ఏవండోయ్... ఇది విన్నారా? | Sakshi
Sakshi News home page

ఏవండోయ్... ఇది విన్నారా?

Published Mon, Nov 2 2015 7:07 AM

ఏవండోయ్...  ఇది విన్నారా?

కథనత్రయోదశి
 
శ్రీమతి ఇచ్చిన చిక్కటి ఫిల్టర్ కాఫీని గుటక వేస్తూ, మధ్యమధ్యలో పేపర్‌లోని వార్తలు చప్పరిస్తూ, టీపాయ్ మీదున్న రిమోట్ అందుకుని, టీవీ ఆన్ చేశాడు సుబ్రావ్. ఇంతలో శ్రీమతి ప్లేటులో పొగలు కక్కుతున్న వేడివేడి ఉప్మాపెసరట్టు తీసుకొచ్చి చేతికిచ్చింది. తనకిష్టమైన టిఫిన్ కావడంతో ఆత్రంగా అందుకున్నాడు కానీ అంతలోనే గతుక్కుమన్నాడు. ఎప్పుడూ లేనిది ప్రేమతో ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. ఆ వెంటనే  తను ఎన్నిసార్లు అడిగినా, ఆర్డర్ వేసినా విసుక్కునే భార్యామణి ఇవ్వాళ అడక్కుండానే ఉప్మాపెసరట్టు చేసి చేతికి అందించింది.... అంటే ఏదో విశేషం ఉండి ఉండాలి... ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నాడు... ఇంతలోనే శ్రీమతి గొంతు సవరించుకుంటున్నట్టుగా గాజుల చేతితో సవ్వడి చేసింది.

తలెత్తి చూశాడు సుబ్రావ్. ప్రేమతో పెసరట్టు మీద నెయ్యి వేసి, అల్లప్పచ్చడి, పల్లీచెట్నీ రెండూ వేర్వేరు డిష్‌లలో పెట్టి టీపాయ్ మీద పెట్టి, తినండన్నట్టు చూసింది. భార్యాసుందరి టెండర్ పెట్టబోయే వస్తువు ఏమై ఉంటుందబ్బా... అని ఆలోచిస్తూనే పెసరట్టు తుంచి అందులో ఉప్మా పెట్టుకుని, ఆ పక్కనే ఉన్న అల్లప్పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలా రెండు మూడు ముక్కలు తుంచుకుని తింటున్నా అటునుంచి సౌండ్ ఏమీ రాకపోయేసరికి త నే అనవసరంగా అనుమానపడుతున్నాడేమో అనిపించి, మనసులోనే లెంపలు వేసుకున్నాడు. నాలుగో ముక్క తినేసరికి ‘ఏవండీ‘ అని పిలవనే పిలిచింది సుందరి. ఏమిటన్నట్టుగా చూశాడు సుబ్రావ్.
 
‘‘ఇవ్వాళ్టి పేపర్ చూశారా?’’   ‘‘చూస్తూనే ఉన్నా కదా’’ మీరు చూసేదల్లా జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఆ తర్వాత సాహిత్యం పేజీలో పుస్తక సమీక్షలేగానీ, నిలువెత్తు యాడ్స్ ముఖం ఎప్పుడు చూశారు గనక?’’  సౌమ్యంగానే అన్నా ఎత్తిపొడుపులానే ధ్వనించింది.
 ‘‘అబ్బా! నీ నోటితో చెప్పు సుందూ, వింటాను’’ తను కూడా ప్రేమగానే అన్నాడు సుబ్రావ్. సమాధానంగా ఓ యాడ్ చూపించింది సుబ్రావ్‌కి. ‘‘ఈ ధనత్రయోదశినాడు మీ పాత బంగారాన్ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోండి, బదులుగా ప్రతి గ్రాముకీ వందరూపాయలు అదనంగా పొందండి. పది గోల్డ్ కాయిన్స్ కొనండి. పదకొండో కాయిన్‌ను ఫ్రీగా పట్టుకెళ్లండి. 25 గ్రాముల బంగారు ఆభరణాలు కొంటే మజూరీలో పదిశాతం డిస్కౌంట్. పాత ఆభరణాల ఎక్స్‌చేంజ్‌పై 5 శాతం తరుగుదల ఉచితం. కేవలం పదిశాతం ముందు చెల్లించండి, అనూహ్యమైన గిఫ్ట్ పట్టుకెళ్లండి’’

దానితోబాటు మేమేమీ తక్కువ తినలేదన్నట్టు వందన సిస్టర్స్, కేజీ బ్రదర్స్, వర్మాస్ యాడ్స్... పక్క పేజీలో బిగ్ మార్కెట్, బిగ్ మొబైల్స్, లాట్‌సి యాడ్స్... అన్నింటిలోనూ ఈ ధనత్రయోదశినాడు కొనుగోలు చేయండి, 1కి రెండు, రెండుకి మూడు, మూడుకి ఐదు ఉచితంగా తీసుకెళ్లండి... లాంటి టెంప్టింగ్ ఆఫర్లు. అయితే సుబ్రావ్‌ను అధికంగా ఆకర్షించిందల్లా ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై అర కేజీ కందిపప్పు, అరకేజీ మినప్పప్పు ఉచితం అన్నదే.
 
కేజీ కందిపప్పు రెండువందలు, మినపగుళ్లు పదో, ఇరవయ్యో తక్కువగా ఇంచుమించు అంతే ఉంది. ఇంకా ఎండుమిర్చి, పల్లీలు, పెసరపప్పు, చింతపండు, రవ్వలు, శనగపిండి, బ్రాండెడ్ గోధుమపిండి, ఆయిల్ ప్యాకెట్లు... ఇవే కాదు, ఇంచుమించు నిత్యావసరాలన్నింటిధరలూ చుక్కల్తో పోటీపడుతున్నాయి. కూరల సంగతి సరే సరి, నానాటికీ పెరగిపోతున్న ధరలతో క్రూరగాయాలు చేస్తున్నాయి. నాన్ వెజ్ సరేసరి. పోనీ, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ ధరాఘాతాలు సంధిస్తున్నాయి. ఒక మోస్తరుగా ఉండే బియ్యం పాతిక్కేజీల బ్యాగ్ వెయ్యికి పైనే! అంతకన్నా కిందికి దిగట్లేదు.

 నానాటికీ పెరుగుతున్న ధరలతో నెలవారీ బడ్జెట్ ఏకంగా పదిహేనువందలకు పైగా పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పప్పన్నం తినేవాళ్లంటే అందరికీ చులకనగా ఉండేది. ఇప్పుడు రోజూ పప్పన్నం తినడమూ గొప్పగా మారింది. ఆలోచిస్తుంటే... ఆ మధ్య ఫేస్‌బుక్‌లో కార్టూన్లు, జోకులు గుర్తొచ్చాయి. ఉల్లిధర ఒక్కసారిగా చెట్టెక్కి కూర్చున్నప్పుడు ఉల్లిపాయల బస్తాలు పక్కన ఉన్నవాడిని శ్రీమంతుడంటూ కామెంట్ చేసేవాళ్లు, ఉల్లిదండలు వేసుకు తిరిగేవాళ్లని కుళ్లుగా చూసేవాళ్లు, ఉల్లి దోసె, ఉల్లిపాయ పకోడీలు తినేవాళ్లని గొప్పవాళ్లని చెప్పుకునేవాళ్లూ... ఇలా... ఇప్పుడు ఉల్లి కాస్త దిగొచ్చి, కందిపప్పు చెట్టు మీద కాదు, ఏకంగా ఆకాశానికెగబాకింది. దాంతో ఆ కార్టూన్లు కాస్తా కందిపప్పు మీదికి మళ్లాయి.
 
