ఎండు గడ్డి.. పచ్చిగడ్డి | Sakshi
Sakshi News home page

ఎండు గడ్డి.. పచ్చిగడ్డి

Published Sun, Jun 3 2018 11:49 PM

King and  punishment - Sakshi

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను తన రాజ్యంలోని కొంతమంది మేకల కాపరులను పిలిచి, ‘‘మీ మేకలు పచ్చిగడ్డి తింటాయా.. ఎండుగడ్డి తింటాయా..?’’ అని ప్రశ్నించాడు.
‘‘అయ్యా..! మేకలు పచ్చిరొట్ట మాత్రమే తింటాయి. ఎండుగడి ్డతినవు’’ అని సమాధానం చెప్పారు వారు. అప్పుడు రాజు, మేకలను పచ్చిగడ్డి కాకుండా ఎండుగడ్డి మాత్రమే తినగలిగేలా చేస్తే మీకు మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు.

బహుమతి అనగానే అందరికీ ఆశపుట్టుకొచ్చింది.‘‘ప్రభూ.. మాకు నెలరోజుల గడువునివ్వండి. ఈ నెలరోజుల్లో మేము మేకలకు ఎండుగడ్డి తినిపించే ప్రయత్నం చేస్తాము’’ అని అడిగారు. దానికి రాజు సరేనన్నాడు. ఇక ఆ రోజు నుండి కాపరులందరూ తమ మేకలను బయటికి వదలకుండా, నిర్బంధించి ఎండుగడ్డి వేయడం ప్రారంభించారు. ఒకటి రెండు రోజులు మేకలు ఎండుగడ్డి ముట్టకుండా మొరాయించాయి. కాని ఆకలికి తాళలేక మూడోరోజునుండి ఎంగిలి పడడం ప్రారంభించాయి. మెల్లగా అవి ఎండుగడ్డికి అలవాటు పడిపోయాయి.

నెలరోజుల తరువాత కాపరులంతా తమ తమ మేకలతో సహా రాజదర్బారుకు హాజరయ్యారు. రాజు సమక్షంలో అందరూ మేకలకు ఎండుగడ్డివేశారు. అవి వెంటనే తినేశాయి. తరువాత రాజు పచ్చిరొట్ట తెప్పించి వాటిముందు వేయించాడు. ఆవురావురుమంటూ అవి పచ్చిరొట్టంతా లాగించాయి. కాని అందులో ఒకమేక మాత్రం పచ్చిరొట్టను కనీసం వాసన కూడా చూడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆ మేకల కాపరిని పిలిచి, ‘‘ఏమిటీ.. నీ మేక పచ్చిరొట్ట తినడంలేదు, అలా ఎలా తర్ఫీదు ఇవ్వగలిగావు?’’ అని ప్రశ్నించాడు.


దానికా కాపరి, ‘‘రాజా.. నేను దాని ముందు పచ్చిరొట్ట వేసి బెత్తం పట్టుకొని కూర్చునేవాడిని. అది రొట్ట తిందామనుకున్న ప్రతిసారీ దానిమూతిపై కొట్టేవాడిని. తరువాత ఎండుగడ్డి వేసేవాడిని. అది దాన్ని కూడా తినాలని ప్రయత్నించేది. కాని నేను ఏమీ అనేవాడిని కాదు. జంకుతూ, జంకుతూనే అది ఎండుగట్టి తినడం ప్రారంభించింది. పచ్చిగడ్డి తింటే దానికి దెబ్బలు పడేవి. ఈ విధంగా అది ఎండుగడ్డికి అలవాటు పడిపోయింది’’ అని వివరించాడు.

మాట ప్రకారం రాజు ఆ కాపరికి గొప్ప బహుమతినిచ్చి సత్కరించాడు. అంటే, పచ్చిగడ్డి తింటే శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం మేకను ఎండుగడ్డికి అలవాటు చేసింది. అలాగే  తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం మనిషిలో ఉంటే దుర్గుణాలు గణనీయంగా తగ్గిపోతాయనే కదా, ఈ ఆరాధనలు. ఉపవాసాలు.

– మదీహా అర్జుమంద్‌

Advertisement
Advertisement