి వాళ్లమా చెప్పండి!
 
వెనిలా కప్ కేక్స్
 
కావలసినవి:  ఉప్పు - 2 కప్పులు ; బటర్ - పావు కప్పు; పంచదార పొడి - పావు కప్పు; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; కండెన్స్‌డ్‌మిల్క్ - అర కప్పు; బేకింగ్ పౌడర్ - టీ స్పూను; మైదా పిండి - కప్పు; సోడా - అర కప్పు (క్లబ్ సోడా); చెర్రీస్ - 20
 
తయారీ:  కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి  మిక్సింగ్ బౌల్‌లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్‌డ్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలక్కొట్టాలి  ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి  సోడా (క్లబ్ సోడా వంటివి) వేసి బాగా కలపాలి  కప్ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. (విజిల్ పెట్టకూడదు)  సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి
  చల్లారాక బయటకు తీసి అందించాలి.
 
చాకొలేట్ నట్స్ కేక్

 
కావలసినవి: మైదా పిండి - కప్పు;  కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు;  బేకింగ్ పౌడర్ - టీ స్పూను; కోకో పొడి - 2 టేబుల్ స్పూన్లు; బటర్ - పావు కప్పు; పంచదార పొడి - పావు కప్పు; కండెన్స్‌డ్ మిల్క్ - అర కప్పు; జీడిపప్పు తరుగు - 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; బ్లూ బెర్రీలు (ఎండబెట్టినవి) - 2 టేబుల్ స్పూన్లు; కిస్‌మిస్ - టేబుల్ స్పూను; ఖర్జూరం తరుగు - టేబుల్ స్పూను; ఉప్పు - ఒకటిన్నర కప్పులు

తయారీ:   ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి  ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి  బేకింగ్ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి  మిక్సింగ్ బౌల్‌లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, కండెన్స్‌డ్ మిల్క్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. (ఎంత ఎక్కువ సేపు గిలక్కొడితే అంత రుచిగా వస్తుంది)  ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి  యేడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి. (బటర్ బదులు బటర్ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు)  ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి)  పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లితే బాగుంటుంది.
 
బ్లూ బెర్రీ రసగుల్లా  చీజ్ కేక్
 
 కావలసినవి: బిస్కెట్లు - 125 గ్రా.; కరిగించిన బటర్ - 75 మి.లీ.; క్రీమ్ చీజ్ - 200 గ్రా.; పంచదార పొడి - 1/3 కప్పు; క్రీమ్ - 300 మి.లీ. (బాగా గిలక్కొట్టాలి); కండెన్స్‌డ్ మిల్క్ - 200 మి.లీ.; చైనా గ్రాస్ - 10 గ్రా.; బ్లూ బెర్రీలు - 3 టేబుల్ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు - 3 టేబుల్ స్పూన్లు; చిన్న రసగుల్లాలు - 30
 తయారీ:  బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్‌లో నెమ్మదిగా వేస్తూ కలపాలి. (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది)  ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి  1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి  ఒక పాత్రలో క్రీమ్ వేసి బాగా గిలక్కొట్టాలి  మరో పాత్రలో క్రీమ్ చీజ్, పంచదార పొడి వేసి గిలక్కొట్టాలి  సన్నని మంట మీద పాన్ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి  పాన్‌లో కండెన్స్‌డ్ మిల్క్ వేసి గోరు వెచ్చన చేసి, ఉడికించిన చైనా గ్రాస్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి  ఈ మిశ్రమాన్ని క్రీమ్ చీజ్ మిక్స్‌కి జత చేసి బాగా గిలక్కొట్టాలి  బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి. (బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు)  గిలక్కొట్టిన క్రీమ్, రసగుల్లాలను వేయాలి  కేక్ టిన్‌లో చీజ్ కేక్ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి  కేక్‌ను టిన్ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి.
 
ఫ్రెష్  ఫ్రూట్ కేక్
 
కావలసినవి:...:  మైదా పిండి - కప్పు; బటర్ - పావు కప్పు; పంచదార పొడి - పావు కప్పు; కండెన్స్‌డ్ మిల్క్ - అర కప్పు; తాజా క్రీమ్ - పావు కప్పు; బేకింగ్ పౌడర్ - టీ స్పూను; కస్టర్డ్ పౌడర్ - టీ స్పూను; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; ఉప్పు - 2 కప్పులు; చిలకరించిన క్రీమ్ - 500 గ్రా.; పంచదార పొడి - పావుకప్పు; పంచార సిరప్ - పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు - (కివి, కమలాపండు తొనలు, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు....); స్ట్రాబెర్రీ వేఫర్స్ - తగినన్ని

తయారీ:  కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ ఉంచి, స్టౌ మీద మీడిమం మంట మీద ఉంచాలి  మిక్సింగ్ బౌల్‌లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలిపాక, కండెన్స్‌డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలక్కొట్టాక, పావు కప్పు క్రీమ్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి  మైదాపిండి, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్... వీటిని జల్లెడ పట్టి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి  ఏడు అంగుళాల అల్యూమినియం కేక్ ట్రే కి బటర్ రాసి, కేక్ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్ చేసి కేక్‌ను బయటకు తీయాలి  500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలక్కొట్టాలి. పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలక్కొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి)  కేక్‌ను ఒక ప్లేట్‌లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్ చేయాలి  చాకుతో కేక్ చుట్టూ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార  సిరప్ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి  పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి. ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అర గంట సేపు ఉంచి తీయాలి  చివరగా మళ్లీ కేక్ మీద క్రీమ్ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా మనకు నచ్చిన వాటితో (స్ట్రాబెర్రీ వేఫర్‌లు బాగుంటాయి) అలంకరించి సుమారు 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచి అందించాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement