ప్రాణం తీసిన ముద్దు! | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ముద్దు!

Published Mon, Sep 14 2015 11:12 PM

ప్రాణం తీసిన ముద్దు!

విధివిలాపం
 
ఎంతో ఆరోగ్యంగా పుట్టిన బిడ్డ 24 రోజులకే కన్ను మూస్తే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించగలమా? ఈ విషాద ఉదంతం ఓ ఆస్ట్రేలియన్ దంపతులది. డెలివరీ డేట్ వచ్చినా ఇంకా నొప్పులు రాకపోవడంతో తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసీ 28 ఏళ్ల సరా పగ్ సిజేరియన్ చేయించుకొని మరీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.  భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ పాపకు ఎల్లాయిస్ లాంప్టన్ అని పేరు పెట్టారు. తమకు గారాల పట్టి పుట్టిందని క్వీన్స్‌లాండ్ సిటీలో అందరికీ చెప్పడం కోసం పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు ఆ పసికందు తండ్రి డగ్లస్ లాంప్టన్. అదే తాను చేసిన పెద్ద పొరపాటని తర్వాత తెలుసుకున్నాడు.

 పార్టీకి వచ్చిన ఎంతోమంది పసిబిడ్డను చూసి మురిసిపోయారు. ముద్దుల మీద ముద్దులు పెట్టారు. లాంప్టన్ దంపతులకు పూల బొకేలు ఇచ్చి విషెస్ చెప్పి డిన్నర్ చేసి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి పాప పాలు తాగడం మానేసింది. అలా రోజురోజుకు బరువు తగ్గడం మొదలైంది. ఓరోజు పాప మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉండడం గమనించిన పగ్ ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. కంగారు పడిన తండ్రి వెంటనే బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గంటలో పాపను పరీక్షించి రిపోర్టును తీసుకొచ్చింది నర్సు. పాపకు ఏదో వైరస్ సోకిందని, పరిస్థితి విషమంగా మారిందని చెప్పిన డాక్టర్ల మాటతో పాప తల్లి పగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

 ‘‘మీ పాపను జలుబుతో ఉన్న వారెవరో ముద్దు పెట్టుకున్నారు. దాంతో హెర్ప్స్ అనే వైరస్ పాప శరీరంలోకి చేరి బ్లడ్ ఇన్‌ఫెక్ట్ అయింది’’ అని చెప్పాడు డాక్టర్. ఇదంతా జరిగిన కొద్ది నిమిషాల్లోనే తల్లిదండ్రుల చేతుల్లో ఉన్న 24 రోజుల చిన్నారి శాశ్వతంగా కన్ను మూసింది. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లలో జలుబుతో ఉన్న వారెవరో పాపను ముద్దు పెట్టుకొని పెద్ద తప్పు చేశారు. వారెవరో ఆ తల్లిదండ్రులకు తెలీదు. తెలిసినా ఏం చేస్తారు? ఆ మరుసటి రోజే పాప తండ్రి డగ్లస్ ఓ ఇంగ్లిష్ టీవీని కలసి తన గోడును చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. ఇకనైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరూ చిన్న పిల్లల దగ్గరకు వెళ్లడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయకుండా ఉండేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరాడు డగ్లస్.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement