ఎంత బరువైనా చదివిస్తున్నారు | Sakshi
Sakshi News home page

ఎంత బరువైనా చదివిస్తున్నారు

Published Wed, Oct 16 2013 12:19 AM

ఎంత బరువైనా చదివిస్తున్నారు - Sakshi

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి దగ్గర్లో ఉన్న హమాలీబస్తీ అది. రైల్లో వచ్చే బొగ్గు నుంచి రవాణా అయ్యే ప్రతి వస్తువు వరకు ఈ హమాలీల భుజంపై నుంచే బయటికి వస్తుంది. నలభైఏళ్లక్రితం...ఓ వంద గుడిసెలతో ఏర్పడ్డ ఈ వాడ ముప్పై ఏళ్లపాటు మురికివాడగానే అందరికీ తెలుసు. ఆ గుడిసెలమధ్యనున్న మురికిని శుభ్రం చేయడానికి ప్రభుత్వానికి ముప్పై ఏళ్లు పట్టింది. ఇప్పుడక్కడ గుడిసెలు పోయి పెంకుటిళ్లు వచ్చాయి... పక్కా ఇళ్లు కూడా వచ్చాయి. ఏం లాభం...ఆ హమాలీల బతుకుల మధ్య మురికి మాత్రం అలాగే పేరుకుపోయింది. గొడ్డుచాకిరీ రోజుకింత గంజి పోస్తోందే కాని...పిల్లలను అథోగతి పాల్చేస్తోందని అర్థమయ్యాక... ఆ వాడవాసులంతా తమ బిడ్డలు ‘కూలీ’లు కాకూడదంటే...వారి భుజాలకి స్కూలు బ్యాగు తగిలించాలని అనుకున్నారు. వారికి ఆ ఆలోచన వచ్చింది మొదలు ఆ వాడలో వాతావరణమే మారిపోయింది. 600 కుటుంబాలు...పన్నెండొందలమంది బడిపిల్లలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి దగ్గర్లో  ఉన్న ఆ హమాలీ బస్తీ విశేషాలివి...
 ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి ఆ వాడలో గుండ్రాయి ఎత్తే పోటీ ఉంటుంది. హమాలీలకు ఆ గుండ్రాయి పండగ బోలెడెంత ఉత్సాహాన్నిస్తుంది. రాయినెత్తి తమ శరీర బలాన్ని ప్రదర్శించడానికి వారు రోజు చేసే హమాలీపనికీ ఉన్న అనుబంధాన్ని బట్టి ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 120 కిలోల బరువున్న రాయిని ఎవరు పెకైత్తితే వాళ్లే ఆ ఏడాదికి హీరో అన్నమాట. పదేళ్లకిందటి వరకూ ఆ వాడ యువతకు రాయినెత్తడమే జీవితలక్ష్యం. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతో ఇప్పుడక్కడ ఏ పోటీలు పెట్టినా.. బుద్ధి బలాన్ని పెంచే చదువు తర్వాతే ఏదైనా.  
 
 బొగ్గు రైళ్లు పోయాక...
 పూర్వం రైళ్లన్నీ బొగ్గుతోనే నడిచేవి. దాంతో ఈ బస్తీవాసులకు బోలెడు పని. రెండు షిఫ్టులూ పనిచేసి సంపాదించుకునేవారు. ఎప్పుడయితే ఎలక్ట్రిక్ రైళ్లు వచ్చాయో...హమాలీల సంఖ్య కూడా బొగ్గు రైళ్ల దగ్గరే ఆగిపోయింది. కొందరు బోగీలోంచి ఆహారధాన్యాలను, ఇతర రవాణా సరకులను దిగుమతి చేస్తారు. ఇంకొందరు ప్యాసింజర్ల లగేజ్‌ను మోస్తుంటారు.‘‘పూర్వంతో పోలిస్తే... ఇప్పుడు హమాలీలకు పని తగ్గింది. ఒకప్పుడు ఈ వాడలో అందరూ రైల్వేకూలీలే. ఇప్పుడు కొందరు రూటు మార్చి లారీల అడ్డాలోనూ, ఇంకొందరు ఆటో డ్రైవర్లుగానూ పనిచేస్తున్నారు. ఆడవాళ్లలో చాలామంది చుట్టుపక్కల అపార్టుమెంట్లలోని ఇళ్లలో పనిచేస్తారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నారు. ‘‘కొన్నేళ్లక్రితం మా తాతయ్య ఇక్కడ కూలీగా ఉండేవాడు. నాన్న కూడా కూలీనే. నా దగ్గరికి వచ్చేసరికి కొన్నాళ్లు గవర్నమెంటు స్కూలులో చదివించారు. 
 
