భిన్నత్వంలో ఏకత్వం... బతుకమ్మ బ్యూటీ | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వం... బతుకమ్మ బ్యూటీ

Published Sun, Sep 25 2016 1:12 AM

భిన్నత్వంలో ఏకత్వం... బతుకమ్మ బ్యూటీ

గత తొమ్మిదేళ్లుగా ‘తెలంగాణ జాగృతి’ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా తెలంగాణలోని 109 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 30 నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలను జరుపబోతోంది. అంతేకాదు, ఈసారి దాదాపు తొమ్మిది దేశాల్లోని వివిధసంస్థలతో కలసి అక్కడ కూడా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చెయ్యబోతోంది ‘తెలంగాణ జాగృతి’. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత... సాక్షి ‘ఫ్యామిలీ’తో ముచ్చటించారు. సాంస్కృతిక, రాజకీయ, మహిళా అంశాలపై తన మనోభావాలను వెల్లడించారు.

9 ఏళ్లు... 9 రోజులు... 9 దేశాలు

బతుకమ్మ - బాలగంగాధర తిలక్
తెలంగాణ ఉద్యమంలో నేను నిర్విరామంగా పాల్గొంటున్న సమయంలో ఉద్యమంలో పాల్గొనడానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన మహిళల్లో తొంభై శాతం మంది ఈ జైళ్లు, బెయిళ్లు ఎందుకని చెప్పి ఉద్యమంలోంచి వెనక్కి తగ్గారు. కారణం ఇంట్లో వాళ్ల ఒత్తిడి కావచ్చు, ఇంకా అనేక అంశాలు కారణాలుగా ఉండొచ్చు.

వాటన్నిటినీ గమనించాక నాకు అనిపించింది... ఇట్లా కాదు.. ఏదైనా సాంస్కృతిక అంశంతో వీళ్లను కలుపుకోవాలి అని! అప్పుడే బాలగంగాధర తిలక్ గురించి చదివాను. స్వాతంత్య్రోద్యమంలో యువతీయువకుల భాగస్వామ్యం పెంచడానికి గణేశ్ నవరాత్రులను ఆయన కేంద్రంగా చేసుకున్నారనే విషయం గురించి చిన్నప్పుడే చదువుకున్నా. ఎలా చేశారు అనే దానిమీద వివరంగా తెలుసుకోవాలనిపించి ఆయన గురించి మళ్లీ చదివాను. అప్పుడే బతుకమ్మ చరిత్రనూ లోతుగా అధ్యయనం చేశాను.

వేడుక నుంచి... ఉద్యమంలోకి...
ఎవరినీ నొప్పించకుండా, ఈ పండుగ ద్వారా తెలంగాణలోని అందరినీ కలిపి ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి..  అసలు ఈ పండుగ ఏంటి? మతానికి సంబంధించినదా? సంస్కృతికి సంబంధించినదా? అనే కోణంలో కూడా అధ్యయనం చేశాను. బేరీజు వేసుకున్నాను. ఈ పండుగ పూర్తిగా సంస్కృతికి సంబంధించినదని, తెలంగాణ ప్రజల జీవితంలో భాగం అని తెలిసింది. ఇంకా చెప్పాలంటే ప్రకృతికి దగ్గరగా ఉండే పండుగ. కాబట్టి ధైర్యంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనిపించింది.

మొదలుపెట్టాను. తెలంగాణ ప్రాంతంలోని మహిళలు ఒకరితర్వాత ఒకరు,  ఒకరిని చూసి ఒకరు సంతోషంగా మా బతుకమ్మ వేడుకకు రావడం మొదలు పెట్టారు. ఓ మూడేళ్లయ్యాక .. ‘బతుకమ్మ మన పండుగ.. మన సంస్కృతి. అందుకే ఆడుకుంటున్నం. మన లక్ష్యం కూడా ఒకటుంది. తెలంగాణ సాధన. కాబట్టి బతుకమ్మను తెచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు దాని మీద జై తెలంగాణ అనే జెండా పెట్టుకొని రండి’ అని చెప్పాం.

