పక్క తడుపుతున్నాడు | Sakshi
Sakshi News home page

పక్క తడుపుతున్నాడు

Published Sat, Oct 1 2016 12:20 AM

Homeopathic counseling

హోమియో కౌన్సెలింగ్
మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రాత్రి నిద్రలో అప్పుడప్పుడు పక్క తడుపుతున్నాడు. కొన్నిసార్లు పగటి నిద్రలో కూడా. దీనికి కారణం ఏమిటి? హోమియో ద్వారా దీన్ని నివారించవచ్చా?     
- ఒక సోదరి, మోత్కూరు
 
ప్రపంచంలో ప్రతి మూలలోనూ ఇలాంటి సమస్యతో పిల్లలు, ఈ కారణంగా బాధపడే తల్లిదండ్రులు ఉంటారు. దీన్ని బెడ్‌వెట్టింగ్ లేదా నాక్చర్నల్ అన్యురసిస్ లేదా స్లీప్ వెట్టింగ్ అంటారు. కొందరు పిల్లలు పగలు నిద్రపోయేటప్పుడు కూడా మూత్రవిసర్జన చేస్తుంటారు. ముఖ్యంగా ఆరు సంవత్సరాలలోపు పిల్లల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా చూస్తుంటాం. మూత్రాశయం మీద నియంత్రణ నాలుగు సంవత్సరాల వయసులో వస్తుంది. కొందరిలో ఆ తర్వాత వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో 16 శాతం మందిలో, ఆరేళ్ల పిల్లల్లో 13 శాతం, ఏడు-ఎనిమిదేళ్ల పిల్లల్లో 9 శాతం మందిలో, పది-పద్నాలుగేళ్ల పిల్లల్లో 4 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది.
 
బెడ్ వెట్టింగ్ అన్నది పిల్లల్లో అసంకల్పితంగా జరుగుతుంది. ఎవ్వరూ కావాలని ఇలా చేయరు. దీనివల్ల బాధపడే పిల్లలు బయట ఎవరికీ దీన్ని చెప్పుకోలేరు. ఇక తల్లిదండ్రులు దీని గురించి పిల్లలపై అరవడం, వారిని భయపెట్టడం చేస్తుంటారు. తాము పెద్ద తప్పు చేస్తున్నామనే అపరాధ భావనను పిల్లల్లో కలిగిస్తుంటారు. అది పిల్లల్లో మరింత ఆత్మన్యూనతకు కారణమవుతుంది.
 
కారణాలు :  మూత్రంలో ఇన్ఫెక్షన్  వంశపారంపర్యం  ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం  కొందరిలో మానసిక వైకల్యం  ఫుడ్ అలర్జీలు
 
లక్షణాలు : రాత్రిపూట పక్క తడపడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా పిల్లల్లో  కనిపిస్తుంటాయి. అవి...  మాటిమాటికీ మూత్ర విసర్జన చేస్తుండటం  మూత్రంలో మంట  మలబద్దకం
 
వ్యాధి నిర్ధారణ : యూరినరీ అనాలసిస్, అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్
 
చికిత్స : హోమియోలో మంచి మందులు ఉన్నాయి. కండరాలను నియంత్రణలోకి వచ్చేలా చేయడంలో అవి బాగా తోడ్పడతాయి. హోమియోలో నక్స్‌వామికా, పల్సటిల్లా, సెపియా, కాస్టికమ్ వంటి మందులు ఇందుకు సమర్థంగా తోడ్పడతాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో అవి వాడాల్సి ఉంటుంది.
- డాక్టర్ మురళి
కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్

Advertisement
Advertisement