సమానత్వం కోసం వినూత్న యత్నం | Sakshi
Sakshi News home page

సమానత్వం కోసం వినూత్న యత్నం

Published Wed, Oct 22 2014 12:17 AM

సమానత్వం కోసం వినూత్న యత్నం - Sakshi

హి ఫర్ షి
స్త్రీ, పురుష సమానత్వం కోసం ప్రపంచ దేశాలలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) చాలాకాలంగా కృషిచేస్తున్నాయి. కొన్ని దేశాల్లోనైతే లైంగిక సమానత్వం కోసం ప్రభుత్వమే ప్రణాళికలను చేపడుతోంది. సమానత్వం ఉన్న చోట సమాజంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉంటుంది. అందుకే ఈ ప్రయత్నాలు. ఈ క్రమంలో ఇప్పుడు ఐరాస మహిళా విభాగం ఇటీవల న్యూఢిల్లీలో స్త్రీ, పురుష సమానత్వ ప్రచారోద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఆ ఉద్యమం పేరు ‘హి ఫర్ షి’. పేరులోనే కాదు, ఉద్దేశంలోనూ నవ్యత ఉన్న కార్యక్రమం ఇది.

2030ని ఒక గడువుగా పెట్టుకుని ఆనాటికల్లా స్త్రీ, పురుష సమానత్వం సాధించడం కోసం అంతర్జాతీయంగా బాలురు, పురుషుల సహాయంతో ముందుకెళ్లాలని 'హ  ఫర్ షి’ ద్వారా సమితి సంకల్పించింది. ‘హి ఫర్ షి’ అంటే.. ఆమె కోసం అతడు అని. ఈ నినాదంతో మహిళా సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పురుషుల సేవలను, సహకారాన్ని తీసుకుని తద్వారా లైంగిక సమానత్వం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమితి మహిళా ప్రతినిధి రెబెక్కా టవేర్స్’ ప్రకటించారు. ఇందుకోసం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘మెన్‌ఎంగేజ్’ అనే సంస్థ నేతృత్వంలో బాలురు, పురుషుల సహాయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.
 
తొలుత ఈ ఏడాది సెప్టెంబరు 20న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రారంభమైన ‘హి ఫర్ షి’ ప్రచారోద్యమాన్ని, మనదేశంలో అక్టోబర్ 18న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది బాలురు, పురుషుల నుంచి ప్రతిజ్ఞా సంతకాన్ని సమితి సేకరించింది. అందులో 4000 మంది భారతీయులు ఉన్నారు. ఇలా ప్రతిజ్ఞ చేసినవారు స్త్రీల హక్కుల కోసం తమ వంతుగా పాటు పడవలసి ఉంటుంది. స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలలో తమ గళం వినిపించవలసి ఉంటుంది.  
 
స్త్రీల సమస్యలపై మగవాళ్లలో సహానుభూతి కల్పించి, లైంగిక సమానత్వం సాధించడం కోసం గత నాలుగు మాసాలుగా భారత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని చెబుతూ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం కూడా లైంగిక సమానత్వానికి మరింతగా తోడ్పడుతుందని మనేకా గాంధీ అన్నారు. బాలురు, పురుషులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ‘హి ఫర్ షి’ లో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
 
మరోవైపు ‘మెన్  ఎంగేజ్’ సంస్థ నవంబర్ 10 నుంచి 13 వరకు నాలుగురోజుల పాటు తన రెండవ అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించబోతోంది. ‘లైంగిక సమానత్వం కోసం బాలురు, యువకులు’ అనే ప్రధానాంశంగా ఈ సదస్సు జరగనుంది. దీనిపై ‘సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్’ ప్రతినిధి అభిజిత్ మాట్లాడుతూ... ‘‘స్త్రీల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడమే అసలైన పురుషత్వం అనే భావనను బాలురు, పురుషులలో కలిగించ డమే ‘మెన్ ఎంగేజ్’ లక్ష్యం అని అన్నారు. ఇంత ఉన్నతమైన లక్ష్యానికి దేశంలోని బాలురు, పురుషులంతా సహకరిస్తే, తమ మద్దతు ప్రకటిస్తే స్త్రీ పురుష సమానత్వాన్ని గడువులోపలే సాధించవచ్చు.
 
మగవాళ్లకు అవగాహన కల్పించాలి

స్త్రీ, పురుష సమానత్వ సాధనలో పురుషుల భాగస్వామ్యమే కీలకం. స్త్రీలు ఎదుర్కొంటున్న సామాజిక ఆంక్షలు, కుటుంబ అవరోధాలపై గనుక బాలురకు, పురుషులకు అవగాహన కలిగించగలిగితే లైంగిక అసమానతలు త్వరలోనే రూపుమాసిపోతాయి.
 - మనేకాగాంధీ, కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి

Advertisement

తప్పక చదవండి

Advertisement