వ్యాయామానికి తప్పనిసరిగా ట్రైనర్ ఉండాల్సిందేనా? | Sakshi
Sakshi News home page

వ్యాయామానికి తప్పనిసరిగా ట్రైనర్ ఉండాల్సిందేనా?

Published Wed, Oct 30 2013 11:29 PM

వ్యాయామానికి తప్పనిసరిగా ట్రైనర్ ఉండాల్సిందేనా?

 నేను ఇటీవలే వ్యాయామం మొదలుపెట్టాను. నేను ఒంటరిగానే ఎక్సర్‌సైజ్ చేస్తుంటాను. వ్యాయామలు తప్పనిసరిగా ట్రైనర్ ఆధ్వర్యంలోనే చేయాలంటూ ఫ్రెండ్స్ సలహా ఇస్తున్నారు. వ్యాయామం తప్పకుండా ట్రైనర్ ఆధ్వర్యంలోనే చేయాలా?
 - వెంకటేశ్, హైదరాబాద్

 
 ఈ విషయంలో కొంత స్పష్టత అవసరం. మీరు కేవలం జాగింగ్ లేదా వాకింగ్ వంటి సాధారణ వ్యాయామాలు చేస్తుంటే అవి ఎలా చేయాలో మొదట ఒకసారి తెలుసుకుని ఆ తర్వాత ట్రైనర్ సహాయం లేకుండా చేసినా సరిపోతుంది. అయితే కొన్ని సంక్లిష్టమైన వ్యాయామాల్లో ట్రైనర్ ఉండటం మంచిది. ఇక మనం ఏ లక్ష్యంతో వ్యాయామం చేస్తున్నామన్న దానిపై ఆధారపడి ట్రైనర్‌ను ఎంచుకోవాలి.

ఉదాహరణకు గుండెకు జరిగిన శస్త్రచికిత్స తర్వాత నడక లాంటి వ్యాయామానికి ట్రైనర్ పెద్దగా అవసరం  లేదు. కానీ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక కావాలనో లేదా నిర్దిష్టంగా ఫలానా తరహా ప్రయోజనం కోసమే వ్యాయామం చేసే వారు మంచి పరిజ్ఞానం, అవగాహన ఉండాలి. అంటే...  ఉదాహరణకు కొన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

ఇలాంటి విషయాలు తెలిసి ఉన్న ట్రైనర్ ఆధ్వర్యంలో చేసే వ్యాయామంతో మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఒక్కోసారి వ్యాయామం సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే... ఒంటరిగా వ్యాయామం చేసేవారికి వైద్య సహాయం అందడంలో ఆలస్యం జరగవచ్చు. అది ప్రమాదకరం కావచ్చు. కాబట్టి వాకింగ్, జాగింగ్ వంటి సాధారణ వ్యాయామాలను మినహాయిస్తే  సంక్లిష్ట వ్యాయామాలను మంచి ట్రైనర్ ఆధ్వర్యంలో చేయడమే మంచిది.
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్

 

Advertisement

తప్పక చదవండి

Advertisement