జానీ బామ్మకు జోహారు

17 Oct, 2014 23:06 IST|Sakshi
జానకీరాణి

నివాళి
 
ఆకాశవాణి ఉద్యోగులకు, శ్రోతలకు ‘రేడియో అక్కయ్య’గానూ మా పిల్లలకు ‘జానీబామ్మ’గానూ ఎంతో ఆత్మీయురాలైన తురగా జానకీరాణిని తలచుకుంటే మిగిలేవన్నీ అందమైన జ్ఞాపకాలే. చిరునవ్వుల సంభాషణలే. 1977లో తెలుగు యువవాణిలో తాత్కాలిక అనౌన్సర్‌గా చేరిన నాటి నుంచి నాకు ఆమెతో పరిచయం. అలుపెరగని శ్రమజీవి, అపారమైన మనోనిబ్బరం ఉన్న వ్యక్తి ఆమె. భర్త తురగా కృష్ణమోహనరావుగారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కూడగట్టుకున్న ధైర్యం, మొన్నటికి మొన్న తన పెద్దమ్మాయి ఉషారమణి భర్త నరేందర్ చనిపోయేవరకూ ఆమెను వీడలేదు. ఎన్నో అనారోగ్యాలున్నా మనసుకు మరెన్నో గాయాలున్నా హుషారుకు మారుపేరుగా అందరికీ కనిపించారంటే అదంతా ఆమె సంకల్ప బలమే.
 
జానకీరాణి గురించి ఎక్కువమందికి తెలిసింది ఆమె మంచి కథారచయిత్రి అని. మంచి రేడియో ప్రయోక్త అని. కాని ఆమెకు ఇంగ్లిష్‌లో అపారమైన పాండిత్యం ఉందనీ ఆమె చక్కని నర్తకి అని చాలామందికి తెలీదు. ఆమెకు నాయకత్వ లక్షణాలు మెండు. ఆ రోజుల్లోనే హైదరాబాద్‌లో ఏర్పడిన రచయిత్రుల సంఘం ‘సఖ్యసాహితి’కి ఆమె అధ్యక్షురాలిగా పని చేశారు. రచయిత్రులను కూడగట్టి చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించారు.

చలం మనమరాలిగా పుట్టినందుకు ఆనందించినా, ‘మా తాతయ్య చలం’ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా రాసుకున్నా తనను వేదికపై పరిచయం చేసేటప్పుడు ‘చలం మనమరాలు’ అని అభివర్ణిస్తే చిరాకు పడేవారు. తన అస్తిత్వం తనదే. దానికి మరొకరి ‘గోడ చేర్పు’ అవసరం లేదని ఆమె భావన. అయితే పిల్లల కోసం ఎక్కువ పని చేయడం వల్లనో ఏమో అపుడపుడూ ఆవిడలోనూ ఇంకా పసితనం పోలేదని అనిపించేది. పిల్లలంటే ఆమెకు ఎంత ఇష్టమంటే వారి హక్కుల కోసం ‘బాలవాదం’ రావాలని గట్టిగా వాదించేవారు.

‘బంగారు పిలక’, ‘బి.నందంగారి ఆస్పత్రి’, ‘మిఠాయి పొట్లం’ వంటి పుస్తకాలను పిల్లల కోసం వెలువరించడం ఎంత నిజమో నిజ జీవితంలో కూడా అలగడం, మారాం చెయ్యడం, చిన్న చిన్న కోరికలను కనడం, పెంకిగా ప్రవర్తించడం- అంతే నిజం. జానకీరాణిగారి సన్నిహితులు ఆమె కంటే చిన్నవారైనా ఆమె బాల్యాన్ని ‘చూడ’గలిగారు. అయితే కథలు రాసేటప్పుడు ఈ పసితనం మాయమయ్యి ఆమెలోని చైతన్యమూర్తి అందునా చైతన్యంతో నిండిన స్త్రీమూర్తి కనిపించేది. ఆమె కథాశిల్పం చాలా వేగవంతమైనది. చదివించే గుణం కలిగినది.

మధ్యతరగతి జీవితాల్లోని స్త్రీల నలుగుబాటును ఆమె చాలా సూక్ష్మపరిశీలనతో చేశారనిపిస్తుంది. కథలు రాసినా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి యూనిసెఫ్ వరకూ పని చేసినా జానకీరాణి తాను చేపట్టిన ప్రతి పనినీ చక్కని ప్రతిభతో పట్టుదలతో చేసి చూపించారు. తనకు తెలిసిన కళలలో అంటే రచన ద్వారా, ఆడియో మాధ్యమం ద్వారా పిల్లల కోసం, స్త్రీల కోసం తను చేయగలిగినదంతా చేశారు. లోక్‌సత్తా పార్టీ సభ్యత్వం ద్వారా తన రాజకీయ సత్తాను కూడా నిరూపించుకున్నారు.
 
