సత్యాన్వేషి-సూఫీ గురువు | Sakshi
Sakshi News home page

సత్యాన్వేషి-సూఫీ గురువు

Published Thu, Jul 17 2014 11:38 PM

సత్యాన్వేషి-సూఫీ గురువు - Sakshi

సూఫీ తత్వం
 
భగవంతుడు ఫలానా రూపంలోనే ఉంటాడు అని అనుకునే వ్యక్తి అందుకు భిన్నమైన రూపంలో దేవుడు తన ఎదుట ప్రత్యక్షమైనా ఆ సంగతిని గుర్తించలేదు. సాక్షాత్కార భాగ్యాన్ని పొందలేడు.
 
ఒకడు సత్యాన్వేషణలో పడతాడు. ఎక్కడెక్కడో తిరిగి ఆనోటా ఈనోటా విని చివరికి ఓ సూఫీ జ్ఞాని వద్దకు బయలుదేరుతాడు. కానీ అతన్ని ఆ జ్ఞాని వద్దకు వెళ్లనివ్వకుండా సైతాన్ అడ్డుపడతాడు. ముందుగా, సైతాన్ ఒక అందాల సుంద రి రూపంలో అతని ముందుకు వస్తాడు. ఆ సుందరి రూపానికి ఆ సత్యాన్వేషి అడుగులు ముందుకు పడవు.  కాసేపటి తర్వాత తను దారి తప్పిన విషయాన్ని తెలుసుకుని సుందరిని విడిచిపెట్టి జ్ఞాని వద్దకు మళ్లీ అడుగులు వేస్తాడు.
 
అయితే ఓ పది అడుగులు వేశాడో లేదో ఓ వ్యక్తి తారసపడతాడు. అతను ఎంతో వినమ్రంగా మాట్లాడి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అతనితోనూ సత్యాన్వేషి కొంత దూరం వెళ్తాడు. మళ్లీ వెనక్కు వస్తాడు.
 
ఇలా అడుగడుగునా సైతాన్ ఏదో రూపంలో సత్యాన్వేషికి అడ్డు తగులుతూ ఉంటాడు.  అతనిని దారి మళ్లించడం కోసం వస్తువులు, పొగడ్తలు, అధికారం, అంతస్తు ఇలా రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తాడు. ఎలాగైతేనేం అవన్నీ వది లించుకుని సత్యాన్వేషి చాలాసేపటి తర్వాత జ్ఞాని ఆశ్రమానికి  చేరుకుంటాడు. ఆశ్రమం తలుపులు తెరిచే ఉంటాయి. తిన్నగా లోపలికి వెళ్తాడు. దాంతో సైతాన్ కాస్తా తన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని నొచ్చుకుని అతనికి దూరమై చీకట్లో నీలుగుతూ ఉంటాడు.
 సత్యాన్వేషి జ్ఞాని ఉన్న గదిలోకి వస్తాడు. జ్ఞాని ఒక ఆసనంపై కూర్చుని ఉంటాడు. ఆయన చుట్టూ శిష్యులు అనేకులు కూర్చుని ఉంటారు. ఆయన రూపురేఖలు తానూహించుకున్నట్లు లేకపోవడంతో సత్యాన్వేషి మనసులో అనేక సందేహాలు కలుగుతాయి. ‘ఇతనేం గురువో? నేను అనుకున్నట్లు లేరే?’ అనుకుంటాడు.
 
జ్ఞాని అతను వచ్చి నిల్చున్న విషయాన్ని పట్టించుకోనట్లు ఉంటాడు. శిష్యులూ అతని రాకను పట్టించుకోరు. దాంతో సత్యాన్వేషి, తానొస్తే ‘రండి రండి’ అని ఆహ్వానించే వారే లేరేంటీ?’’ అనుకుంటాడు. అయినా ఓపిక వహిస్తాడు. అక్కడ ఏం జరుగుతోందో పరిశీలిస్తాడు. శిష్యుల్ని ఉద్దేశించి జ్ఞాని చెప్తున్న మాటలు అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన మాటల్లో ఎలాంటి తత్వమూ లేదనుకుంటాడు. అటువంటి ఓ సామాన్యుడిని ఇంతమంది శిష్యులు గురువుగా పరిగణిస్తున్నారా? ఇదేం విడ్డూరమో? అనుకుంటాడు. ఓ వెర్రి నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వు అక్కడున్న జ్ఞానిని కించపరిచేటటువంటి నవ్వు.
 
‘‘ప్రజలు వొట్టి మూర్ఖులు. ఎవరిని గురువుగా భావించాలో కూడా తెలియదు’’ అనుకుని అక్కడున్న వారితో ఒక్క మాటా మాట్లాడక తానొచ్చిన సత్యాన్వేషణ విషయాన్ని అక్కడే విడిచిపెట్టి వెనుతిరుగుతాడు.
 
అతనలా వెళ్లిన తర్వాత జ్ఞాని ఓ నవ్వు నవ్వుతారు. అతను వెళ్లిన వైపే చూస్తారు.
 ‘‘సైతాన్, నువ్వు అతనికి అన్ని పరీక్షలు పెట్టవలసిన అవసరమే లేదు. అతను నీ కోవకు చెందిన మనిషే. అతనిలో నిజంగానే సత్యాన్ని తెలుసుకోవాలే ఆరాటం ఉండి ఉంటే నీ తొలి అస్త్రాన్నే ఆ క్షణంలోనే ఛేదించి నా దగ్గరకు వచ్చి ఉండేవాడు. కానీ అడుగడుగుకీ అతను దారి తప్పుతూ వస్తున్నాడు. అతని మనస్సు స్థిరంగా లేదు...’’ అని జ్ఞాని అన్నారు.
 
సైతాన్ కూడా ఒక్క మాటా మాట్లాడకుండా అక్కడి నుంచి అదృశ్యమవుతాడు.
 భగవంతుడి  ఆచూకీ కోసం తపించే జీవుడు వస్తువులు, పొగడ్తలు, ఆశలు, హోదా వంటివేవీ దరికి రానివ్వడు. భగవంతుడు ఫలానా రూపంలోనే ఉంటాడు అని అనుకునే వ్యక్తి అందుకు భిన్నమైన రూపంలో దేవుడు తన ఎదుట ప్రత్యక్షమైనా ఆ రూపాన్ని భగవంతుడిగా అనుకోడు, నమ్మడు అనేదే ఈ కథ సారాంశం.
 
- యామిజాల జగదీశ్
 

Advertisement
Advertisement