బిడ్డ తల ఫ్లాట్?.. ఆందోళన అక్కర్లేదు! | Sakshi
Sakshi News home page

బిడ్డ తల ఫ్లాట్?.. ఆందోళన అక్కర్లేదు!

Published Tue, Mar 8 2016 11:12 PM

బిడ్డ తల ఫ్లాట్?.. ఆందోళన అక్కర్లేదు!

హోమియో కౌన్సెలింగ్
 
రాబోయే ఎండాకాలంలో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని చాలా వార్తలు వింటున్నాం. ఈ అధిక భానుడి తాపాన్ని తట్టుకొని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు.
 - ప్రసన్నకుమారి, వరంగల్

 భానుడి తాపం అధికం కావడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఏ వయస్సు వారికైనా వడదెబ్బ తగలవచ్చు. అయితే ఇది చిన్నపిల్లలను, వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీనిబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఆ చెమటపట్టమే ఎక్కువ సమయం కొనసాగితే నీరు, లవణాలు కోల్పోతారు. ఇలా కోల్పోయిన నీరు, లవణాలు తిరిగి భర్తీ కానప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీర కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకుంటాయి. దీనివలన రక్తం పరిమాణం తగ్గి, శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ మందగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

లక్షణాలు: ఎండదెబ్బకు గల లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. శరీరం శీతలీకరణ వ్యవ్థ కోల్పోవడం వలన శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్‌హీట్ పైగా పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు: నీరు, ఇతర ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వదులుగా ఉండే, పల్చని, లేతవర్ణం దుస్తులు వేసుకోవాలి. కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. మద్యపానం, కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్రవిసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కి గురిచేస్తాయి. కాబటి ద్రవ పదార్థాలు  ఎక్కువగా తీసుకోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. ఒంటికి చల్లగాలి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
 
మా పాప వయసు 13 నెలలు. పాపకు తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. పరిశీలించి చూస్తే ఒకవైపున సొట్టపడ్డట్లుగా అనిపిస్తోంది. దీనికి చికిత్స అవసరమా?
 - సంధ్య, అనంతపురం  

 మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తే... మీ పాపకు పొజిషనల్ సెఫాలీ అనే కండిషన్ ఉందని అనిపిస్తోంది. దీన్నే ఫ్లాటెన్‌డ్ హెడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. పిల్లలను ఎప్పుడూ ఒకే స్థితిలో  పడుకోబెట్టినప్పుడు ఇది కనిపిస్తుంది. కొన్ని  సందర్భాల్లో పాప గర్భంలో ఉన్నప్పుడు ఇది మొదలై ఉండవచ్చు. ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. దీన్నే క్రేనియో సినోస్టాసిస్ అంటారు. అయితే ఇది కాస్తంత తీవ్రమైన సమస్య.
 
పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. అంటే కాలక్రమంలో తలలోని సొట్టలు కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పిల్లల్లో కూడా సాధారణ పిల్లల్లాగానే తెలివితేటలుంటాయి. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రిషియన్‌కు చూపించండి. ఇది పొజిషనల్ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. కేవలం తల ఒకవైపు ఫ్లాట్‌గా కనిపిస్తుండటమే సమస్య అయితే దాని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు.
 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ,
హైదరాబాద్
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
 
మా బాబు వయసు 25 ఏళ్లు. బరువు 75 కేజీలు. తనకు ఈమధ్యే గుండెలో నొప్పి వచ్చింది. డాక్టర్‌ను కలిస్తే ముందుగా బరువు తగ్గమని చెప్పారు. లేదంటే గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయని అన్నారు. ఇంత చిన్న వయసులో గుండెజబ్బులు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
 - కమల, విజయవాడ

గుండెజబ్బులు ఒక వయసు దానిటి తర్వాత వస్తాయనేది గతంలో అభిప్రాయం. గుండెజబ్బుల విషయంలో ఇప్పుడు ఎదురవుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు గత అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులతో పోలిస్తే మన దేశవాసుల్లో స్వతహాగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు మారుతున్న ఆహారపు అలవాట్లు... అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండటం కోసం ఉపయోగించే మార్జరిన్ వంటి నూనెలు, కొవ్వులు ఉండే ఆహారపదార్థాలను వాడటంతో పాటు శరీరంలో కదలికలు లేని తరహా వృత్తులు పెరగడం, శరీరానికి అవసరమైన కొద్దిపాటి కదలికలు కూడా లేకపోవడం వల్ల చిన్నవయసులోనే గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి.
 
నివారణ ఇలా.
..  వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేనివాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాల పాటు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది  చక్కెర, రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా వాటిని అదుపులో పెట్టుకోవాలి  పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే  హైబీపీ ఉన్నవారు ఆహార నియమాలు తప్పక పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ (డ్యాష్) అంటారు. అవి...  ఆహారంలో ఉప్పుతో పాటు బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్ తగ్గించాలి  తాజా పండ్లు, పొట్టుతో ఉండే  తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి  కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి  వేటమాంసం, కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామం చేయవచ్చు  రోజూ కనీసం 6- 8 గంటలు నిద్రపోవాలి.  నడుము కొలత కూడా గుండెజబ్బులకు ఒక సూచనే. పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉండే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి. పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం ఉన్నవారు వారు ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిశ్చింతగా ఉండవచ్చు.
 
డాక్టర్
హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement