నిత్యనూతన గీతం | Sakshi
Sakshi News home page

నిత్యనూతన గీతం

Published Thu, Feb 27 2014 11:08 PM

నిత్యనూతన గీతం

మనిషి జీవితంలో ‘యుద్ధం’ అనివార్యం. అవసరాల కోసం... అవకాశాల కోసం... గుర్తింపు కోసం... బంధాల రక్షణ కోసం...  బాధ్యతల నిర్వహణ కోసం... సమరం సాగించాల్సిందే. ఇలా మనిషి జీవితం నిత్య కురుక్షేత్రం. సరిగ్గా ఇలాంటి యుద్ధంలోనే భగవద్గీత ఉద్భవించింది!
 
అర్జున విషాదయోగంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. శత్రుసైన్యంలో అందరూ తనవారే ఉండేసరికి నైరాశ్యానికి గురై, యుద్ధానికి ముందే ఓటమి వైపు అడుగేస్తుంటాడు అర్జునుడు. అతని అంతరంగంలో ఆలోచనల అంతర్యుద్ధం మొదలైంది. ఏం చేయాలో దిక్కు తోచక ‘నువ్వే నాకు దిక్కు’ అంటూ భగవానుడిని ఆశ్రయించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పడం ప్రారంభించాడు. భగవద్గీతలోని రెండో అధ్యాయం సాంఖ్య యోగం నుంచి భగవానుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు.
 

నాడు-నేడు-కృష్ణుడు
 ‘క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే
 క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥

 ‘మనో దౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు శత్రువులపై విజయం సాధించగలవు’ అంటూ భగవానుడు బోధిస్తాడు. ఈతరం యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం మనోదౌర్బల్యం. దాన్ని విడిచిపెడితే విజయమే.
 ‘యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం
 సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం’

 యుద్ధం ఓ సదవకాశం అంటాడు భగవానుడు. యుద్ధం జరిగితేనే కదా ఎవరి బలాబలాలు ఏంటో బయటపడేది. యువతకి ఇంతకంటే స్ఫూర్తి ఇంకేం కావాలి!
 ‘క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః
 స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి’

 కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం అంటాడు భగవానుడు. ఇది తెలిస్తే చాలు... వేరే యాంగర్ మేనేజ్‌మెంట్ అంటూ ఇంకేం ఉంటుంది!
 ‘సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత
 శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః’

 ఏ విషయం మీదా ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటివాడిగానే తయారవుతాడు అని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు.
 ఆకళింపు చేసుకునే ఆసక్తితో ప్రయత్నం చేయాలేగానీ అర్జున విషాదయోగం మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకూ... గీతలోని పద్ధెనిమిది అధ్యాయాల్లో ఇలాంటి మేలిముత్యాలెన్నో. అందుకే భగవద్గీతకు మించిన వ్యక్తిత్వ వికాసం ఇంకోటి లేదు. ఇంతకు మించిన లీడర్ షిప్ పాఠమూ మరొకటి లేదు. దీనికంటే గొప్ప వాగ్ధాటిని, జీవన పోరాటాన్ని నేర్పించగలిగే గ్రంథమూ లేదు. ఇదీ అదీ అని కాదు... నేటి యువతరం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం భగవద్గీతలో ఉంది. ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయడం... ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటం ఇది నేర్పుతుంది.
 - బి.వి.సురేష్‌బాబా
 
 నేటి ‘అర్జునులు’!
ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో నేటి యువతరంలోని ఎంతోమందిదీ అదే స్థితి! అదే అయోమయం. అదే ఊగిసలాట. చాలామందికి ఉన్నత లక్ష్యాలు ఉంటాయి. వాటి సాధనకు ప్రయత్నాలూ ఉంటాయి. కానీ ఆ ప్రయత్నంలో వైఫల్యాలు ఎదురైతేనే  నిరాశానిసృ్పహలతో కుంగిపోవడం, ఓటమికి తల వంచేయడం. ‘ఇక దేని కోసం జీవించాలి? బతికుండి ఏం ప్రయోజనం?’అనే మెట్ట వేదాంత ధోరణి! ‘యుద్ధం చేయడం కర్తవ్యం’ అన్నది మరచిపోతారు. ఇక్కడ ‘యుద్ధం‘ అంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా జీవన పోరాటాన్ని కొనసాగించడం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని పోగు చేసుకుని పోరాడటం. ఈ తరం యువతకి కావాల్సిన బలం,  బలగం ఇదే. గీతాచార్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఇచ్చిన భరోసా కూడా ఇదే.
 

Advertisement
Advertisement