ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ అనామకులు | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ అనామకులు

Published Sat, Jun 11 2016 10:36 PM

ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ అనామకులు

అవమానం

 

ఇళయరాజాకి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది! అవమానమా? ఎవరు అవమానించి ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే లోకంలో అవమానించేవారు అంటూ ఎవరూ ఉండరు. అవమాన పడేవాళ్లు మాత్రమే ఉంటారు. పట్టించుకుని ఫీల్ అయితే అవమానం. ఫీల్‌ని వదిలేస్తే.. జస్ట్ అదొక అనుభవం.

 

ప్రముఖులకు, ప్రసిద్ధులకు జరిగే అవమానాలు సాధారణంగా పెద్దపెద్దవి అయి ఉండవు. కానీ పెద్దవాళ్లు కాబట్టి చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతుంటారు. సగటు మనుషులుగా ఇది మన అబ్జర్వేషన్ మాత్రమే అయి ఉండొచ్చు కూడా. ఏదైనా నొప్పి నొప్పే. నొప్పించిన వాళ్లు డ్యూటీలో భాగంగా నొప్పించినా సరే.. గొప్పవాళ్లు బాధపడే అవకాశం ఉంది.  


ఇళయరాజా కూడా అలాగే బాధపడ్డారు. అవమానం ఫీల్ అయ్యారు. ఆ సంగతి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. గతవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం మంగుళూరు వెళ్లారు. దర్శనం అయ్యాక చెన్నైకి తిరుగు ప్రయాణం కట్టారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆయన్ని భద్రత అధికారులు ఆపి తనిఖీ చేశారు! ఇళయరాజా దగ్గర ఉన్న దైవ ప్రసాదాన్ని వాళ్లు మరింకేదో అని అనుమానించి, ప్రసాదంతో పాటు ఇళయరాజా దగ్గర ఉన్న మిగతా సరంజామానంతా తనిఖీ చేశారు. ఆయన వివరణ ఇవ్వబోయినా వినిపించుకోలేదు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కూడా చెక్ చేశారు. ఈ సంగతి తెలిసి ఇళయరాజా అభిమానులు కలత చెందారు. ఎండీఎంకే నేత వైగో ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక సంగీత దర్శకుడిని.. ఎవరో అపరిచితుణ్ణి చేసినట్టుగా తనిఖీ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  

భారతీయ సెలబ్రిటీలు ఇలా ఇంటా బయటా విమానాశ్రయాలలో మరీ అవమానం కాకపోయినా, అభాసుపాలైన సంఘటనలు మరికొన్ని ఉన్నాయి. 

 

2013లో రణ్‌బీర్ కపూర్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుక్ అయ్యాడు. అతడు లెక్కలో చూపించని వస్తువులు అధికారుల తనిఖీలో బయపడడంతో కపూర్ అక్కడికక్కడ కస్టమ్స్ వాళ్లకు లక్ష రూపాయలు కక్కవలసి వచ్చింది. పెనాల్టీగా మరో 70 వేలు. అయితే అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో వస్తువుల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత కపూర్ మనుషులు డబ్బు కట్టి వాటిని విడిపించుకున్నారు.

  

 
అనుష్కా శర్మ 2011లో ఏదో అవార్డు ఫంక్షన్‌కి ఫారిన్ వెళ్లి వస్తూ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్లకు పట్టుబడ్డారు. అమె దగ్గర్నుంచి 45 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను, అతి ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

 
అదే ఏడాది బిపాష బసును ముంబై ఏర్‌పోర్ట్ అధికారులు తనిఖీ కోసం ఆపారు. ఆమె దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగ్ భారీగా కనిపించడంతో వారికి అనుమానం వచ్చి చూశారు. చిన్న పాటి వస్తువులకు 12 వేలు సుంకం కట్టించుకుని, గంటపాటు నానా రకాల ప్రశ్నలు వేసి ఆమెను వదిలిపెట్టారు.

  


2012లో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌ని చికాగో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్లు, ఇమిగ్రేషన్ వాళ్లు ఇద్దరూ కలిసి ఆయన్ని ఒళ్లంతా తడిమి చూశారు. రకరకాల ప్రశ్నలతో విసిగించారు. ఒక కథనం ప్రకారం ఆయన బట్టలు కూడా తీయించి చెక్ చేశారు! ఈ చర్యలను ఆమిర్ ఎంతో అవమానకరమైనవిగా భావించారు.

  

 
జాన్ అబ్రహాం 2009లో యు.ఎస్. వెళ్లినప్పుడు న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ సిబ్బంది ఆపి చాలాసేపు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. అతడి పాస్‌పోర్ట్‌లో ఓసారెప్పుడో ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లివచ్చినట్లు ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. తను సినిమా నటుడినని చెప్పి, వారిని ఒప్పించి ఎలాగో బయటపడ్డాడు అబ్రహాం.

  

ఇదే ఎయిర్‌పోర్ట్‌లో అదే ఏడాది షారుక్‌ఖాన్‌ని అధికారులు ఆపేశారు. అప్పుడాయన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం ముందస్తు ప్రమోషన్ టూర్‌లో వున్నారు. పేరు చివర ఖాన్ అని ఉండడంతో అనుమానించిన అధికారులు షారుఖ్‌ని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. అక్కడి భారతీయ రాయబారులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని షారుక్‌ని విడిపించాల్సి వచ్చింది.

  

 వీళ్లందర్నీ అలా ఉంచండి. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌నే ఏర్‌పోర్ట్ అధికారులు అడ్డుకుని, ప్రశ్నలతో సతమతం చేశారు. 2011లో ఆయన్ని యు.ఎస్.లోని. జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది జాకెట్, షూజ్ విప్పించి మరీ తనిఖీ చేశారు. ఆ తర్వాత ఈ విషయమై అమెరికా, ఇండియాకు క్షమాపణ చెప్పింది. 2009లో కూడా కలామ్‌కి ఇలాంటి అవమానమే జరిగింది. న్యూఢిల్లీలో ఆయన ఎక్కిన కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ (యు.ఎస్.) విమాన సిబ్బంది ఆయన్ని  క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదిలిపెట్టారు.

 


అయితే కలామ్ ఈ రెండు సందర్భాలలోనూ అవమానంగా ఫీల్ అవలేదు. నవ్వుతూ తనిఖీ అధికారులకు సహకరించారు. ఆయన తరఫున భారత ప్రభుత్వం మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. పైన ‘పట్టుబడ్డ’ బాలీవుడ్ ప్రముఖులలో ఎక్కువమంది నిబంధనలు అతిక్రమించారు. కాబట్టి వాళ్లు దానిని అవమానంగా ఫీల్ కానవసరం లేదు. ఇక ఇప్పుడు ఇళయరాజాకు జరిగింది అవమానమా కాదా అన్నది కూడా ఆయన దానిని ఎలా తీసుకున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement