కొండలెక్కే చిన్నోడు

11 Sep, 2019 12:22 IST|Sakshi
కిలిమంజారో పర్వతంపై అఖిల్‌ ,రవీందర్, కోమల తల్లిదండ్రులు

కృషి ఉంటే ఎంతటి ఎత్తులకైనా చేరుకోవచ్చని రుజువు చేస్తున్నాడు రాసమల్ల అఖిల్‌. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా మంచు పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించాడు. హన్మకొండలోని నయింనగర్‌కు చెందిన రాసమల్ల రవీందర్, కోమల కుమారుడు అఖిల్‌. పదిహేనేళ్ల క్రితం వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి నుంచి బతుకుదెరువు కోసం హన్మకొండకు వచ్చారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి రవీందర్‌ ఆటో నడుపుతూ, తల్లి కోమల వసతి గృహంలో పని చేçస్తూ జీవనం సాగిస్తున్నారు. పదోతరగతి తర్వాత సివిల్‌ డిప్లొమా పూర్తి చేసిన అఖిల్‌ పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదువుకోలేకపోయాడు. కానీ తన ఉన్నత ఆశయాన్ని మాత్రం వదులు కోలేదు. జీవితంలో గొప్ప పేరు సంపాదించాలంటే ఏదైనా సాధించాలనే తపనతో అఖిల్‌ చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఖాళీ సమయాల్లో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండేవాడు. హన్మకొండలో నిర్వహించిన 10కె, 5కె రన్‌లో అఖిల్‌ పాల్గొన్నాడు. ఈ పోటీలలో ఫస్ట్‌ వచ్చాడు.

ఆరు నెలల శిక్షణ
యాదాద్రి జిల్లా భువనగిరిలో పర్వతాలు ఎక్కడంపై శిక్షణ తీసుకున్నాడు. యాదాద్రి జిల్లా భువనగిరి గుట్ట, జయశంకర్‌ భుపాలపల్లి జిల్లా పాండవుల గుట్టలను ట్రెక్కింగ్‌ విజయవంతంగా పూర్తి చేశాడు. అలాగే దీనిపై 6 నెలల పాటు భువనగిరిలో శిక్షణ తీసుకున్నాడు. పట్టుదలతో ముందుకు సాగి ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చు అని నిరూపించాడు. కుర్రాడి ప్రతిభను చూసి దక్షిణాఫ్రికాలో కిలిమంజారో పర్వతం ఎక్కే అవకాశం అఖిల్‌కు వచ్చింది.

మూడు పర్వతాలు
దక్షణాఫ్రికా ఈశాన్య టాంజానియాలోని కిలిమంజారో పర్వతం 5895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఫిబ్రవరి 19, 2019న ప్రారంభమై 7 రోజుల్లో మైనస్‌ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు అఖిల్‌.
ఉత్తరాఖండ్‌లోని పంగర్‌ చూల్లా అనే పర్వతం 5100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని అఖిల్‌ జూన్‌ 19, 2019న ఏడు రోజుల్లో అధిరోహించాడు. లడక్‌లోని స్టాక్‌కాంగ్రి అనే పర్వతం 6153 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని  ఆగష్టు10, 2019న ప్రారంభమై 12 రోజుల్లో అధిరోహించాడు. ఆగష్టు 15న పర్వతం పైన 125 మీటర్ల జాతీయ జెండాను ఎగురవేశారు. రాతితో డిజైన్‌ చేసిన కాకతీయ కళాతోరణాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ బహూకరించారు. దానిని స్టాక్‌కాంగ్రి పర్వతం పైన పెట్టి వచ్చాడు అఖిల్‌.

గిన్నిస్‌ బుక్‌
లడక్‌లోని స్టాక్‌కాంగ్రి 6153 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం పైన 125 మీటర్ల జాతీయ జెండాను ఆగష్టు 15న ఎగరవేశారు. 125 మీటర్ల జాతీయ జెండాను అంత ఎతై ్తన పర్వతం పై ఎగురవేయడం ఇదే తొలిసారి కావడంతో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు లభిస్తుందని ఎదురుచూస్తున్నాడు అఖిల్‌.– గజవెల్లి షణ్ముఖరాజు,సాక్షి వరంగల్‌ రూరల్‌

నన్ను నేను మర్చిపోయాను
కిలిమంజారో పర్వతం ఎక్కిన తరువాత     ఆ పరిసరాలను చూసి నన్ను నేను మర్చిపోయాను. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఒక పేద కుటుంబంలో పుట్టి ఇక్కడకు వరకు చేరుకున్నాను అని గర్వంగా అనిపించింది. ఎవరెస్ట్‌ను అధిరోహించాలనే కల తీరేందుకు శ్రమిస్తున్నా. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటాను. పేదరికం నా సంకల్పానికి అడ్డుగా నిలిచినప్పటికీ  నాతల్లితండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటున్నా.  – రాసమల్ల అఖిల్‌

పేదరికం అడ్డుకాకూడదని
ప్రపంచంలో ఎతై ్తన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించేందుకు దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉండేందుకు అప్పు తీసుకు వచ్చి మరీ మా అబ్బాయిని పంపించాం. విజయవంతంగా పూర్తి చేశాడు. కిలిమంజారోతో పాటు మరో రెండు ఎల్తైన పర్వతాలు అధిరోహించాడు. చిన్నతనం నుంచి కష్టపడే స్వభావం ఎక్కువ. గొప్పగా పేరు తెచ్చుకోవాలని వాడి అభిలాష. పేదరికం వాడి ఆశలకు అడ్డుకాకూడదని మేం చేసిన ప్రయత్నం ఫలించింది.– రవీందర్, కోమల తల్లిదండ్రులు

మరిన్ని వార్తలు