హిందీ బాణీ తెలుగు పాట... | Sakshi
Sakshi News home page

హిందీ బాణీ తెలుగు పాట...

Published Mon, Sep 21 2015 12:21 AM

హిందీ బాణీ తెలుగు పాట...

నాస్టాల్జియా
సంగీతానికి కులం లేదు మతం లేదు తెలుగు హిందీ అనే భాషాభేదం లేదు. హిట్ అయిన పాట ఎక్కడైనా హిట్ అవుతుంది. అయ్యింది. కాలం కూడా అదే నిరూపించింది. అశోక్ కుమార్ ‘కిస్మత్’ (1943)లో అందరూ మెచ్చిన ఆ పాట ‘మేరా బుల్‌బుల్ సో రహా హై’... తెలుగులో అంతే అందంగా నలుగురినీ ఆకర్షించలేదా? ‘దొంగ రాముడు’ (1955)లో ‘నిదురపోయే రామచిలుక ఎగిరిపోతుంది... కల చెదిరిపోతుంది’... అంటే మనమందరం సద్దు చేయకుండా శ్రద్ధగా వినలేదా? మంచి పాటను డబ్బింగ్ కూడా ఆపలేదని ‘ఆహ్’ నిరూపించింది.



‘రాజా కి ఆయేగీ బారాత్‌‘ అని అక్కడ లతా మంగేష్కర్ పాడితే తెలుగులో ‘కనువిందవుతున్నాది’ అని జిక్కీ జవాబు చెప్పలేదా? ఇవాళ్టికీ పందిళ్లు వేసిన పెళ్లి ఇళ్లలో ఈ పాట వినిపిస్తూనే ఉండటం లేదా? మంచి హిందీ పాటకు పరవశించని తెలుగు సంగీత దర్శకుడు లేడు. సాలూరి కావచ్చు, పెండ్యాల కావచ్చు చివరకు నేటి మేటి సంగీత దర్శకులు కూడా కావచ్చు. కాని అందరి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది మాత్రం సత్యం. హిందీ పాటలను తెలుగులో చాలా సృజనాత్మకంగా సత్యం ప్రవేశపెట్టాడు. కన్నడంలో ఈ బాధ్యతను రాజన్-నాగేంద్ర తీసుకున్నారు.
 
ఫిరోజ్ ఖాన్ 1975లో ‘ధర్మాత్మ’ తీశాడు. ‘గాడ్ ఫాదర్’ను ఇండియనైజ్ చేసే మొదటి ప్రయత్నం అది. కల్యాణ్‌జీ- ఆనంద్‌జీ సంగీతం. ముకేశ్- కంచన్ పాడిన ‘క్యా ఖూబ్ లగ్‌తీ బడి సుందర్ దిఖ్‌తీ హో’... పాట పెద్ద హిట్ అయ్యింది. ఇది మన తెలుగు ఇండస్ట్రీని కూడా తాకింది. 1977లో వచ్చిన రెండు సినిమాల్లో ఈ పాట వినిపించింది. ఎన్టీఆర్ తీసిన ‘చాణక్య చంద్రగుప్త’లో అందరికీ గుర్తుండే ఉండాలి... ‘చిరునవ్వుల తొలకరిలో’ పెద్ద హిట్. అదే సంవత్సరం వచ్చిన కృష్ణంరాజు ‘శివమెత్తిన సత్యం’లో ‘గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్’ పాట కూడా పెద్ద హిట్టే. ఏసుదాస్- వాణి జయరాం పాడిన ఈ పాటకు జె.వి.రాఘవులు సంగీతం. ఇక సత్యం ఒకే హిందీ బాణీని అనేకసార్లు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి.

నౌషాద్ మహానుభావుడు. తమిళ సూపర్‌హిట్ ‘పాలుమ్-పాజుమమ్’ను హిందీలో ‘సాథీ’ (1968) పేరుతో రీమేక్ చేస్తుంటే ఆయన తన ట్రెడిషనల్ బాణీకి కాస్త పక్కకు జరిగి మంచి మోడరన్ మెలోడీ ఇచ్చాడు. ‘మేరా ప్యార్ భి తూ హై ఏ బహార్ భి తూ హై’... ముకేశ్- లతా పాడిన ఈ డ్యూయెట్‌లో రాజేంద్రకుమార్, వైజయంతిమాలా అందంగా అలరిస్తారు. ఈ పాట బహుశా సత్యంను వెంటాడింది. ఆయన ‘బుల్లెమ్మ బుల్లోడు’ (1972)లో దీనిని ‘కురిసింది వానా నా గుండెలోన’గా ఇన్‌స్పయిర్ అయ్యి చేశాడు. అంతటితో ఆగలేదు. ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ (1973) ‘సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు’ పాటగా చేశాడు. రెండూ పెద్ద హిట్ అయ్యాయి.
 
