తన ప్రేమను పంచేవారికోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు! | Sakshi
Sakshi News home page

తన ప్రేమను పంచేవారికోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు!

Published Sun, Mar 13 2016 12:52 AM

తన ప్రేమను పంచేవారికోసం  ఎదురు చూస్తున్నాడు దేవుడు!

సువార్త
బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు తన పరాక్రమంతో బబులోను సామ్రాజ్యాన్ని విస్తరించి, స్థిరపర్చి ఖ్యాతినార్జించాడు. ఎంతో కిరాతకుడు, పాలనాదక్షుడుగా చెప్పుకునే నెబుకద్నెజరు యూదురాజ్యాన్ని కూడా ఆక్రమించి, అక్కడి దేవుని ప్రజలైన యూదులను చెరబట్టి బబులోనుకు బానిసలుగా తీసుకెళ్లాడు. యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి అందులోని బంగారు, వెండినంతా కొల్లగొట్టాడు. అయితే దేవుని ప్రజలైన యూదులు అతని చెరలో ఉన్న కారణంగా దేవుడతనికి కలల ద్వారా హెచ్చరికలు జారీ చేయగా, అతని వద్ద బానిసల్లో ఒకరైన దానియేలు వాటిని ఆయనకు విడమర్చి చెప్పవలసి వచ్చేది. అంతటి మహాచక్రవర్తి కూడా ఒక బానిస తెలివితేటల మీద ఆధారపడేవిధంగా దేవుడు తన శక్తిని నిరూపించాడు. చివరికతను పిచ్చివాడై రాజధాని వదిలి అరణ్యంలో జంతువులతో సమానంగా తిరుగుతూ గడ్డితింటూ గడిపే పరిస్థితి ఏర్పడింది (దానియేలు 4:1-33).

 మనిషికి అహంకారమే గొప్ప శత్రువు. ఈరోజున్న వైభవమే శాశ్వతమన్న భ్రమను ఆ శత్రువు కల్పిస్తాడు. పొద్దున వికసించి సాయంత్రానికి వాడిపోయే పూవులాంటి వైభవాన్ని నమ్ముకొని నన్ను మించినవారు లేరని విర్రవీగేవారి జీవితం, క్షణాల్లో పెకైగసి, వెలుగులు విరజిమ్మి బూడిదకుప్పగా ఎక్కడో కూలిపోయే తారాజువ్వలాంటిదేనన్నది చరిత్ర చెప్పే వాస్తవం. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, జనాకర్షక విధానాలు పునాదిగా నిర్మించబడిన జీవితాలు, పరిచర్యలు, చర్చిలు కొద్దిరోజులు కనబడి ఆ తర్వాత అంతర్థానమై పోవడం వెనక రహస్యం ఇదే! విశ్వాసులను, దేవుణ్ణి కూడా సొంతలాభం కోసం వాడుకునే స్థాయికి దిగజారితే, దేవుని రాజ్య నిర్మాణం జరగదు సరికదా, అలా నిర్మించుకున్న సొంత సామ్రాజ్యాల పునాదులు కూడా కదిలిపోయి అవి కుప్పకూలిపోవడం తప్పదు. అయినా ఎంతో ఐశ్వర్యవంతుడు, సర్వాధిపతి, సర్వసృష్టికర్తగా, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తే అన్నీ వదిలేసి రిక్తుడుగా, పేదగా, దాసుడుగా ఈ లోకానికి వేంచేస్తే ఆ దేవుని పరిచారకులమని చెప్పుకునే వారు అన్నీ సంపాదించుకోవడానికే తెగిస్తున్నారంటే, యేసుక్రీస్తు ఎవరో ఆయన ఆశయమేమిటో వారికింకా అర్థం కానట్టే!!

 యేసుప్రభువు అడుగుజాడల్లో నడిచిన ఆదిమ విశ్వాసులు, అపొస్తలులు కూడా అన్నీ వదులుకొని సేవ చేసి తరించినవారే. కాగా వారి వారసులైన ఈనాటి తరం పరిచర్య ముసుగులో అన్నీ సంపాదించుకోవడానికే ఆరాటపడటం బాధ కలిగించే విషయం. ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత తప్పనిసరిగా నిర్మించబడవలసిన దేవుని రాజ్యాన్ని, స్వార్థం, కుట్రలు, డబ్బుతో కంపుకొడుతున్న సొంత సామ్రాజ్యాల స్థాపన కోసం నిర్లక్ష్యం చేసినందుకు ఒకరోజున మూల్యం చెల్లించవలసి వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప చర్చిలకోసం కాదు, తన ప్రేమను వెదజల్లే మంచి కార్యాలు, మంచి చర్చిలకోసం చూస్తున్నాడు.  - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్

Advertisement

తప్పక చదవండి

Advertisement