సుబ్రావ్ ఆలోచనాధారకు సుందరి ఠపీమని టీపాయి మీద పెట్టిన కప్పు చప్పుడుతో బ్రేకు పడింది.‘‘కాఫీ తీసుకోండి’’ అంటూ కప్పు వైపు చెయ్యి చూపించి, కళ్లు సుబ్రావ్ వైపు తిప్పింది సుందరి. ఆ చూపులో ‘యాడ్ చూశారా, అనడిగితే అలా వెర్రిమొహం వేసుకుని చూస్తారేం’ అన్నట్లు కనిపించింది సుబ్రావ్‌కి. చూశానన్నట్లుగా కళ్లతోనే సమాధానం చెప్పాడు సుబ్రావ్. ‘‘అది కాదండీ, ప్రస్తుతం నేను వేసుకుంటున్న చంద్రహారం పాతబడిపోయింది. అది ఎక్స్‌ఛేంజ్ చేసి, కాసులపేరు తీసుకుంటే ఎలా ఉంటుందంటారు, ఎందుకంటే ఇప్పుడు పాత బంగారం ఎక్స్‌ఛేంజ్ మీద ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారట... అలాగే చిట్టితల్లి చెయిన్ కూడా! అప్పుడు సరిగా చూసుకోలేదు, ఓల్డ్ మోడల్. అది కూడా ఎక్స్‌ఛేంజ్ చేసి పడేద్దాం... అన్నట్టు మీ ఉంగరం కూడా..’’ ఇంకా ఏదో చెబుతోంది కానీ  సుబ్రావ్ చెవికెక్కడం లేదు... ఓ ఆధ్యాత్మిక ఛానల్‌లో స్వాములవారు ధనత్రయోదశి గురించి చెబుతున్న ప్రవచనం మీదికి వెళ్లింది. కళ్లతోనే భార్యను అది వినమన్నట్టు సైగ చేశాడు.

‘‘ధనత్రయోదశి అంటే ధన్వంతరి పుట్టిన రోజు. ధన్వంతరి అంటే వైద్యుడు. అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఔషధ భాండాన్ని చేతితో పట్టుకుని ఉద్భవించాడు ధన్వంతరి. ఆయన వల్లే లోకానికి ఔషధాలు తెలిశాయి. ఆరోగ్యభాగ్యం కలిగింది. అందరికీ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆయన పుట్టింది ఆశ్వయుజ బహుశ త్రయోదశినాడు కావడం వల్ల ధన్వంతరి పుట్టిన త్రయోదశి కాస్తా ధన త్రయోదశిగా మారింది. ఈ శుభ వేళ ధన్వంతరిని పూజించడం మంచిది...’’  యాంకర్ అందుకుని, ‘‘మరి లక్ష్మీదేవి పుట్టినరోజు అంటారు, ఈ రోజున తక్కువలో తక్కువగా గ్రాము బంగారమైనా కొనడం మంచిదంటారు, అది నిజం కాదంటారా స్వామీ’’ అని అడిగింది.
 అక్కడికే వస్తున్నాను తల్లీ, పూర్వం హేమ అనే ఓ యువరాజుకు చిన్న వయస్సులోనే మరణిస్తాడని శాపం. తమ కుమారుణ్ణి ఆ శాపం నుంచి బయట పడవెయ్యడానికి సకల శుభలక్షణాలూ కలిగిన ఓ యువతితో పెళ్లి జరిపించారు రాజదంపతులు. ఆమె దేవీ భక్తురాలు కావడంతో అమ్మవారు ఆమెకు కలలో కనిపించి, ‘‘బిడ్డా! ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు యముడు కాలసర్ప రూపంలో వచ్చి, నిద్రపోతున్న నీ భర్త ప్రాణాలను తన కాటుతో తీసుకుంటాడు. నువ్వు నీ భర్తను ఆ పాముకాటు నుంచి తప్పించగలిగితే అతనికి ఇక మరణభయం ఉండదు’’ అని చెప్పింది.

లక్ష్మీ అమ్మవారు చెప్పిన రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం యువరాణి అంతఃపురంలోని బంగారం, వెండి, నగలు, వజ్రాభరణాలు అన్నింటినీ తెప్పించి రాశులుగా పోసింది. ఇంటినంతటినీ దీపాలతో నింపి వేసింది. భర్త నిద్రలోకి జారుకోకుండా రకరకాల కథాశ్రవణాలు, వినోద కాలక్షేపాలు పెట్టించింది. అర్ధరాత్రి కావస్తుండగా యముడు కాలసర్పరూపంలో ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. అయితే ఆ పాము కళ్లు మిరుమిట్లు గొలిపే బంగారు ఆభరణాలు, దీపకాంతులతో కళ్లు కనబడక, దీపాల వేడి భరించలేక, కుప్పగా పోసి ఉన్న ధనరాశుల మీదికి చే రి, అందరూ ముక్తకంఠంతో పఠిస్తున్న లక్ష్మీ అష్టోత్తరాలను, సహస్రనామాలను, కథాకాలక్షేపాలను తన్మయత్వంతో వింటూ ఉండిపోయింది. ఈలోగా తెల్లవారింది. కాటు వేసే సమయం మించిపోవడంతో చేసేదేమీ లేక యముడు కాస్తా జారుకున్నాడు.

యువరాజుకు ప్రాణగండం తప్పిందన్న ఆనందంతో రాజ్యప్రజలందరూ పండగ జరుపుకున్నారు. గండం గడవడానికి ఇంటి నంతటినీ ధనరాశులతో నింపింది కాబట్టి ఆ త్రయోదశికి ధనత్రయోదశిగా పేరొచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రజలందరూ లక్ష్మీదేవిని ఇంటిలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పూజించడం సంప్రదాయంగా ఏర్పడింది. ధనత్రయోదశినాడు అమ్మవారిని పూజించాలి అనే అసలు విషయాన్ని కాస్తా పక్కన బెట్టి జనమందరూ వేలం వెర్రిగా అప్పు చేసి మరీ బంగారం, వెండి, ఆభరణాలు కొనడం మొదలు పెట్టారు. అది కాస్తా దుస్తులు, ఇతర గృహోపకరాణాలకు కూడా పాకింది... చెబుతుంటే ఇంటినుంచి వచ్చేటప్పుడు ‘ధన్ తేరస్ నాడు ఎలాగైనా సరే రవ్వల నెక్లెస్ చేయించాల్సిందే’ అంటూ భర్తతో గొడవ పెట్టుకుని వచ్చిన యాంకరమ్మ చెంపలు సిగ్గుతో కెంపులయ్యాయి.
 అది చూస్తున్న సుందరి చెంపలు కూడా! తనను గండం నుంచి గట్టెక్కించిన స్వాములవారికి సుబ్రావ్ జోడించిన చేతులు మాత్రం ఇంకా విడివడలేదు.
 - డి.వి.ఆర్.
 
‘‘అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఔషధ భాండాన్ని చేతితో పట్టుకుని ఉద్భవించాడు ధన్వంతరి. ఆయన వల్లే లోకానికి ఔషధాలు తెలిశాయి. ఆరోగ్య స్పృహ పెరిగింది. ధన్వంతరి పుట్టిన త్రయోదశి కాస్తా ధన త్రయోదశిగా మారింది. ఆ వేళ ధన్వంతరిని పూజించడం, ఔషధ సేవ చేయడం మంచిది...’’  యాంకర్ అందుకుని, ‘‘మరి లక్ష్మీదేవి పుట్టినరోజు అని అంటారు, బంగారం కొనడం మంచిదంటారు, అది నిజం కాదంటారా స్వామీ’’ అని అడిగింది.
 

Advertisement
Advertisement