అందరం అభిమానించే సాలూరి కూడా ఇలాంటి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. ‘హరేరామ హరేకృష్ణ’ (1971) కోసం ఆర్.డి.బర్మన్ చాలామంచి మెలోడీ ఒకటి చేశాడు. ‘ఫూలోంకా తారోంకా సబ్ కా కెహనా హై’... లతా పాడిన ఈ పాట ఇప్పటికీ హిట్టే. ఇది ఆయన మనసులో పడి ఉండాలి. ‘రాధాకృష్ణ’ (1978)కు సంగీతం అందించేటప్పుడు ఈ పాటను ‘నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల’గా... చేశారు. సుశీల, బాలూ పాడిన ఈ పాట మంచి ఆహ్లాదంగా ఉంటుంది. పాటలో శోభన్‌బాబు పక్కన హైదరాబాద్ స్టార్ రూప కూడా.
 ఏమైనా ఈ కథ అనంతం. ఈ పాటల తీపికి లేదు అంతం.
 
గొంతుతో గెలిచిన నటుడు...
రాజ్‌కుమార్‌ను అందరూ ఇష్టపడరు. కాని ఇష్టపడేవాళ్లు మాత్రం విపరీతంగా ఇష్టపడతారు. పరిమితమైన శరీర కదలికలతో గంభీరమైన గొంతుతో ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో పేరు తెచ్చుకున్న నటుడాయన. కశ్మిర్ పండిట్ కుటుంబాల నుంచి వచ్చి బాలీవుడ్‌లో నిలదొక్కుకున్న తొలితరంవారిలో ఆయన ఒకడు. దిల్ ఏక్ మందిర్, వక్త్, హమ్‌రాజ్, నీల్ కమల్, హీర్ రాంజా... వంటి హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. దిలీప్ కుమార్‌తో ఎందుకనో వైరం వచ్చింది. ఇద్దరూ కలిసి ‘పైగామ్’లో నటించారు. ఆ తర్వాత 32 ఏళ్లకు సుభాష్ ఘాయ్ ‘సౌదాగర్’లో నటించారు. రాజ్‌కుమార్ అసలు రూపం ఎవరూ చూడలేదు.



ఆయన ఎప్పుడూ విగ్‌లో ఉండేవాడు. నిజ జీవితంలో కూడా విగ్ వాడిన మొదటి నటుడు బహుశా ఆయనే కావచ్చు. ఎవరినీ కలవకుండా రిజర్వ్‌డ్‌గా ఉండటానికి ఇష్టపడిన రాజ్‌కుమార్ తను చనిపోయేముందు  కుటుంబానికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. అంతిమ సంస్కారాలు ముగిశాకే తన మరణవార్త లోకానికి తెలియచేయమన్నాడు. కుటుంబ సభ్యులు ఆయన కోరిక నెరవేర్చారు. అందువల్ల ఆయన అంతిమయాత్రలో పాల్గొనే సంగతి దేవుడెరుగు కనీసం చివరి చూపులు కూడా ఆయన అభిమానులకు దక్కలేదు. రాజ్ కుమార్ అనగానే ‘పాకీజా’లో డైలాగ్ గుర్తుకు వస్తుంది. గుర్తుంది కదా... ‘ఆప్ కే పావ్ దేఖా. బహూత్ హసీన్ హై. ఇన్ హే జమీన్ పర్ మత్ ఉతారియేగా. మైలే హోజాయేంగే’... ( మీ పాదాలు చూశాను. చాలా అందంగా ఉన్నాయి. నేల మీద దించకండి. మాసిపోతాయి’)...
 
ఆమె.... అతడూ...
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నా లేకపోయినా ప్రతి స్త్రీ పరాజయం వెనుక మాత్రం చాలామంది పురుషులు ఉంటారు. మీనాకుమారి జీవితం చూస్తే అదే అనిపిస్తుంది. కటిక పేదరికం, దారుణమైన పరిస్థితులు ఆమెను సినిమా రంగంలో బలవంతంగా ప్రవేశపెట్టాయి. ఆమె తండ్రికి ఆమె సంపాదన తప్ప వేరే మార్గం లేదు. సరే సినిమాల్లో నటించింది.. రాణించింది... స్టార్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కంటే పదిహేనేళ్ల పెద్దవాడైన దర్శకుడు కమాల్ అమ్రోహి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు పరిణితి లేకపోయినా ఆయనకైనా ఉండి ఉంటే ఆ పెళ్లి ఎంత దాకా వెళ్లగలిగేదో ఊహించి ఉండేవాడు. అలాగే అయ్యింది. 1960ల నాటికి ఇద్దరూ విడివిడిగా ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే కవి గుల్జార్ కొన్నాళ్లు ఆమెకు దగ్గరయ్యాడు. అంతకంటే ఎక్కువగా హీరో ధర్మేంద్ర.



