ఇరాక్ దురాక్రమణ జరిగిన రోజు | Sakshi
Sakshi News home page

ఇరాక్ దురాక్రమణ జరిగిన రోజు

Published Tue, Aug 2 2016 12:15 AM

ఇరాక్ దురాక్రమణ జరిగిన రోజు

ఆ నేడు   2 ఆగస్టు 1990


సెల్‌ఫోన్‌లు లేవు. ఇంత సోషల్ నెట్‌వర్క్ లేదు. అయినప్పటికీ కువైట్‌ను ఇరాక్ దురాక్రమించిన వార్త  కొద్ది నిమిషాల్లోనే ప్రపంచాన్ని యుద్ధ మేఘంలా కమ్ముకుంది. 700 యుద్ధట్యాంకులను వెంటేసుకుని, లక్షమంది ఇరాక్ సైనికులు తెల్లవారుజామున చప్పుడు చెయ్యకుండా వెళ్లి కువైట్‌ని ఆక్రమించుకున్నారు. ఏ దేశం అయినా తమ ఆక్రమణను అడ్డుకుంటే ఆ దేశాన్ని మరుభూమిగా మార్చేస్తామని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ గర్జించారు. ఇరాక్ జెట్ విమానాలు కువైట్‌లోని ప్రధాన కేంద్రాలను నేలమట్టం చేసేశాయి. ఆక్రమణ మొదలైన కొన్ని గంటల్లోనే 200 మంది కువైట్ పౌరులు దుర్మరణం చెందారు. ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. వెంటనే కువైట్‌ను వదలివెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పమని ఇరాక్‌ని హెచ్చరించింది.


అగ్రరాజ్యాలు ఇరాక్‌ను బెదిరించాయి. ఆఖరికి ఇరాక్‌కు ఆయుధాలు విక్రయిస్తుండే రష్యా సైతం ఇరాక్ చర్యకు నిరసనగా ఆయుధ సామగ్రిని సరఫరా చెయ్యడం మానేసింది. అనేక దేశాలు ఇరాక్‌పై ఆర్థిక ఆంక్ష లు విధించాయి. అయినా సద్దాం తొణక లేదు. బెణక లేదు. ఇక లాభం లేదని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్... కువైట్ నుంచి ఇరాక్‌ను బయటికి తరిమేసేటందుకు గగనతల పోరాటానికి సిద్ధమయ్యారు. గడువులోపల కువైట్ నుంచి వైదొలగకపోతే ఇరాక్‌ను కోలుకోలేనంతగా దెబ్బతీయవలసి వస్తుందని హెచ్చరించారు. గడువులు పెట్టినా, గడువులను పొడిగించినా సద్దాం లెక్కచెయ్యలేదు. చివరికి ఐదు నెలల తర్వాత 1991 జనవరి 17న ఇరాక్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్, సౌదీ అరేబియా సహా అనేక ప్రపంచ దేశాలు సంకీర్ణ దళంగా ఏర్పడి ఇరాక్‌పై ‘డెజర్ట్ స్టార్మ్ అపరేషన్’ పేరుతో యుద్ధం ప్రారంభించాయి. అయినా ఇరాక్ లొంగలేదు! తన దగ్గరకున్న స్కడ్ క్షిపణులతో పోరాటం చేసింది. ‘స్కడ్’ అన్న పేరు ఆ సమయంలోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. హోరాహోరీ పోరు తర్వాత, తన సైన్యం శక్తి సామర్థ్యాలన్నిటినీ కోల్పోయాక ఫిబ్రవరి 28న ఇరాక్ లొంగిపోయింది! ఇంతకీ కువైట్‌ను ఇరాక్ ఎందుకు ఆక్రమించినట్టు? రెండు దేశాల మధ్య పెట్రోల్ గొడవ. తమ ఆయిల్ బావుల్లోంచి కువైట్ అక్రమంగా పెట్రోల్ తోడేసుకుంటోందని ఇరాక్ ఆరోపణ.

Advertisement

తప్పక చదవండి

Advertisement