Sakshi News home page

చేతులు కట్టుకుని శ్లోకాలు చెబితే చాలా!!

Published Sat, Oct 15 2016 10:49 PM

చేతులు కట్టుకుని   శ్లోకాలు చెబితే చాలా!!

మానవీయం


అనుష్ఠానబలంచేత జనన మరణ చక్రంనుండి విడుదల పొందడం అనేది వాసనాబలం ఉన్న మనుష్యజన్మలో మాత్రమే సాధ్యం. వాసనలలో అన్నివేళలా మంచివే ఉండవు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఒకొక్కదాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. వాసన అంటే ముక్కుతో పీల్చేదికాదు, గత జన్మలనుంచి తెచ్చుకున్న వాసనలలో ఒకటి. అన్నీ ఆయనకు ప్రీతే. కానీ ధనమునందు ఆయనకు విశేషమైన అపేక్ష. అప్పుడేమవుతుంది? ఆయన తనను తాను సంస్కరించుకోకపోతే’ జ్ఞానఖలునిలోని శారదయువోలె..’... అంటే మీరక్కడ తాంబూలం పెడితే తప్ప ఆయనేదీ చెప్పడు. మీరెంతిస్తారో చెబితే తప్ప ఆయన సభకు రాడు. అంటే అమ్ముకోవడానికి అదో వస్తువయింది. తాంబూలం పుచ్చుకుంటే తప్పేంలేదు. నాకింతిస్తేనే రామాయణం చెబుతానన్నాననుకోండి. అది చాలా ప్రమాదం. రామాయణం తెలుసు. డబ్బుకోసం తప్ప, రామాయణం ధర్మంకోసం కాకుండా పోయింది. ఇలా ఒక్క వాసన, మిగిలి ఉన్న మంచి గుణాలను పాడు చేసేస్తుంది. ఇది పోవాలంటే భగవంతుడిని శరణాగతి వేడుకోవాలి. లేదా మహాపురుషుల స్పర్శచేత కూడా పోతుంది.పెద్దలతో కలిసి తిరిగితే ఆ దోషం పోతుంది. ‘ఛీ! ఛీ! నేనిలా బతక్కూడదు...’ అనే బుద్ధి ఉండిపోతుంది.

 
రామకృష్ణ పరమహంస ఏమంటారంటే... ‘‘ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు తొండం ఎత్తి ఒక జాజితీగ పీకుతుంది, ఓ చెట్టుకొమ్మను పట్టుకుని విరిచేస్తుంది. అలావెడుతూ పక్కన ఒక దుకాణంలోంచి ఒక అరటిపళ్ళ గెల ఎత్తి లోపల పడేసుకుంటుంది. అదే ఏనుగు పక్కన మావటివాడు అంకుశం పట్టుకుని నడుస్తూ పోతున్నాడనుకోండి. అదిలా తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం చూపగానే దించేస్తుంది తప్ప దేనినీ పాడుచేయదు. అలాగే మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్యబలంచేత నీలో ఉన్న వాసనాబలం పాడవకుండా రక్షింపబడుతుంది’’ అంటారు.

 
‘‘నేను ఫలానా గురువుగారి శిష్యుణ్ణి, అయన నడవడి ఎలా ఉంటుందో, ఆయనెలా ప్రవర్తిస్తారో తెలిసి నేనిలా ప్రవర్తించొచ్చా ! నేనిలా ఉండకూడదు, మార్పు చెందాలి’’అనుకొని దుష్కర్మలకు దూరంగా ఉండిపోతారు. చెడుబాట పట్టిన వాసనాబలం మహాత్ముల సంగమం చేత విరుగుతుంది. ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంటుంది? ఉండదు. ఒక మహాత్ముడి ఇంట్లో క్కు... సంగమం చేత ఏమయినా ప్రయోజనం లభిస్తుందా? త్రివేణీ సంగమంలో మొసలి... దానికేమయినా స్నానఫలితం వస్తుందా? ఎవడు కాలుపెడతాడా లాగేద్దామని చూస్తుంటుంది. సంగమం ప్రయోజనం వాటికుండదు. ఒక్క మనుష్యప్రాణికే ఉంటుంది. తరించగలడు, వాసనాబలాన్ని పోగొట్టుకోగలడు.

 
ఆవుదూడ నోటికి చిక్కం వేస్తారు. ఎందుకని? రుచి. మట్టి తింటుంది. మట్టి తింటే కడుపులో ఎలికపాములు పెరిగి దూడ చనిపోతుంది. అందుకే చిక్కం. రుచి, వాసన-ఈ రెండింటినీ చంపగలవాడు భగవంతుడు. ఆ పరమాత్మ పాదాలను పట్టుకుని ‘‘ఈశ్వరా ! నేను ఈ దుర్గుణాల నుంచి బయటపడలేకపోతున్నాను’’ అని త్రికరణశుద్ధిగా ఎవడు మనసువిప్పి చెప్పుకుంటాడో వాడిని ఆ దుర్గుణం నుంచి పెకైత్తుతాడు. అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు.