వ్యక్తిగత జీవితంలోని విషాదాలకు ఆమెకు కొరతేమీ లేదు. కానీ అవేవీ ఆమె ఆలోచనలకు ఆటంకాలు కాలేదు. ఆమెలోని సెన్సాఫ్ హ్యూమర్ తన కష్టాలనూ తనను చుట్టుముట్టిన సంఘటనలనూ నిర్లిప్తతతో చూసేలా చేసేది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఆమెకు సహజలక్షణం. జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలనీ అనారోగ్యం అసౌకర్యం పేరిట తనకిష్టమైన పనులేవీ మానుకోకూడదనీ చెప్పడమే కాదు చేసి చూపించిన అపురూప వ్యక్తిత్వం ఆమెది. పెళ్లి కావచ్చు, పేరంటం కావచ్చు, పుస్తకావిష్కరణ కావచ్చు, ఊరికనే రచయితలు కలిసే సభ కావచ్చు, తనకు అందులో ఏ పాత్రా ఏ ప్రాముఖ్యమూ లేకపోవచ్చు.

అయినా ఆమె హాజరైపోయేవారు. మిత్రులను కలుసుకోవాలన్నా పది మందితో మంచీ చెడ్డా మాట్లాడుకోవాలన్నా ఆమెకెంత ఇష్టమో. జీవితాన్ని ప్రతిక్షణమూ తనకిష్టమైన విధంగా గడపడానికి ప్రయత్నించడం అతికొద్ది మందికి మాత్రమే సాధ్యం. దానికి ఆవిడ ఆరోగ్యం సహకరించకపోయినా ఇంటి పరిస్థితులు అనుకూలించకపోయినా ఆమెలో తడబాటు లేదు. నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదు.
నాకూ జానకీరాణిగారికీ మధ్య ఉన్నది ఒక విలక్షణమైన అనుబంధం.

యువవాణి అనౌన్సర్‌గా నన్ను, నా కంఠస్వరాన్ని మెచ్చుకుంటూనే ‘ఆ వేగం ఏమిటి? కాస్త నెమ్మదిగా మాట్లాడలేవూ. శ్రోతలు చస్తారు నిన్ను అర్థం చేసుకోవడానికి’ అని తొలిరోజుల్లో మందలించినా ఆ తర్వాత 20 ఏళ్లకు కాబోలు ‘మా ఆయన పేరు మీద పెట్టిన అవార్డుకు నీ కంటే అర్హులు లేరు’ అంటూ తురగా కృష్ణమోహనరావుగారి అవార్డు నాకు ఇచ్చినా, కొన్ని నెలల క్రితం ఒక పెళ్లిలో నేను ఆమెకు ప్లేటులో భోజనం తెచ్చి ఇచ్చి తినేవరకూ పక్కనే కూర్చున్నప్పుడు ‘నువ్వు నాకుతెచ్చి పెట్టడమేమిటి? నేను తెచ్చుకోగలను’ అని నన్ను కసురుకున్నా నెలకోసారి తప్పక నాకు ఫోన్ చేసి, పలకరించి, నా పిల్లల గురించి ముచ్చటించినా మా మధ్య ఒక ఆత్మీయబంధం.

నెలరోజుల క్రితం అనుకుంటా జానకీరాణిగారు నాకు ఫోన్ చేసి ‘నా కథలన్నీ కలిపి సంపుటం వేశాను. నీకు పంపానా?’ అని అడిగారు. లేదన్నాను.  ఆవిష్కరణ సభ జరిగినట్టు పేపర్‌లో చూశానన్నాను. ‘ఆ సభకు నిన్ను పిలవాల్సింది. అందరూ బాగానే మాట్లాడారుగాని నా పుస్తకం గురించి కాదు. నాకు కావలసింది నా కథలు ఎలా ఉన్నాయని. నువ్వయితే విశ్లేషణ బాగా చేసేదానివి. నీకు నా పుస్తకం పంపుతాను. చదివి తెలుగులో కాదు ఇంగ్లిష్‌లో రివ్యూ రాయి.

ఇండియన్ లిటరేచర్‌కు పంపు’ అని ఆదేశించారు. తప్పక చేస్తానని అన్నాను. నేనే పుస్తకం కొనుక్కుంటానని రెండు సార్లయినా అనుంటాను. ‘నువ్వ కొనుక్కోవడమేమిటి? నేను పంపుతాను’ అన్నారు. ఇంతవరకూ ఆమె పంపలేదు. పంపలేకపోయారు. నేను రివ్యూ ఇంకా రాయలేదు. మన్నించు జానీ బామ్మా. ఇప్పటికి నేను రివ్యూ రాయొచ్చు. రాస్తాను కూడా. కానీ మీరు చదవరుగా?                             
 
- మృణాళిని
 

మరిన్ని వార్తలు