అలాగే రావడం మొదలుపెట్టారు. అట్లా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాం. అంటే తెలంగాణలోని ప్రతి మహిళ ‘ఐయామ్ ఫర్ తెలంగాణ’ అనే సందేశాన్ని సటిల్‌గా చాటిందన్నమాట. నాజూగ్గా చెప్పడమన్నమాట. తిట్టడం, కొట్టడం, అరవడం లేకుండా వినయంగానే చాలా బలంగా చెప్పే ప్రయత్నమన్నమాట.

‘జాగృతి’.. నా ఆలోచన, నా నిర్ణయం
తెలంగాణ జాగృతి సైద్ధాంతికత, పేరు దగ్గర్నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ చేయాలనే నిర్ణయాల దాకా అన్నీ నేను సొంతంగా తీసుకున్నవే. ఏదైనా ఆలోచన వస్తే అమలు చేయడమే నాకు తెలుసు. ఎందుకంటే దాని జయాపజయాల బాధ్యత నాదే అవుతుంది. పదిమంది సలహాలు తీసుకొని పదిమందిని సంప్రదించి చేస్తే.. అది వాళ్ల అనుభవంలోంచి వచ్చింది అవుతుంది. మన విషయంలో అది నూరు శాతం కరెక్ట్ అవ్వాలనే రూలేం లేదు. అందుకే బతుకమ్మ సంబురాలు చేసే విషయంలో కూడా నేను నాన్నగారిని అనుమతి అడగలేదు.. సూచనలు అంతకన్నా అడగలేదు.

జస్ట్ చేస్తున్నానని చెప్పాను అంతే. ఆయన మర్రిచెట్టులాంటి వారు. ఆయనకున్న విస్తృత అనుభవంతో మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవకూడదు. పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఈజ్ గుడ్. తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించాలంటే సొంత ఆలోచనలుండాలి.. సొంతంగా పనిచేయాలి అనుకొని చెప్పలేదు. కానీ జయశంకర్ సర్‌తో నిత్యం మాట్లాడ్డం ఉండేది. అదీ తెలంగాణకు సంబంధించి సాధారణ సంభాషణే తప్ప ప్రత్యేకించి సలహాల కోసమైతే  కాదు.

నా కోసం వచ్చి... నాన్న కోసం ఉండిపోయా...
2001లో నాన్న పార్టీ పెట్టినప్పుడు.. ‘మేమిద్దరమే ఉన్నాం.. మియాబీబీ! మా పిల్లలు ఎక్కడో బయట సెటిల్ అయ్యారు’ అని చెప్పారు. మాక్కూడా అప్పుడు వెనక్కి రావాలి.. ఏదో చెయ్యాలి అనే ఆలోచన లేదు. కానీ 2005, 06 వచ్చేటప్పటికి తెలంగాణ మూవ్‌మెంట్ పీక్‌కి వెళ్తోంది. అన్ని రాజకీయపార్టీలు కలసి సవాళ్లు విసురుతూ అడుగడుగునా తెలంగాణ ఉద్యమానికి పరీక్షలు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే..  కేసీఆర్ లేకపోతే ఉద్యమం ఉండదు.. అందుకే ఈ ఉద్యమం నుంచి కేసీఆర్‌ను తప్పించాలనేది బాగా వచ్చింది.

అప్పుడు నాలాంటి లక్షలాది తెలంగాణ బిడ్డలు బాగా ప్రభావితం అయ్యి తెలంగాణ కోసం, టీఆర్‌ఎస్ కోసం, కేసీఆర్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో నేను ఇండియా వచ్చాను. నాన్నగారు ఉప ఎన్నికలో ఉన్నారు. అవన్నీ చూశాక అనిపించింది.. బయట నుంచి ఎవరెవరో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు.. చేయగల శక్తి ఉండీ ఏం పట్టనట్టుగా నేను ఇంట్లో కూర్చోవడమేంటీ అని. అప్పుడు నాన్న కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. నాన్న ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో అంతకుముందెప్పుడూ అలా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు నేను. అసలు ఆయన రాజకీయ జీవితంతోనే మాకు సంబంధం ఉండేది కాదు.

జాగృతం చేస్తూ నాన్న... ‘జాగృతి’ ద్వారా నేను...
కేవలం ఓ ఉద్యమకారుడికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నా. అదంతా అయిపోయాక అప్పుడు.. ఐ ఫెల్ట్ ద ఇన్‌ఫ్లుయెన్స్.. నీడ్ అండ్ నెసెసిటీ. రావాలి కచ్చితంగా.. ఎంతమంది వీలైతే అంతమంది ఉద్యమంలోకి వస్తే తప్ప తెలంగాణ సాధన సాధ్యంకాదు అని అనుకుని నేను ఇందులోకి వచ్చాను. అయితే నాన్నగారి ఆలోచన నన్ను మోటివేట్ చేయాలి కాని ఎట్టి పరిస్థితుల్లో నన్ను ప్రభావితం చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే ఒక పనిని ఎట్లా చేయాలనే అవగాహన ఆయన చెప్పించిన చదువుతోనో.. ఆయన నడిచిన దారితోనో నాకు తెలుసు. ఆ మిగిలిన ఖాళీలను మనమే నింపుకోవాలి. లేకపోతే వ్యక్తిగతంగా మనకేం సామర్థ్యమున్నట్టు?

ఇంకో సవాలేంటంటే.. ఆయనో పెద్ద వృక్షం.. ఆయన ముందు మనమేం చేసినా కనిపించదు. సంతృప్తి ఉండదు. పైగా పోలిక మొదలవుతుంది. నిజం చెప్పాలంటే అదో పెద్ద భారం. ఆ ఒత్తిడిని మోస్తూ ఉండాలి. ఒకటే అనుకున్నాను.. నేను ఎంత చేయగలిగితే అంత చేస్తాను. అదీ ఉద్యమానికి కాని, ఆయన ఇమేజ్‌ని దెబ్బతీసేట్టు గాని చేయకుండా. ఆ స్పష్టత ఉంది కాబట్టే ఎప్పుడూ జోక్యం కానీ,  ఎక్కడా దాటడం కానీ జరగలేదు. అందుకనే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదప్పుడు. ‘జాగృతి’ ద్వారా ఉద్యమంలో పాల్గొన్నాను.

వీళ్లకేమీ చేయలేమా అనిపించింది
ఉప ఎన్నిక ప్రచారంలో చాలా రోజుల తర్వాత గ్రామాలకు వెళ్లడం, గ్రామీణ జీవితాన్ని, అక్కడి పేదరికాన్ని దగ్గరగా చూడడం.. ప్రజలంతా.. ‘తెలంగాణ సాధనలో మా అందరి మద్దతు ఉంటుంది.. కానీ వచ్చాక మా జీవితాలకు ఓ భరోసా కావాలి.. కనీసం నెలకు ఒక్క వెయ్యిరూపాయలు సంపాదించుకునే వీలున్నా మా లైఫ్, మా పిల్లల లైఫ్ బాగుంటది’ అని అడగడం.. చాలా దయనీయంగా అనిపించింది. వీళ్లకేం చేయలేమా అనిపించింది. ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టినా ఓ పదిమందికి ఉపాధి కలిగించగల్గుతానేమో.. ఇంకో పదిమందికి నేరుగా సహాయం చేయగలనేమో. అయితే రాజకీయ ఉద్యమం తప్పనిసరి. ఎందుకంటే సోషల్ యాక్టివిటీకి ఉద్యమం సపోర్ట్ కావాలి. దాంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకున్నా. రాజకీయాల్లోకి మాత్రం అనుకోకుండానే వచ్చాను. రావాలనుకుని రాలేదు.
బతుకమ్మను ఇంతగా ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే...
బతుకమ్మ ప్రతి పాటలో స్త్రీ జీవితం వినపడుతుంది. సమాజాన్ని సున్నితీకరిస్తుంది. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వస్తే  కొంతవరకు సాధికారత సాధించినట్టే. పురుషుల ఆలోచనల్లో మార్పు వస్తేనే అది పూర్తిగా సాధ్యమవుతుంది. సమాజంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మహిళలు కూడా నిరంతరం తమ గళం వినిపిస్తూనే ఉండాలి. అందుకు బతుకమ్మ కూడా ఒక వేదికే.

అమ్మాయిలకు సాంస్కృతిక ఆమోదం ఉండాలి
అమ్మాయిలకు బయటకు వెళ్లే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలుండాలంటే సాంస్కృతికంగా సమాజంలో ఆమోదం ఉండాలి. రెండోది ప్రభుత్వం వైపు నుంచి రక్షణ ఉండాలి. అంటే సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. అందులోకి తాగే నీరు దగ్గర్నుంచి పబ్లిక్ టాయ్‌లెట్స్, చక్కటి రోడ్లు, సభ్యతగల ప్రయాణ సౌకర్యాలు అన్నీ వస్తాయి. మహిళల్ని మనం ఎలా చూస్తున్నాం అనే దానికి ఇవన్నీ గీటురాళ్లు. నాకు నచ్చనిదేమిటంటే... ‘మన దేశంలోనే అన్నీ జరుగుతున్నాయి.. మన దేశంలోనే క్రైమ్ ఉంది.. ఇక ఎక్కడా లేదు’ అనేది! ఇది అపోహ. చాలా తప్పు. మీరు క్రైమ్ రికార్డ్ తీసుకుని యూఎస్‌లో ఏం జరుగుతోందో, ఇంకే కంట్రీలో ఏం జరుగుతోందో చూడండి. ప్రపంచంలోని ప్రతిచోటా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాలు మనల్ని మహిళలకు రక్షణ లేని మూడో ప్రపంచ దేశాలుగా నిలబెడుతున్నాయి! దాన్ని మనం నమ్ముతున్నాం. ఇది సరికాదు. వాస్తవం గ్రహించి, మనల్ని పరిశీలించుకుని పరిస్థితి చక్కదిద్దుకోవాలి.

‘ఎప్పుడైనా బతుకమ్మను ఎత్తుకున్నవా నువ్వు’ అన్నరు
రాజకీయాల్లోకి అనుకోకుండానే వచ్చినా బాధ్యతను మాత్రం బలంగానే ఫీలవుతాను.  చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు నేర్పింది కూడా అదే.. చేస్తే ఏ పనినైనా సిన్సియర్‌గా చేయాలి.. లేకపోతే చేయకు.. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అని. పైపైన పనిచేయడం నాకూ ఇష్టం ఉండదు. నేను బతుకమ్మ మొదలు పెట్టినప్పుడు చాలామంది అనుకున్నరు.. ‘ఆ వీళ్లు ఎన్ని రోజులు చేస్తారు? అని.  రకరకాలుగా విమర్శించారు. నేను బతుకమ్మను ఎత్తుకున్నప్పుడు ఒక పెద్దాయన ఫోన్ చేసి ‘జీవితంలో ఎప్పుడైనా బతుకమ్మను ఎత్తుకున్నవా నువ్వు’ అని అన్నడు.

ఊర్లల్లో దొరలుగా చెలామణి అవుతున్న వాళ్లింటి వాళ్లు బతుకమ్మను ఎత్తుకోరు. కాని నేను ఎత్తుకున్న. ఆ ట్రెడిషన్‌ని బ్రేక్ చేశా. ఎందుకు..? అందరితో కలసి నడవాలని.. అందరితో కలిసి ఉద్యమంలో నడవాలని. నా కమిట్‌మెంట్ ఒక్కటే. ఈ పండుగని ఉద్యమ ప్రతీకగా మలచాలనుకున్న. మలచిన. రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా దేశానికి పరిచయం చేయాలనుకున్నా.. చేస్తున్న. బతుకమ్మలో ఉన్న బ్యూటీ ఏంటంటే.. ‘అసలు భిన్నత్వంలో ఉన్న అందం ఏంటి? ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఏంటి?’ అని  చెప్పే పండుగ ఇది.

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కొట్లాటలు, కల్లోలాలు... జాతి విద్వేషాలు! అందరం కలసి ఉంటేనే అందం. అందరం కలిసి ఉంటేనే బాగుంటాం. ఈ రోజు ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటే సత్తా ఉన్న పండుగ బతుకమ్మ. ఆ విశ్వజనీనత ఉంది ఈ పండుగలో. అందుకే ఇప్పుడు తొమ్మిది దేశాల్లో ఈ పండుగను జరుపుతున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మన సంప్రదాయాన్ని ఇంకా గొప్పగా స్థిరపరుస్తుంది. ప్రపంచానికి, మనకు మధ్య దీన్నో సాంస్కృతిక వారధిగా మలుస్తున్నాం. దీంతో స్ఫూర్తి పొందిన బ్రహ్మకుమారీలు కూడా ఈసారి పదమూడు దేశాల నుంచి ప్రతినిధులను తీసుకొచ్చి మన దగ్గర బతుకమ్మ నిర్వహిస్తున్నారు.

టీఆర్‌ఎస్ సహా ఏ పార్టీకీ మినహాయింపు లేదు
బతుకమ్మ మహిళా శక్తికి ప్రతిరూపం. రాజకీయాలలో మహిళల రిజర్వేషన్లు అనే విషయానికి వచ్చినప్పుడు మొదటి విషయం .. మహిళల సమస్యలను మహిళలే మాట్లాడాలి అన్నదానికి నేను ఒప్పుకోను. అందరూ మాట్లాడాలి. అప్పుడే ఆ అంశానికి బలం వస్తది. రెండో విషయం ఏంటంటే.. చట్టసభల్లో మహిళా ప్రతినిధులు ఎక్కువగా ఉంటే మహిళల సమస్యల మీద ఇంకా ఎక్కువగా మాట్లాడ్డంతోపాటు దేశ సమస్యల మీదా నిర్ణయాలలో మహిళలు పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. అన్ని అంశాల్లో స్థిరత్వం ఉంటుంది.

పాలనకు మహిళాముఖం వస్తుంది. థర్డ్ థింగ్.. పార్లమెంట్‌లో చట్ట సవరణ చేస్తేనే మహిళలందరూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకోవడం కూడా తప్పే. ఈ సవరణ వల్ల నియోజకవర్గాలు రిజర్వ్ అయి అప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువుల్లోంచి మహిళలు వస్తారు. అయితే ఒకటి రెండు తరాల తర్వాత సాధారణ మహిళలూ వస్తారేమో కానీ, దానికన్నా ముందు రాజకీయ పార్టీలకు సిన్సియారిటీ ఉండాలి. ఈ పార్టీలే 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ అలా చేయరు. ఎందుకంటే పురుషాధిక్యం. ఇందులో ఏ పార్టీకీ మినహాయింపు లేదు. టీఆర్‌ఎస్ సహా.

‘టీవీలో చెప్పినవ్ కదా... చెయ్’ అంటుంది
ఇంట్లో అమ్మానాన్నా, అన్నయ్య, నేను కలిస్తే పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటాం. మా అమ్మ మంచి క్రిటిక్.  ‘అమ్మే మన కుటుంబానికి బలం’ అంటారు నాన్న. నిజంగా అమ్మ చాలా స్ట్రాంగ్.  మా బాధ్యతలు తీరకముందే నాన్న ఉన్న పదవులన్నీ వదులుకొని పార్టీ పెడ్తానంటే ‘మీరు మొండివారు.. అనుకుంటే చేస్తారు.. చేయండి’ అని ఎంకరేజ్ చేసింది. ఇచ్చిన మాటకు జవాబుదారిగా ఉండాలనుకుంటుంది. మేమెప్పుడైనా టీవీల్లో ఏదైనా చెప్తూ కనపడితే.. ‘అప్పుడు  టీవీలో చెప్పినవ్ కదా.. చెయ్’ అని ప్రశ్నిస్తుంది. ‘చేయలేకపోతే చెప్పొద్దు కదా.. చెప్పినప్పుడు చేయాలి’ అంటుంది. అటు మా అత్తగారు (నవలత) కూడా అంతే. చాలా సపోర్ట్ చేస్తారు. నా భర్తకంటే కూడా. 
- సరస్వతి రమ

Advertisement

తప్పక చదవండి

Advertisement