టియుఆర్‌పితో స్తంభనలు తగ్గవు | Sakshi
Sakshi News home page

టియుఆర్‌పితో స్తంభనలు తగ్గవు

Published Thu, Aug 20 2015 11:47 PM

Homeopathic counseling

హోమియో కౌన్సెలింగ్
 
ఐబిఎస్‌కు హోమియోలో మంచి చికిత్స!
 నా వయసు 38 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి.
 - సూర్యకుమారి, నెల్లూరు

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే  జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు  దీర్ఘకాల జ్వరాలు  మానసిక ఆందోళన  కుంగుబాటు  ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం జన్యుపరమైన కారణలు  చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.
 దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.

వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి  పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ర్పభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
 
 టియుఆర్‌పితో స్తంభనలు తగ్గవు

 నా వయసు 60. షుగర్, బీపీ సమస్యలు లేవు. సెక్స్ కూడా నార్మల్‌గానే  చేయగలుగుతున్నాను. కానీ మూత్రవిసర్జన మాత్రం సాఫీగా జరగడం లేదు. ముక్కి ముక్కి చాలాసేపు మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. రాత్రి కూడా చాలాసార్లు నిద్రలేవాల్సి వస్తోంది. యూరాలజిస్ట్‌ను సంప్రదిస్తే టీయూఆర్‌పీ అనే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. దీనివల్ల అంగస్తంభనకు, సెక్స్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నాకు ఇప్పుడు సెక్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. సర్జరీ చేస్తే అంగస్తంభనలు తగ్గుతాయేమోనని ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - జీఎస్‌ఆర్., వరంగల్

 సాధారణంగా యాభై ఏళ్ల తర్వాత ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం క్రమంగా పెరగవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తాయి. దీనికి చికిత్సగా మొదట్లో కొన్ని మందులే వాడతాం. అయితే మందులు వాడాక కూడా కూడా మూత్రధార సరిగా రాక, మూత్రం లోపల మిగిలిపోయినట్లుగా అనిపిస్తుంటే అప్పుడు ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా టీయూఆర్‌పీ సర్జరీ చేస్తారు. ఇందులో ప్రోస్టేట్ గ్రంథిని 90 శాతం వరకు తొలగిస్తారు. సాధారణంగా ఈ సర్జరీ వల్ల ఎలాంటి అంగస్తంభన సమస్యలు రావు. నిపుణులైన శస్త్రచికిత్సలు సర్జరీ నిర్వహిస్తే... అసలు ఈ సర్జరీకీ, అంగస్తంభనకు సంబంధమే ఉండదు. కాకపోతే టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత వీర్యం పరిమాణం తగ్గవచ్చు. మీరు నిర్భయంగా శస్త్రచికిత్స చేయించుకోండి.
 
నాకు 26 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం నేను ఒక వేశ్యతో కలిశాను. నాకు ఎలాంటి బాధలూ లేకపోవడంతో దాన్ని గురించి పట్టించుకోలేదు. ఇటీవల ఒక సందర్భంలో రక్తపరీక్ష చేయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ట్రిపనిమల్ యాంటీబాడీస్‌కు పాజిటివ్ అని రిపోర్డు వచ్చింది. ఇదొక సుఖవ్యాధి అని డాక్టర్ చెప్పారు. ఈ జబ్బు తగ్గడానికి అవకాశం ఉందా? నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన సమాధానం చెప్పండి.
 - ఎ.ఎస్.ఎమ్., కందుకూరు

ట్రిపనిమా అనేది సిఫిలిస్‌ను కలిగించే బ్యాక్టీరియా. ఇది సెక్స్ ద్వారా సంక్రమించే జబ్బు. మీరు గతంలో ఒకసారి వేశ్యను కలిశారు కాబట్టి ఈ జబ్బు పాజిటివ్ వస్తే మళ్లీ మీ ఇమ్యూనిటీకి సంబంధించిన మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. అయితే దీనికి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. దాంతో మీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. మీరు ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని యాండ్రాలజిస్ట్ లేదా యూరాలజిస్ట్‌ను కలిసి పూర్తిస్థాయి చికిత్స తీసుకోండి. మీ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది.
 
ఎండోక్రైనాలజీ కౌన్సెలింగ్

 
 హైపర్ థైరాయిడిజమ్‌కు చికిత్స ఉంది
 మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల గుండె దడగా ఉంటోందనీ, చెమటలు ఎక్కువగా పడుతున్నాయనీ చెబుతున్నారు. బరువు తగ్గిపోతోంది. అరచేతులు ఎక్కువగా తడిగా ఉంటున్నాయి. మా అమ్మగారికి ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి సరైన సలహా ఇవ్వగలరని ప్రార్థన.
 - ఇందుమతి, విజయవాడ

 మీరు తెలిపిన వివరాలనూ, లక్షణాలనూ పరిశీలిస్తే మీ అమ్మగారు ‘హైపర్ థైరాయిడిజమ్’తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కండిషన్ ఉన్నవారిలో జీవక్రియల నిర్వహణ రేటు పెరుగుతుంది. మీ అమ్మగారిలో కనిపిస్తున్న లక్షణాలతో పాటు కంగారుపడటం, చిరాకు, గుండెదడ, ఆందోళన, నిద్రలేమి, కండరాల బలహీనత, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి మీరు వెంటనే మీ అమ్మగారికి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించండి.

హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కువ కావడం, టీఎస్‌హెచ్ మోతాదు బాగా తగ్గిపోవడం కనిపిస్తుంది.

చికిత్స : దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం మూడు పద్ధతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేస్తారు. ఇలా  హార్మోన్ ఉత్పత్తిని  తగ్గిస్తారు. రేడియో అయోడిన్ తీసుకోలేని సందర్భంలో, తక్కువ మోతాదులో యాంటీథైరాయిడ్ మందులు వాడాల్సివస్తుంది. మూడో పద్ధతిలో థైరాయిడ్ గ్రంథిని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. కానీ రేడియో అయోడిన్ వాడటం వల్ల, థైరాయిడ్ ఆపరేషన్ వల్ల హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గవచ్చు. అప్పుడు జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి వస్తుంది. సాధారణంగా మిగతా రెండు పద్ధతులు ఉపయోగపడనప్పుడు ఆపరేషన్ మాత్రమే చేస్తారు. మీ అమ్మగారికి డయాబెటిస్ ఉన్నందున రక్తంలో చక్కెర తగ్గినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు గమనించవచ్చు. కానీ అరచేతుల్లో చెమటలు పట్టడం అనే లక్షణం వల్ల హైపర్ థైరాయిడిజమ్ ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి సత్వరమే రక్తపరీక్షలు చేయించుకొని, దగ్గర్లోని ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
 
 డర్మటాలజీ కౌన్సెలింగ్
 
మొటిమలూ - వాటివల్ల వచ్చిన మచ్చలను తగ్గించవచ్చు
 నా వయసు 19 ఏళ్లు. నా ముఖం మీద మొటిమలు, మచ్చలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా తగ్గడం లేదు. నేను బెట్నోవేట్ అనే క్రీమ్ వాడుతున్నాను. దాంతోపాటు ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్ కూడా తీసుకుంటున్నాను. అయినా ఎలాంటి మార్పూ రావడం లేదు. దయచేసి మొటిమలు, మచ్చలు తగ్గడానికి నేనేం చేయాలో సూచించండి.
 - విజయ్, ఈ-మెయిల్

మీ వయసు వారిలో ఇలా మొటిమలు రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. ఈ వయసు పిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ల పాళ్లు పెరగడం వల్ల చర్మంపై మొటిమలు రావడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మీ విషయంలో ఇది స్టెరాయిడ్ ఇండ్యూస్‌డ్ యాక్నే లా అనిపిస్తోంది. మీరు బెట్నోవేట్ క్రీమ్ రాస్తున్నట్లు చెబుతున్నారు. బెట్నోవేట్ అనే క్రీమ్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. దీనిలోని స్టెరాయిడ్ వల్ల మొదట్లో కొంచెం ఫలితం కనిపించినట్లు అనిపించినా... ఆ తర్వాత మొండిమొటిమలు (ఒక పట్టాన తగ్గనివి) వస్తాయి. అందుకే మీరు ఈ కింది సూచనలు పాటించండి.
     
మొదట బెట్నోవేట్ క్రీమ్ వాడటాన్ని ఆపేయండి.    క్లిండామైసిన్ ప్లస్ అడాపలీన్ కాంబినేషన్‌తో తయారైన క్రీమ్‌ను రోజూ రాత్రిపూట మొటిమలపై రాసుకొని పడుకోండి.అజిథ్రోమైసిన్-500 ఎంజీ క్యాప్సూల్స్‌ను వరసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇలా మూడు వారాలు వేసుకోవాలి. అంటే మొదటివారం సోమ, మంగళ, బుధ వారాలు తీసుకున్నారనుకోండి. దీన్నే రెండో వారం, మూడోవారం కూడా కొనసాగించాలి. ఈ అజిథ్రోమైసిన్ క్యాప్సూల్‌ను ఖాళీ కడుపుతో అంటే భోజనానికి ముందుగానీ... ఒకవేళ భోజనం చేస్తే... రెండు గంటల తర్వాత గానీ వేసుకోవాలి.

మీరు వాడుతున్న ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ను అలాగే కొనసాగించండి.  అప్పటికీ మొటిమలు తగ్గకపోతే కాస్త అడ్వాన్స్‌డ్ చికిత్సలైన సాల్శిలిక్ యాసిడ్ పీలింగ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండువారాలకు ఒకసారి చొప్పున కనీసం ఆరు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొటిమల వల్ల ముఖంపై గుంటలు పడినట్లుగా ఉంటే, వాటిని తొలగించడానికి ఫ్రాక్షనల్ లేజర్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి.
 
 

Advertisement
Advertisement