 ఇప్పుడు నా బిడ్డలు మాత్రం ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ దాదాపు అందరి పరిస్థితి ఇదే. గుండ్రాయి పండగప్పుడు జర బుద్ధికి పనిజెప్పే పోటీలేమైనా పెట్టొచ్చు కదా... అని అడిగే యువతను చూస్తుంటే మాకు ముచ్చటేస్తుంది’’ అని ఆ వాడకి చెందిన నర్సింహం అనే వ్యక్తి చెప్పారు. మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ లైన్లు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న ఈ వాడవాసులు ఒకప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కాలం వెళ్లదీశారు. మద్యపానం సమస్య కూడా ఈ బస్తీలో బాగానే ఉంది. ‘‘మేం చేసేది ఏమైనా సర్కారు కొలువా... పనిలోకి ఎక్కిన మరుక్షణమే భుజాలు నేలకొరిగిపోతాయ్. బియ్యం, పప్పుల బస్తాలు మోసినరోజు సాయంత్రం అయ్యేసరికి ఒళ్లంతా కందచెక్కమాదిరి అయిపోతుంది. మర్నాడు పొద్దునే లేచి పనిలోకి పోవాలంటే కనీసం పదిగంటలైనా కదలకుండా పడుకోవాలి. కడుపులకు మందుపోతేగాని కంటినిండా నిద్ర పట్టదు... ఏం చేస్తాం.... మా కూలీ బతుకులింతే’’ సోమేష్ అనే కూలీ తన పేద జీవితం గురించి వివరంగా చెప్పాడు.
 
 12 వందల మంది విద్యార్థులు...
 ప్రస్తుతం హమాలీ బస్తీ ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి దాదాపు 6 వేలమంది జనాభా ఉంటారు.  మొత్తం 1200 మంది పిల్లలు బడికి వెళుతున్నారు. ‘‘ఎంత కష్టమైనా... మా  పిల్లలందర్నీ బడికి పంపిస్తున్నం. ఇంజనీరింగ్ చదివినోళ్లు కూడా ఇద్దరుముగ్గురు ఉన్నరు. మొన్ననే ఓ పిల్లగాడు లాయర్ సదువు పూర్తిచేసిండు. మునుపైతే...వాడలో ఎప్పుడు చూసినా పిల్లలు మాసిన బట్టలేసుకుని ఏవో ఆటలాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ల చదువులతో వాడ వాతావరణమే మారిపోయింది. ముందు ముందు మా బస్తీ పిల్లలు చదువులో సాధించిన విజయాల గురించి సిటీవాసులు చెప్పుకునే రోజులొస్తాయి’’ అని ఎంతో గర్వంతో ఫేజ్ 2 బస్తీ అధ్యక్షుడు చెన్నప్ప చెప్పిన మాటలు మిగతా మురికివాడల వాసుల్ని కూడా ఆలోచింపజేయాలి.  మంచినీటి కోసం గంటలపాటు క్యూలో నిలబడే ఇలాంటి వాడల్లో పిల్లల గెలుపు పాఠాలు వింటే ఎవరికైనా కడుపునిండిపోతుంది.  
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

Advertisement
Advertisement