 
మనసు అప్పటికప్పుడు లొంగినట్లుంటుంది. అప్పటికప్పుడే తిరగబడుతుంటుంది. ‘‘పాసీపాయదు పుత్రమిత్రజనసంపద్భ్రాంతి వాంఛాలతల్, కోసీకోయదు నామనంబకట నీకుంబ్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు దీని తృళ్ళణపడవే శ్రీకాళహస్తీశ్వరా!’’అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. పుత్రజనం, మిత్రజనం, సంపదలు వీటి పట్ల మనసు ప్రీతిని పూర్తిగా వదలడం లేదు. ఆ కోరికలను పూర్తిగా కోసివేయడం లేదు. దీన్ని త్రుళ్ళు అణచవయ్యా. దీనిని నీవే లొంగదీసుకోవయ్యా. నేను సక్రమ మార్గంలో ఉండేటట్లు చేయి’’ అని ధూర్జటి వేడుకున్నాడు. దేవాలయం దగ్గర ఆయనెవరో వచ్చారట. ఉపన్యాసం వినడానికి వెడదాం అని ఉత్సాహపడి అప్పటికి లొంగి ఉన్నట్లు కనబడే మనసే, ఆయనకేం వస్తాడు పనాపాటా... హాయిగా ఇంటికెళ్ళి టీవి చూద్దాం పద... అని అప్పటికప్పుడే తిరగబడుతుంది. తుంటరి ఏనుగును మావటి లొంగదీసుకున్నట్లే, నా వశపడని ఈ మనసును నీవే దారిలో పెట్టు భగవాన్... అంటూ అటువంటి శరణాగతి చేసి వాసనాబలంనుండి పైకి వస్తాడు అంటే ఈశ్వరుని అనుగ్రహంచేత తన దుర్గుణాలను పోగొట్టుకునేటట్టు చేసే ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుండి విముక్తిపొందుతాడు, లేదా సాధనచేత పొందుతాడు.

 
‘అరే, నేనెందుకు చేయాలి ఇటువంటి పని. ఎంతోమంది ఇలా చేసి పాడైపోయారు. గురువుగారు చెప్పిన ఒక్క మాట చాలు’ అనుకుని మారిపోవాలన్న ఆర్ద్రత మనసులో కలగాలి. ఒక్కసారి కలిగిందా... ఆ మార్పు వచ్చేస్తుంది. భూమిలో తడి ఉందా... అందులో వేపగింజ వేసావా, జామగింజ వేసావా, మామిడి టెంక వేసావా... సంబంధం ఉండదు. మొక్క వచ్చేస్తుంది. ఒక వేళ అది రాతినేల అనుకోండి, అందులో ఏ గింజవేసినా అంకురం రాదు. మేకు తీసుకెళ్ళి ఇనుపదూలంలో కొట్టారనుకోండి. మేకు వంగిపోతుంది తప్ప, దిగదు. అదే గోడకు గుల్లతనం ఉంటే మేకు దిగుతుంది. మనసులో ఆర్ద్రత ఉన్నప్పుడు గురువుగారి ఒక్కమాట చాలు, జీవితం మారిపోవడానికి.

 
అందుకు భగవాన్ రమణులు అంటుంటారు. అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తుంటాయి. వాటికి ప్రాధాన్యతేం ఉంటుంది. అది అడవికాబట్టి అరుస్తాయి. సింహం వచ్చి ఒక్కసారి గర్జన చేసిందా... అంతే మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోవడానికి సింహగర్జన ఎలా పనిచేస్తుందో, ఒక్క గురువుగారి మాట మనలోని దుర్గుణాలను పార్రదోలడానికి అలా పనికి వస్తుంది. మనలో మార్పునకు కారణం అవుతుంది.

 

 తుంటరి ఏనుగును మావటి లొంగదీసుకున్నట్లే, నా వశపడని ఈ మనసును నీవే దారిలో పెట్టు భగవాన్... అంటూ అటువంటి శరణాగతి చేసి వాసనాబలంనుండి పైకి వస్తాడు అంటే ఈశ్వరుని అనుగ్రహంచేత తన దుర్గుణాలను పోగొట్టుకునేటట్టు చేసే ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుండి విముక్తిపొందుతాడు, లేదా సాధనచేత పొందుతాడు.

 

 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

 

Advertisement
Advertisement