స్నేక్‌హితురాలు | Sakshi
Sakshi News home page

స్నేక్‌హితురాలు

Published Wed, Apr 30 2014 4:23 AM

స్నేక్‌హితురాలు - Sakshi

విచిత్రం
 
పిల్లలు ఆడుకోడానికి ఏదో ఒక వస్తువుండాలి. పక్షులు, పెంపుడు జంతువులయితే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. కుక్క పిల్ల, పక్షి పిల్లని పెంచుకునే పిల్లల గురించి తెలుసు మనకి. కానీ పాములే నాకిష్టమైన నేస్తాలనే పిల్లల గురించి మీరెపుడైనా విన్నారా...!

 
 ఉత్తరప్రదేశ్‌లోని గటంపూర్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక కాజోల్. ఆమెకు పాములంటే ప్రాణం. పొద్దున లేచినదగ్గర నుంచి నిద్రపోయేవరకూ వాటితోనే ఆమె సావాసం. కాజోల్‌ఖాన్ పాముల్ని ఇష్టపడడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. తాత, తండ్రి, అన్న అందరూ పాముల్ని పట్టుకుని, వాటిని అమ్ముకుని బతుకుతున్నారు.

 ఎప్పటిలాగే ఒకరోజు కాజోల్ తండ్రి మహ్మద్ తాజ్ పాములు పట్టుకోవడానికి వెళ్లాడు. తండ్రి వెనకే పాముల్ని పట్టుకోవడానికి వెళ్లిన కాజోల్‌కి వాటిపై మమకారం పెరిగింది. ఇక అప్పటి నుంచి వాటితోనే ఆమె కాలక్షేపం. కోరలున్న పాములతో ఆడుకుంటూ గత రెండేళ్లలో కాజోల్ మూడుసార్లు పాముకాటుకి గురైంది. మూడుసార్లూ మహ్మద్ తాజ్ తనకు తెలిసిన నాటువైద్యం చేసి బిడ్డను బతికించుకున్నాడు. ‘‘పాము కరిచినప్పుడు అందరూ దాన్ని చంపాలన్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే దానికి ఇబ్బందికలిగేలా నేను ప్రవర్తించడం వల్లనే అది కాటు వేసింది. లేదంటే...పాము మనల్ని కరవదు’’ అంటూ బుల్లి బుల్లి మాటలు చెబుతున్న కాజోల్ ఈ మధ్యనే పాఠశాలకు వెళ్లడం మానేసింది. ఒకరోజు స్కూలు బ్యాగులో పామును పెట్టుకెళ్లడంతో తరగతి గదిలోని పిల్లలంతా ‘బాబోయ్...’ అంటూ ఇళ్లకు పరుగులు తీశారు. ఆరోజు నుంచి ఉపాధ్యాయులు కాజోల్‌ని పాముల జోలికి వెళ్లొద్దని, పాములతో స్కూలుకు రావద్దని గట్టిగా చెప్పారు.

 అంతే... దొరికిందో వంక. కాజోల్ స్కూల్‌కి ఓ నమస్కారం పెట్టి పాములతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తోంది. కాజోల్ చేతిలోని నాగుపాముల్ని చూసినవారంతా ఆశ్చర్యంగా అందరికీ ఆమె గురించి చెబుతూ బోలెడంత ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అప్పటివరకూ ఓ నాలుగైదు గ్రామాల్లో పాముల్ని పట్టే తాజ్‌కి చుట్టుపక్కల మండలాల నుంచి పాముల సమాచారం రావడం మొదలైంది.
 ‘అంతా బాగానే ఉంది... కానీ, భవిష్యత్తులో నా బిడ్డ పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదు’ అంటూ తలపట్టుకుంది కాజోల్ తల్లి సల్మా భానొ. ‘చాలారకాలుగా చెప్పి చూశాను. అయినా పాములపై తన ఇష్టాన్ని పోగొట్టుకోవడం లేదు. గట్టిగా కోప్పడితే అడవికిపోయి పాములతోనే ఉంటానంటోంది’ అంటూ నిట్టూరుస్తోంది కాజోల్ తల్లి. పాములతో కాజోల్  స్నేహం త్వరలోనే ఆగిపోతుందో! లేదంటే కడదాకా కొనసాగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement