కాలువల్లో ఈత కొట్టేవాళ్లం... | Sakshi
Sakshi News home page

కాలువల్లో ఈత కొట్టేవాళ్లం...

Published Thu, May 8 2014 10:29 PM

కాలువల్లో ఈత కొట్టేవాళ్లం... - Sakshi

వేసవి జ్ఞాపకం
 
‘జై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నవదీప్ ఆ తరువాత ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’, ‘ఆర్య 2’.. వంటి సినిమాలతో మరింత చేరువయ్యారు. తెలుగు, తమిళ సినిమా షూటింగ్‌లతో ఇప్పుడు వేసవి సెలవుల హంగామాను మిస్సవుతున్నానంటున్న ఈ యువ హీరో చిన్ననాటి సమ్మర్ హాలీడేస్‌ను గుర్తుతెచ్చుకున్నారు.
 
‘‘చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. స్కూల్ డేస్‌లో వేసవి వస్తుందంటే చాలు ఓ పండగలా అనిపించేది. పుస్తకాలు లేకుండా రెండు నెలలు ఎంజాయ్ చేయచ్చు అనే భావనే కాదు, దాంతో పాటు విజయవాడ వెళ్లచ్చు అనే ఆనందం కూడా ఉక్కిరిబిక్కిరి చేసేది. మా అమ్మగారి అక్కచెల్లెళ్లు విజయవాడలో ఉండేవారు. అమ్మమ్మ తాతయ్య తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు. ప్రతి వేసవికి అమ్మ, నేను, చెల్లెలు విజయవాడ వెళ్లేవాళ్లం.

రెండు నెలలు అక్కడే. అందుకే, ఇప్పటికీ వేసవి వస్తోందంటే చాలు విజయవాడే గుర్తుకువస్తుంది. అక్కడి తిన్న మామిడికాయలు, స్నేహితులతో ఆడిన ఆటలు, తిరిగిన తిరుగుళ్లూ... అమ్మమ్మ, తాతయ్య, బంధువుల పిల్లలు... ఆ ఆనందం అంతా ఇప్పటికీ కళ్లముందు నిలుస్తుంది. అక్కడ మా బంధువుల పిల్లలమంతా కలిసేవాళ్ళం. అక్కడే కొత్త స్నేహితులు పరిచయం అయ్యేవారు. అంతా కలిసి కాలువల్లో ఈతలు కొట్టేవాళ్లం.

సాయంత్రాలు కృష్ణానది ఒడ్డుకెళ్లి కూర్చునేవాళ్ళం. ఎండ అని కూడా ఆలోచించకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వెళ్లేవాళ్ళం. ఇప్పటికీ విజయవాడలో నాకిష్టమైన ప్లేస్ అదే! ఇంకా అక్కడ చూసినన్ని సినిమాలు... ఎక్కడా చూడలేదంటే నమ్మండి. ఊళ్ళో ఎంత తిరిగినా, ఏ ఆటలు ఆడినా ఇంట్లో అభ్యంతరాలు ఉండేవి కావు. కాకపోతే ఎండలో ఆడవద్దని మాత్రం జాగ్రత్తలు చెప్పేవారు. అయినా వినేవాళ్ళం కాదనుకోండి. ఇప్పుడు ఎండ ఉంటే బయటకెళ్లలేం.

మా విజయవాడ స్నేహితులంతా ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అందరం కలుస్తుంటాం. కానీ అప్పటి సెలవుల ఆనందం ఇప్పుడు రాదు. చదువుకునే రోజుల్లో వచ్చే వేసవి సెలవుల ఆనందం పెద్దయ్యాక అందమైన జ్ఞాపకంగా మిగలాలి. అందుకే పిల్లలు అన్ని రకాలుగా సెలవులను ఆనందించేలా పెద్దలే చూడాలి.’’
 

Advertisement
Advertisement