రక్తపు మడుగులో నేను! | Sakshi
Sakshi News home page

రక్తపు మడుగులో నేను!

Published Wed, Jun 11 2014 11:59 PM

రక్తపు మడుగులో నేను! - Sakshi

కనువిప్పు
 
ప్రతి మనిషికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుందిగానీ, ఒకప్పుడు నా ఒంట్లో రక్తం కంటే స్వార్థమే ఎక్కువగా ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని కూడా నా కోణంలో నుంచే  చూసేవాడిని. ‘‘నాకేమిటి?’’ అని అడిగేవాడిని. ఇక ఇతరులకు సహాయపడడం అనేది కలలో మాట.
 ఎవరైనా నా దగ్గరకి సహాయానికి వస్తే... ‘‘ఒకరి దగ్గర చేతులు చాచడానికి సిగ్గు లేదూ?’’ అని మండి పడేవాడిని. నా వ్యవహారం తెలిసి అందరూ దూరంగా ఉండేవారు. నాతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపేవారు కారు. కానీ నేను ఇలాంటివి పట్టించుకునేవాడిని కాదు. ఎప్పుడూ నా స్వార్థమేదో నేను చూసుకునేవాడిని. ఇంటర్ చదువుతున్న రోజుల్లో నా స్నేహితుడితో కలిసి సినిమాకు వెళుతున్నాను. అప్పటికే సినిమా టైం అయిపోయిందని వేగంగా నడుస్తున్నాం. ఈలోపే మా కళ్ల ముందు ఓ యాక్సిడెంట్ జరిగింది.

‘‘అరెరే...’’ అంటూ నా స్నేహితుడు వారికి సహాయం చేయడానికి పరుగెత్తాడు. నేనూ వాడి వెనకాలే పరుగెత్తాను. నేను పరుగెత్తింది ప్రమాదంలో గాయపడిన వారికి సహాయపడడానికి కాదు. సినిమా గురించి ఫ్రెండ్‌కు గుర్తు చేయడానికి! ‘‘ఒరేయ్...ఇలాంటివి రోజూ ఎన్నో జరుగుతుంటాయి. మనం కాకపోతే ఎవరో ఒకరు వాళ్ళను హాస్పిటల్‌కు తీసుకుపోతారు. ఓవర్ యాక్షన్ ఆపి...సినిమాకు పదా’’ అన్నాను ఎవరికీ వినబడకుండా. వాడు నా వైపు అదో రకంగా చూసి- ‘‘ఛీ...నువ్వు  ఈ జన్మలో మారవు’’ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా సినిమా చూడడానికి వెళ్లాను. ఇది జరిగిన కొద్ది కాలానికి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో...నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ ‘‘రక్షించండీ... రక్షించండీ’’ అని అరుస్తుంటాను. కానీ నన్ను ఎవరు పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళుతుంటారు. కొద్దిసేపటి తరువాత చనిపోయానన్నది ఆ కల సారాంశం. ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చున్నాను. ఈ కల తరువాత...నాలో పూర్తిగా మార్పు వచ్చింది.

 ‘‘మనం ఎవరికీ సహాయం చేయకపోతే, మనకూ ఎవరూ సహాయం చేయరు’’ అనే విషయం బోధపడింది.  ఇక అప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయడం నేర్చుకున్నాను. స్వార్థాన్ని వదిలాను. ఇప్పుడు  నా మనసుకు ఎంతో తృప్తిగా ఉంది.
 - డియస్‌కె, విజయనగరం
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement