ధీమా పెంచే బ్లేడ్స్... | Sakshi
Sakshi News home page

ధీమా పెంచే బ్లేడ్స్...

Published Fri, Aug 22 2014 11:16 PM

lades said to increase ...

కష్టమొచ్చిందని చింతిస్తే కష్టాలు తీరవు... రోగమొచ్చిందని ఏడిస్తే అది నయం కాదు... అంగవైకల్యం ఉందని బాధపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదు... 39 ఏళ్ల కిందట ఓ ప్రమాదంలో మోకాలి కింది వరకు కాలు కోల్పోయి జీవితాన్ని నెట్టుకొస్తున్న బయో మెడికల్ డిజైన్ ఇంజనీర్ వాన్ ఫిలిప్స్ ఆలోచనా విధానం అంగవైకల్యం ఉన్నవారి భవిష్యత్తునే మార్చేసింది. కాలు కోల్పోయిన వాళ్లు తిరిగి మామూలు మనిషిలా నడవడంతో పాటు... క్రీడల్లోనూ పాల్గొనేందుకు వీలుగా ఆయన కార్బన్ ఫైబర్ బ్లేడ్లను తయారు చేశాడు.
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు
 
ఆస్కార్ పిస్టోరియస్.. 28 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా అథ్లెట్ బ్లేడ్ రన్నర్‌గా అందరికీ సుపరిచితమే. ఫిబ్యులర్ హెమిమెలియా (ఒకరకమైన అంగవైకల్యం) (రెండు కాళ్లలో తేడా)తో జన్మించాడు. దీంతో పదేళ్ల వరకు జీవితాన్ని అలాగే నెట్టుకొచ్చాడు. అయితే 11 ఏళ్ల వయసులో పిస్టోరియస్ తన రెండు కాళ్లను మోకాలి కింది వరకు తీసేయించుకున్నాడు. అప్పటి నుంచి అతని గమ్యం మారింది. కారణం అతను బ్లేడ్ల సాయంతో క్రీడాకారుడిగా రాణించడమే. అయితే అవి అలాంటి ఇలాంటి కృత్రిమ కాళ్లు కావు.. చిరుతలా పరుగెత్తించే కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన బ్లేడ్లు... ఇవే పిస్టోరియస్ జీవితాన్ని మార్చేశాయి. ఆ మాటకొస్తే... అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న వాళ్లు వీటితోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు.
 
బ్లేడ్లు తయారు చేసేదిలా..

కాళ్లు కోల్పోయిన వాళ్లు.. చేతులు కోల్పోయిన వాళ్లు సాధారణంగా కృత్రిమ అవయవాలతో ఎలాగోలా జీవితాన్ని గడిపేస్తారు. అయితే తనలా ఎదుటివాళ్లు కష్టాలు అనుభవించొద్దన్న ఉద్దేశంతో... క్రీడల్లో రాణించాలనుకుంటున్న వారికోసం వాన్ ఫిలిప్స్ అనే బయో మెడికల్ డిజైన్ ఇంజనీర్ చిరుతలా పరుగెత్తే బ్లేడ్లను రూపొందించారు. వీటిని ఫ్లెక్స్-ఫూట్ చీతా అని కూడా అంటారు. ఇవి కార్బన్ ఫైబర్‌తో తయారు చేస్తారు. మామూలు కృత్రిమ కాళ్లు గట్టిదనాన్ని కలిగి ఉంటే.. కార్బన్ ఫైబర్‌తో రూపొందించిన బ్లేడ్లు గట్టిదనంతో పాటు వంగే గుణం కలిగి ఉంటాయి. స్టీల్ కన్నా ఇవి బలంగా ఉంటాయి. ఈ బ్లేడ్లు వెంట్రుక కన్నా మందంగా 80 పొరలతో తయారవుతాయి. తేలికైన బరువును కలిగి ఉంటాయి. పోటీల్లో పాల్గొన్నప్పుడు గతిశక్తి (కెనైటిక్ ఎనర్జీ)తో పాటు స్ప్రింగుల్లా కూడా పనిచేస్తాయి. ఫలితంగా వీటిని ఉపయోగించే వాళ్లు ఎవరైనా చిరుతలా పరుగెత్తే వీలుంటుంది. అందుకే అంగవైకల్యం ఉన్న క్రీడాకారులు బ్లేడ్లను ధరించి రాణిస్తున్నారు. అయితే ఈ బ్లేడ్లు అందరికీ ఒకేలా ఉండవు. అంగవైకల్యం పరిస్థితి ఆధారంగా రూపొందిస్తారు. దక్షిణాఫ్రికా అథ్లెట్ ప్రిస్టోరియస్ ధరించే బ్లేడ్లు 147 కేజీల బరువును సైతం తట్టుకుంటాయి.
 
బ్లేడ్లతో అన్ని క్రీడలు?
 
అంగవైకల్యం ఉన్న వాళ్లు కార్బన్ ఫైబర్ బ్లేడ్లు ధరించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రాణించిన సందర్భాలు బోలెడు. దక్షిణాఫ్రికా స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. చాలా మంది పారా అథ్లెట్లు బ్లేడ్ల సాయంతో పరుగు పందాల్లో రాణిస్తున్నారు. అయితే బ్లేడ్ల సాయంతో క్రీడల్లో సత్తా చాటడం కేవలం అథ్లెటిక్స్‌కే పరిమితం కాలేదు. బేస్‌బాల్, ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్, రగ్బీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్రీడల్లో అంగవైకల్యం ఉన్నవాళ్లు బ్లేడ్ల సాయంతో అదరగొడుతున్నారు.
 
బ్లేడ్లతో పాటే వివాదాలు...
 
కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన బ్లేడ్లు కాళ్లు కోల్పోయిన క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపినప్పటికీ... అదే సమయంలో ఇవి వివాదాలకూ కేంద్రబిందువులయ్యాయి. స్ప్రింగుల్లా ఉండే బ్లేడ్ల వల్ల అంగవైకల్య క్రీడాకారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదాలకు పిస్టోరియసే కారణమయ్యాడు. 2007లో అతను శారీరక వైకల్యం లేని అథ్లెట్లతో పోటీపడేందుకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) అనుమతినిచ్చింది. బ్లేడ్లతో అంగవైకల్య అథ్లెట్లకు పోటీల్లో ప్రయోజనం కలుగుతుందని భావించిన ఐఏఎఫ్ మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. స్ప్రింగ్‌లు, చక్రాలతో పాటు అథ్లెట్లకు అనుకూలంగా ఉండే సాధనాలను పోటీల్లో వాడకూడదని నిర్ణయించింది. అయితే బ్లేడ్ల ద్వారా అంగవైకల్యం ఉన్న వారికి అదనపు అనుకూలత కలిగే అవకాశాలు లేవని పరిశోధనలో తేలడంతో పిస్టోరియస్ మళ్లీ సాధారణ అథ్లెట్లతో పోటీపడే అవకాశం దక్కింది. రెండేళ్ల కిందట లండన్‌లో జరిగిన ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో బ్లేడ్లతో పోటీల్లో పాల్గొనే అర్హత సాధించాడు.
 
వీటి సాయంతో పోటీల్లో పాల్గొంటున్న పిస్టోరియస్ 2012 పారా ఒలింపిక్స్ సందర్భంగా వివాదానికి తెరలేపాడు. టీ 44 విభాగం 200 మీటర్ల పరుగులో తిరుగులేని పిస్టోరియస్‌ను బ్రెజిల్‌కు చెందిన ఒలివెరా వెనక్కి నెట్టి బంగారు పతకం సాధించాడు. అయితే ఒలివెరా ఉపయోగించిన బ్లేడ్లు తనకన్నా పొడవుగా ఉన్నాయని.. అందుకే అతను విజేతగా నిలిచాడని వ్యాఖ్యానించి దుమారం రేపాడు. కానీ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు.
 
ఖరీదైనవే !
 
అంగవైకల్య క్రీడాకారులు ధరించే కార్బన్ ఫైబర్ బ్లేడ్లు ఖరీదైనవే. వీటి కనీస ధర లక్ష రూపాయల పైమాటే. సాధారణంగా అథ్లెట్లు ఒస్సుర్ కంపెనీ తయారు చేసిన బ్లేడ్లను ఉపయోగిస్తారు. ప్రధానంగా ఇవి నాలుగు రకాలు. చీతా ఎక్స్‌టెండ్, చీతా ఎక్స్‌ట్రీమ్, ఫ్లెక్స్ రన్, ఫ్లెక్స్ ఫూట్ చీతా.. అథ్లెట్లు పాల్గొనే క్రీడాంశాల ఆధారంగా నాలుగు రకాల బ్లేడ్లను ధరించి పోటీల్లో పాల్గొంటారు.
 
భవిష్యత్తుపై ధీమా

కాళ్లు కోల్పోయినా.. కార్బన్ ఫైబర్ బ్లేడ్లతో అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన, రాణిస్తున్న వాళ్లు కోకొల్లలు.. తమకు అంగవైకల్యం ఉందని ఏ మాత్రం బాధపడకుండా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకునే వాళ్లకు ఈ బ్లేడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అందుకే అంగవైకల్య క్రీడాకారులకు ఇవి ఎంతగానో ధీమా కల్పిస్తున్నాయి.
 
ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ సారా
 
సారా రీనర్ట్‌సెన్.. అమెరికా ట్రయాథ్లాన్ క్రీడాకారిణి... అత్యంత క్లిష్టమైన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌లో పాల్గొన్న తొలి మహిళా అంగవైకల్య క్రీడాకారిణి. బ్లేడ్ సాయంతోనే ఆమె ఈ పోటీలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. పుట్టుకతోనే రెండు కాళ్ల మధ్య తేడా ఉండటంతో సారా ఏడేళ్ల వయసులో తన ఎడమకాలిని తీయించేసుకుంది. 12 ఏళ్ల వయసులో ఫ్లెక్స్ ఫూట్ (కార్బన్ ఫైబర్ బ్లేడ్) ధరించడంతో ఆమె జాతకమే మారిపోయింది. వీటి సాయంతోనే ట్రయాథ్లాన్‌లో రాణించింది. వీటిని వేసుకుని పోటీల్లో పాల్గొన్నప్పుడు సారాకు మేఘాల్లో తేలిపోయినట్లుగా ఉండేదట.
 
వాన్ ఫిలిప్స్.. ది గాడ్
 
కార్బన్ ఫైబర్ కాళ్ల (బ్లేడ్ల) సృష్టికర్త అమెరికాకు చెందిన వాన్ ఫిలిప్స్.. అంగవైకల్య క్రీడాకారులకు అతనో దేవుడు. ప్రస్తుతం ఆరు పదుల వయసు దాటిన ఫిలిప్స్.. తాను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాటర్ స్కీయింగ్ ప్రమాదంలో కాలును కోల్పోయారు. రబ్బరు కాళ్లతో నడవడం మొదలుపెట్టిన ఫిలిప్స్ వీటి వల్ల కలిగే ఇబ్బందులను స్వయంగా గమనించారు. వీటిని అధిగమించాలన్న ఆయన ఆలోచన కార్బన్ ఫైబర్ బ్లేడ్ల తయారీకి బీజం పడేలా చేసింది. ఉతా యూనివర్సిటీలో బయో మెడికల్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసిన ఫిలిప్స్... అంగవైకల్యం ఉన్న వారి కోసం కార్బన్ ఫైబర్ బ్లేడ్లను రూపొందించారు. ఇంగ్లిష్ అక్షరం ‘సి’ ఆకారంలో తయారు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించారు. ఆరంభంలో కార్బన్ ఫైబర్ బ్లేడ్లు విఫలమయ్యాయి. అయినా పట్టు వీడలేదు. వాటిపై ప్రయోగాలు కొనసాగించి చివరికి విజయవంతమయ్యారు. ఈ ప్రయత్నంలో రెండేళ్లలో తను తయారుచేసిన 100 బ్లేడ్లు విరిగిపోయాయి. చివరికి 1984 నుంచి ఫ్లెక్స్ ఫూట్ కంపెనీ పేరుతో ఫిలిప్స్ బ్లేడ్ల అమ్మకం మొదలుపెట్టారు. అయితే 2000లో వీటి హక్కులను ఒస్సుర్ అనే సంస్థకు అమ్మేశారు. గత 14 ఏళ్లుగా ఇప్పుడు ఈ కంపెనీ బ్రాండ్‌పైనే బ్లేడ్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంస్థ ఇప్పుడు కాళ్లు కోల్పోయిన క్రీడాకారులకు అండగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement