ఐఎస్‌ఎల్ ‘గోల్’ కొడుతుందా? | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ ‘గోల్’ కొడుతుందా?

Published Fri, Jul 4 2014 11:22 PM

ఐఎస్‌ఎల్ ‘గోల్’ కొడుతుందా? - Sakshi

ఏ దేశంలో అయినా ఓ ఆట పాపులర్ కావాలంటే ఓ స్టార్ ఉండాలి. ఒక్క ఆటగాడు ఆ దేశంలో ఆట స్వరూపాన్నే మారుస్తాడు. భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ రావడానికి కారణం కపిల్‌దేవ్. 1983 ప్రపంచకప్ గెలిచి దేశంలో క్రికెట్‌కు ఆదరణ పెంచాడు. ఆ తర్వాత సచిన్ దానిని మరింత విస్తృతం చేశాడు. ఇప్పుడు భారత ఫుట్‌బాల్‌కు కూడా అలాంటి ఓ స్టార్ కావాలి. దశాబ్దాలుగా దేశం అలాంటి హీరో కోసం ఎదురు చూస్తోంది. మరో రెండు నెలల్లో మొదలయ్యే భారత సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ద్వారా ఓ ఫుట్‌బాల్ దేవుడు దొరుకుతాడేమో అని కార్పొరేట్ ప్రపంచం ఆశపడుతోంది.
 
మరి ఐఎస్‌ఎల్ ‘గోల్’ కొడుతుందా?
 
ప్రపంచం అంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మన దగ్గర కూడా దీనిని బాగానే ఆదరిస్తున్నారు. రాత్రిళ్లు నిద్రలు మాని టీవీలు చూస్తున్న భారతీయుల్లో తరచుగా మెదులుతున్న ప్రశ్న... ‘మన దేశం ఎప్పుడు ఆడుతుంది?’. దీనికి సమాధానం చెప్పేవారు లేరు. అయితే ఐఎస్‌ఎల్ రూపంలో ఓ కొత్త లీగ్ ద్వారా దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
 
అసలేంటీ ఐఎస్‌ఎల్?

ఎనిమిది జట్లు... 176 మంది ఆటగాళ్లు... కావాల్సినంత గ్లామర్... ఇది ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ స్వరూపం... దాదాపు మూడు నెలల పాటు భారత్‌లోని పలు నగరాల్లో జరిగే ఈ టోర్నీ మరో 60 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ సాకర్ స్ఫూర్తితో మొదలుకానున్న ఐఎస్‌ఎల్‌వైపే ఇప్పుడు అందరి దృష్టి. భారత్‌లో అథఃపాతాళానికి పడిపోయిన ఫుట్‌బాల్ ఆశలన్నీ ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్‌పై ఉండటమే ఇందుకు కారణం.
 
భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధే లక్ష్యంగా ఐఎంజీ, రిలయన్స్ ఆధ్వర్యంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య సహకారంతో ఈ ఏడాది నుంచి ఐఎస్‌ఎల్ ప్రారంభం కానుంది. అట్లెటికో డి కోల్‌కతా (కోల్‌కతా), నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్ (గువాహటి), కేరళ బ్లాస్టర్స్ (కొచ్చి)తో పాటు ముంబై, పుణే, న్యూఢిల్లీ, బెంగళూరు, గోవానగరాల నుంచి మొత్తం ఎనిమిది జట్లు ఐఎస్‌ఎల్‌లో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టులో 22 మంది ఆటగాళ్లు ఉంటారు.

ఇందులో 10 మంది విదేశీ ప్లేయర్లు. 8 మంది దేశవాళీ భారత ఫుట్‌బాలర్లు, నలుగురు స్థానిక ఆటగాళ్లు ఉంటారు. ఇప్పటికే 59 మంది భారత ఆటగాళ్లు ఐఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ప్రతీ జట్టులో ఒక విదేశీ స్టార్ ఉంటాడు. డ్వైట్ యార్కే, ఫ్రెడ్రిక్ జంగ్‌బెర్గ్, రాబర్ట్ పిరెస్, మైకేల్ చోప్రా, లూయిస్ సాహా, హెర్నర్ క్రెస్పో ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు మరికొందరు విదేశీ స్టార్ ఆటగాళ్లు ఐఎస్‌ఎల్‌లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు టోర్నీ జరిగే అవకాశమున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఇక టోర్నీలో ప్రతీ జట్టును రూ. 12 కోట్లు (ఏడాదికి) చెల్లించి కొనుగోలు చేశారు. కోల్‌కతా జట్టును రూ. 18 కోట్ల (ఏడాదికి)కు దక్కించుకున్నారు. తొలి ఏడాది ప్రతీ జట్టు స్థాని కంగా ఫుట్‌బాల్ అభివృద్ధికి రూ. 2 కోట్లు ఖర్చుపెడుతుంది. ఇప్పటిదాకా కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, గోవా వంటి ప్రాంతాలకే పరిమితమైన ఫుట్‌బాల్ క్రీడ.. భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందేందుకు ఐఎస్‌ఎల్ ఉపయోగపడొచ్చు.
 
స్టార్స్ ఉండకపోవచ్చు!

 
అయితే ఈ లీగ్ కోసం మెస్సీలు, నెయ్‌మార్‌లు వచ్చి ఆడే అవకాశం లేదు. కాబట్టి ఆట పరంగా స్టార్స్ లేరనే అనుకోవాలి. ఇది ప్రతికూలాంశం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాలర్లను లీగ్‌ల్లో ఆడించాలంటే మాటలు కాదు.. ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవాంటే ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే. కానీ ఐఎస్‌ఎల్ జట్లు ఈ టోర్నీ కోసం అంత సాహసం చేసే అవకాశం కానీ, స్తోమత కానీ లేదు.  దీంతో ఐఎస్‌ఎల్ టోర్నీ స్టార్లు లేకుండానే జరగనుంది. భారత ఆటగాళ్లు, మాజీ విదేశీ ఆటగాళ్లతోనే బండిని లాగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ సూపర్ లీగ్ హిట్టవుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.
 
భవిష్యత్ ఫుట్‌బాల్‌దే(నా)?
 
ఇండియన్ సూపర్ లీగ్‌పై మున్ముందు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 400 కోట్ల రూపాయలు కుమ్మరించబోతున్నారు. సాకర్‌పై ఉన్న అభిమానాన్ని మరింతగా విస్తరించి భారత్‌లో ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ఇండియన్ సూపర్ లీగ్ అడుగులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. సాకర్ లీగ్‌ల్లో అత్యంత ఆదరణ ఉన్న టోర్నీ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్)తో ఐఎస్‌ఎల్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. భారత్‌లో సాకర్ అభివృద్ధికి, ఐఎస్‌ఎల్‌లో క్వాలిటీ పెంచేందుకు, ఫ్రాంచైజీలు ఆర్థికంగా బలపడేందుకు  సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు అందజేస్తుంది. మొత్తానికి భారీ అంచనాల మధ్య తొలిసారిగా భారత ఫుట్‌బాల్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఐఎస్‌ఎల్‌కు ఇప్పటికిప్పుడు ఆదరణ లభించకపోయినా... మున్ముందు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. అందుకే మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ తారలు తమవంతు ప్రయత్నంగా ఇందులో భాగమయ్యారు.
 
ఎవరు చూస్తారు?

మన దగ్గర ఎవరైనా క్లబ్ ఫుట్‌బాల్‌ను ఆసక్తిగా చూశారంటే వాళ్లు కచ్చితంగా టీవీల్లో ఈపీఎల్, లా లిగా వంటి పెద్ద టోర్నీలు చూస్తున్నట్లే లెక్క. ఆ టోర్నీల్లో స్టార్ ఆటగాళ్ల విన్యాసాలు చూసిన తర్వాత... ఐఎస్‌ఎల్ వాళ్ల కంటికి ఆనకపోవచ్చు. ఈ విషయంలో ఐఎస్‌ఎల్ ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఒక్కసారి లీగ్ చూసిన వ్యక్తి మళ్లీ ఈ మ్యాచ్‌ల కోసం ఎదురుచూడాలి. ఒకవేళ నాణ్యమైన ఆటగాళ్లు లేక లీగ్‌లో ఆట పరంగా నాణ్యత లేకపోయినా... ఏదో ఓ రూపంలో అభిమానిని ఆపాలి. ఇదే ఐఎస్‌ఎల్ బృందానికి పెద్ద సవాల్.
 
 సక్సెస్ అయ్యేదెలా ?

 క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో అభిమానులను మరో క్రీడవైపు మళ్లించడం అంత సులువైన విషయం కాదు. ఇందుకు లీగ్‌ల రేటింగ్సే సరైన ఉదాహరణలు. లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ హిట్ కాగా.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్) ఫర్యాలేదనిపించింది. అది కూడా ఐబీఎల్‌లో స్టార్ ప్లేయర్లు పాల్గొనడం వల్లే సాధ్యమైంది. ఐఎస్‌ఎల్ విజయవంతం కావాలంటే అభిమానులను టోర్నీ ఆకట్టుకోవాలి.  అయితే స్టార్లు లేకపోవడంతో టోర్నీని విజయవంతం చేయడం మాటలు కాదు. ఐఎస్‌ఎల్ గురించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. టోర్నీ దగ్గర పడుతున్నా... ఇప్పటిదాకా ఆ దిశగా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ప్రముఖులు జట్లను కొనుగోలు చేయడంతో అభిమానుల దృష్టి ఈ ఫుట్‌బాల్ టోర్నీపై నిలిచినా.. ఐఎస్‌ఎల్ పూర్తయ్యే వరకు మ్యాచ్‌లు వీక్షించేలా చేయడం అంత సులభం కాదు.
 
గ్లామర్ కిక్

భారత్‌లో అన్ని లీగ్‌ల కన్నా ఐఎస్‌ఎల్‌పై అభిమానులు దృష్టి కేంద్రీకరించడానికి  కారణం క్రికెట్ దిగ్గజాలు ఫుట్‌బాల్ వైపు ఆసక్తి చూపడమే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. పొట్లూరి వరప్రసాద్‌తో కలసి కేరళ బ్లాస్టర్స్ జట్టును, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు అట్లెటికో మాడ్రిడ్‌తో పాటు మరికొందరితో కలసి అట్లెటికో డి కోల్‌కతా జట్టును కొనుగోలు చేశారు. ఇక బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ (పుణే), రణ్‌బీర్ కపూర్ (ముంబై), జాన్ అబ్రహం (నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ) ఐఎస్‌ఎల్‌లో జట్లకు ఓనర్లుగా ఉన్నారు. దీంతో ఈ ఫుట్‌బాల్ టోర్నీకి ఎక్కడాలేని గ్లామర్ కిక్ వచ్చింది.
 

Advertisement
Advertisement