సినిమా రంగంలో ఎటువంటి సంబంధం గాని మంచి చదువుగాని లేకుండా కేవలం కండలని నమ్ముకుని ముంబై చేరుకున్న ఈ హీమేన్ మొదటిసారిగా ‘పూర్ణిమ’ అనే సినిమాలో మీనాకుమారి పక్కన నటించాల్సి వచ్చింది. అప్పటికే ఆమె సూపర్‌స్టార్ కనుక ఇతడికి ఆమె ముందు చేయీ కాలూ ఆడలేదు. నోట మాట రాలేదు. కాని మీనా కుమారి ఎంత మంచి కోస్టార్ అంటే అతడి అనీజీని గమనించి చనువుగా చెవి మెలివేసిందట. దాని వల్ల చెవి ఎర్రగా అయ్యే సరికి ‘భడవా... ఎంత రంగు ఉన్నావ్’ అని పెద్దగా నవ్విందట. దాంతో భయం పోయి ధర్మేంద్ర హాయిగా నటించగలిగాడట. ఈ విషయాన్ని ధర్మేంద్రే చెప్పుకున్నాడు.

మీనా కుమారి దాదాపుగా ధర్మేంద్రకు గురుస్థానంలో వెళ్లి అతడికి యాక్టింగ్‌లోని మెలకువలన్నీ నేర్పింది. నువ్వు పెద్ద హీరోవి అవుతావు అని జోస్యం చెప్పింది. అదే నిజమయ్యింది కూడా. కాని మీనా కుమారితో ధర్మేంద్ర స్నేహం రేయింబవళ్లు ధర్మేంద్ర ఆమె ఇంట్లోనే ఉండటం ఇద్దరూ కలిసి తాగడం ఇవన్నీ పెద్ద గొడవలకు దారి తీశాయి. ధర్మేంద్ర భార్య దాదాపు యుద్ధం ప్రకటించింది. మీనా కుమారి అక్కను పెళ్లి చేసుకున్న కమెడియన్ మెహమూద్ కూడా ఈ గొడవను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద వారిద్దరినీ విడదీయగలిగినా తాగుడుకు బానిసైన మీనా కుమారిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా ధర్మేంద్ర ఆమె పరిస్థితి చూడలేక రోదిస్తూ బయటకు వచ్చేవాడట. మీనా కుమారి 1972లో తన 39వ ఏట మరణించింది. ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర హాస్పిటల్ బిల్లులకు డబ్బు లేదు. చనిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి. విషాద నాయిక విషాదకరమైన ముగింపు అది.
 
టున్ టున్
టున్ టున్ అంటే అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. కాని దానిని పెట్టింది మాత్రం దిలీప్ కుమార్. టున్ టున్ దిలీప్ కుమార్‌కు మంచి ఫ్రెండ్. మ్యూజిక్ డెరైక్టర్ నౌషాద్‌కు క్లోజ్ ఫ్రెండ్. పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి నౌషాద్ ఇంటి తలుపు తడితే గాయనిగా ఆయనే అవకాశం ఇచ్చాడు. అవును.



టున్ టున్ తన అసలు పేరు ఉమా దేవి పేరుతో చాలా హిట్ పాటలు పాడింది. వాటిలో అందరికీ తెలిసిన ‘అఫ్‌సానా లిఖ్ రహీ హూ దిలే బేకరార్‌కా’ వంటి హిట్స్ ఉన్నాయి. కాని ఎక్కువ రోజులు సింగర్‌గా కెరీర్ కొనసాగించలేకపోతే దిలీప్ కుమార్ ఆమెను నటిని చేశాడు. లావుగా ఉండే ఆమె ఆకారాన్ని బట్టి కమెడియన్‌గా రాణిస్తావ్ అన్నాడు. చాలా సినిమాల్లో హీరోకు లైన్ వేసే లట్టు అమ్మాయిగా టున్ టున్ కనిపిస్తుంది. ఎనభై ఏళ్లు జీవించి 2003లో మరణించినా తెలుగులో గయ్యాళులకు సూర్యకాంతం అనే పేరు ఎలా పడిందో ఉత్తరాదిన లావుగా ఉన్న ఆడవాళ్లకు టున్ టున్ అనే పేరు మిగిల్చి వెళ్లింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement