Sakshi News home page

బీమా ఉంటే ధీమాగా ప్రయాణించొచ్చు!

Published Mon, Sep 12 2016 11:33 PM

బీమా ఉంటే ధీమాగా ప్రయాణించొచ్చు!

ఉమెన్ ఫైనాన్స్ / వాహన బీమా పాలసీ
ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే, మరికొంతమంది స్వయం ఉపాధి మార్గాలలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి వాహనాలను కూడా విరివిగా వాడుతున్నారు. ఇంటిలో ఉండే హౌస్‌వైఫ్‌లు కూడా తమ పిల్లలను స్కూళ్లకు, ఇతర తరగతులకు పంపడానికి అలాగే తమ ఇంటి అవసరాలకు వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రత, స్వీయభద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
 
మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1985 ప్రకారం ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి కనుక తీసుకుంటారు కానీ దాని గురించి ఏమీ తెలుసుకోరు. మరికొంతమంది ద్విచక్ర వాహనాలకు అసలు ఇన్సూరెన్స్ తీసుకోరు. ఈ ఇన్సూరెన్స్‌లో వేటివేటికి కవరేజి ఉంటుంది, ఎలా పనిచేస్తుందో చూద్దాం.
 సాధారణంగా రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవి 1. లయబిలిటీ పాలసీ, రెండు ప్యాకేజీ పాలసీ
 
1. లయబిలిటీ పాలసీ: ఇది మీరు వినియోగిస్తున్న వాహనం వల్ల వేరే వ్యక్తులకు గాని, వారి ఆస్తులకు గాని ఏమైనా నష్టం వాటిల్లితే ఈ పాలసీ ద్వారా వారికి నష్టపరిహారం అందుతుంది. ఈ పాలసీ మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా తీసుకోవలసినది.
 
2. ప్యాకేజీ పాలసీ: ఈ పాలసీలో లయబిలిటీ రిస్క్‌తోబాటు ఇన్సూరెన్స్ తీసుకున్న వాహనానికి డ్యామేజీ జరిగినా వాహనం నడిపేవారికి పర్సనల్ యాక్సిడెంట్ జరిగినా కవరేజీ లభిస్తుంది.
 
మోటార్ పాలసీలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఐ.డి.వి (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వ్యాల్యూ) నిర్ణయిస్తారు. ఈ ఐడీవీని వెహికిల్ తయారీదారు విక్రయించిన ధర, దాని మోడల్, తయారు చేసిన సంవత్సరం తదితరాల ఆధారంగా తరుగుదలను తీసివేసి లెక్కకడతారు. ఒకవేళ వెహికిల్ మోడల్ తయారీని నిలిపి వేస్తే, ఐడీవీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ చేయించుకునేవారు వారి నియమ నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు.
 
ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకోవలసి ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ద్విచక్ర వాహనాలకు ఒక సంవత్సరానికి మాత్రమే కాకుండా రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకేసారి ఇన్సూరెన్స్‌ని అందజేస్తున్నారు. వీటివల్ల ప్రతి సంవత్సరం గుర్తుంచుకుని రెన్యూ చేయవలసిన పని ఉండదు. అలాగే టారిఫ్ రేట్స్, టాక్స్ పెరిగినా వాటి భారం తగ్గుతుంది.
 
మనిషి జీవితం ఎంతో విలువైనది. మీరు వినియోగించే వాహనం ద్వారా వేరేవారికి నష్టం వాటిల్లితే లేదా మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆ లోటును మీరు ఎప్పటికీ భర్తీ చేయలేరు. కాని కొంతలో కొంత వారికి జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే ఒక సదుపాయమే ఈ ఇన్సూరెన్స్. కనుక తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకుని సేఫ్టీగా ప్రయాణిస్తూ మీ విధులను నిర్వహించండి.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’

Advertisement
Advertisement