కావ్యా టీచర్...మా బడికి రండి | Sakshi
Sakshi News home page

కావ్యా టీచర్...మా బడికి రండి

Published Mon, Aug 12 2013 10:56 PM

కావ్యా టీచర్...మా బడికి రండి - Sakshi

డెబ్బై ఐదేళ్ల క్రితం...
 యుద్ధంలో ధ్వంసమైన స్పెయిన్ గ్రామం ‘గెర్నికా’!
 నేటికీ అది అక్కడే ఉంది కానీ...
 గెర్నికా అంటే ప్రపంచానికిప్పుడు గ్రామం కాదు,  పికాసో పెయింటింగ్!
 బ్లాక్ అండ్ వైట్‌లో రుధిర శిథిలాలను చిత్రించి...
 గెర్నికా జ్ఞాపకాలను ఆనాడు సజీవం చేశారు పికాసో.
 నేడు కావ్య కూడా అలాంటి పనిలోనే ఉన్నారు!
 పెచ్చులూడిపోతున్న బడి గోడలను శుభ్రం చేసి,  చక్కటి క్యాన్వాస్‌గా మార్చి...
 పిల్లల సిలబస్‌ను బొమ్మలు బొమ్మలుగా గీస్తున్నారు.
 గవర్నమెంటు చదువుల్ని వర్ణమయం చేస్తున్నారు!
 పైచదువుల కోసం లండన్ వెళ్లవలసి ఉన్న అమ్మాయి  ఆఖరి నిమిషంలో...
 ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్లు?!
 ప్రతి స్కూలూ ఆమెను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు?
 ఇదే ఈవారం మన ‘జనహితం’.

 
 సేవ చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎలాంటి సేవ చేయాలి? ఏ వయసులో చేయాలనే ఆలోచనలు రావడానికే ఓ యాభైఏళ్ల వయసుదాటాలి. అలాంటిది... చదువుకునే వయసులోనే... సేవ అనే పదానికి తనకున్న కళను జోడించి పేద విద్యార్థుల పాలిట పెన్నిధి అయ్యింది ఈ యువకళాకారిణి. ఎంతో పేరు సంపాదించిన కళాకారులే సమాజం వైపు తొంగిచూడ్డానికి ఓ నిమిషం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో చిన్నవయసులోనే తన కళను పదిమందికీ ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న ఈ సామాజిక కళాకారిణి పేరు కావ్య చైనం. పాఠశాల గోడలనే  గ్యాలరీ షోగా మార్చేస్తున్న కావ్య మనోభావాలివి.
 
 కాలేజి రోజుల్లో....


 ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ‘స్టేట్ కన్జ్యూమర్ క్లబ్’కి కన్వీనర్‌గా పనిచేశాను. ఆ సమయంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పాఠాలు చెప్పేదాన్ని. అరకొరవసతులు, అంతంత మాత్రం చదువులు, ఇరుకు గదులు... నా మనసుని చాలా బాధపెట్టాయి. వారికి ఉచితంగా పాఠాలు చెప్పడం తప్ప ఏమీ చేయలేని వయసు నాది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పైచదువుల కోసం లండన్ వెళ్లే అవకాశం వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విరమించుకున్నాను. కారణం... నా మనసునిండా బోలెడు ఆలోచనలు, చిన్న చిన్న ఆశయాలు... అన్నీ కలిసి నన్ను నాకు నచ్చిన కుంచె వైపే నడిపించాయి’’ అంటూ పరిచయం చేసుకున్న కావ్యను నిలబెట్టింది తాను అభిమానించిన చిత్రలేఖనమే.
 
 చిన్ని వయసు నుంచే...


 చదివింది ఇంజజినీరింగ్ అయినా కావ్య తనను తాను చాలా రంగాల్లో పరీక్షించుకుంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, రేడియో జాకీ, టెలీఫిల్మ్స్... అంటూ తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని కొన్నాళ్లు చేసి చూసింది. ఏదైనా చేయడానికి బాగానే ఉంది కాని తన మనసుకి నచ్చడం లేదు. ఆ సమయంలో ఆమె మనసుకు తట్టిన ఆలోచనకు రూపమే ‘స్లీపింగ్ బహుదూర్’. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి నేర్చుకున్న చిత్రలేఖనం నలుగురికీ ఉపయోగపడాలన్న ఆలోచనతో ఆ సంస్థని స్థాపించింది. మొదట్లో టీషర్టులపై బొమ్మలు వేయడం, లైఫ్‌స్టయిల్ ప్రాడెక్ట్స్ తయారుచేయడం ఆ సంస్థ పనులు. కొన్నాళ్ల తర్వాత ఆ సంస్థని సేవాసంస్థగా మార్చాలనుకుంది. అందులో భాగంగానే తాను చదువుకున్న రోజుల్లో సందర్శించిన ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టింది. పదేళ్లకొకసారి కూడా సున్నం వేయని ప్రభుత్వ పాఠశాల గోడలపైకి కావ్య మనసు మళ్లింది. గోడలకు రంగులేయడంతోనే తన పని పూర్తికాదనుకుంది. తన చిత్రలేఖనంతో అక్కడి పేదవిద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంది. ఆ దిశగా కావ్య వేసిన అడుగులు నాలుగు పాఠశాలలు దాటాయి.
 
 సైన్స్ బొమ్మలు, ప్రపంచ మ్యాప్‌లు...


 ‘‘శిథిలమైనట్టు ఉన్న గోడల మధ్య పాఠాలు నేర్చుకునే పిల్లలకు ఆ గోడల ద్వారానే పాఠాలు నేర్పాలనుకున్నాను. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకూ ఉన్న పాఠ్యపుస్తకాలను చదివాను. ఏ క్లాస్‌లో ఏ బొమ్మలు అవసరమో ఒక నోట్స్ తయారుచేసుకున్నాను. మొదట ఒక స్కూల్‌కి వెళ్లి అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడాను. ఒకటి రెండు తరగతులకు ఒకటే గది ఉన్న స్కూళ్లలో నాలుగు గోడలను రెండుగా విభజించి ఒక గోడపై పండ్ల బొమ్మలు, మిక్కీమౌస్‌లు వేస్తే మరో రెండు గోడలపై మనిషి బొమ్మ వేసి కన్ను, ముక్కు అంటూ ఇంగ్లీష్‌లో పేర్లు రాశాను. పెద్ద క్లాసులకి వెళ్లేసరికి మూత్రపిండాలు, గుండె బొమ్మ ఒక క్లాస్‌లో, సౌరకుటుంబం, రాకెట్లని మరో గదిలో వేశాను’’ అని కావ్య చెబుతున్న మాటలకంటే ఆమె కళతో తీర్చిదిద్దిన తరగతి గోడలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
 
 ఎడమచేతివాటం...


 ఎడమచేతి వాటంగల కావ్య బడిగోడల రూపాన్ని ఆ ఒంటిచేత్తోనే మార్చేస్తుంది. పేరుకే సంస్థ కాని అందులో అన్ని పనులు ఈ కళాకారిణే చేస్తుంది ‘‘నాకు సహకరించడానికి ఓ ఐదుగురు వాలంటీర్లు ఉన్నా... పనులన్నీ నేను చేసుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు పనిచేశాను. పొద్దునే ఏడుగంటలకల్లా స్కూలుకి వెళ్లిపోతాను. సాయంత్రం ఆరింటికి బయటికి వస్తాను. వైట్‌వాష్ మొదలు చిత్రాల వరకూ అన్నీ ఒక్కదాన్నే వేసుకుంటాను. ఈ ప్రయాణంలో చాలామంది తెలిసినవారు సాయపడతామని ముందుకు వచ్చారు కాని ఈ పాఠశాలల్లో సౌకర్యాలను చూసి తమవల్లకాదన్నారు. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రం నన్ను చాలా అభిమానంగా చూసుకునేవారు. పద్మారావునగర్ దగ్గర మైలార్‌రెడ్డి ప్రభుత్వపాఠశాల ప్రిన్సిపల్ అయితే నేను పెయింటింగ్ వేసిన గదులన్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యారో.. ‘ మా పాఠశాల గోడలకు రంగులేస్తారని కలలో కూడా అనుకోలేదు. నేను రిటైర్ అయిపోయేలోగా...కనీసం తెల్లసున్నం అయినా వేస్తే బాగుండును అనుకున్నాను. అలాంటిది ఇంత ఖరీదైన రంగులతో పాటు పిల్లలకు ఉపయోగపడే బొమ్మలు కూడా గీసినందుకు థ్యాంక్సమ్మా’ అన్నారు. ఆసమయంలో నేను చాలా సంతోపడ్డాను’’ అంటూ తన ప్రయాణంలోని మధురస్మృతులని గుర్తుచేసుకుంది కావ్య.
 
 పిల్లలకు నేర్పిస్తూ...


 జవహర్‌నగర్, మైలార్‌రెడ్డి, బ్రాహ్మణబస్తీ పాఠశాలలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల పాఠశాలలోని గ్రంథాలయాలకు కూడా కావ్య పెయింటింగ్స్ వేసింది. బడి గోడలపై చిత్రలేఖనంతో పాటు ఈ యువకళాకారిణి మరో సేవాకార్యక్రమం కూడా మొదలుపెట్టింది. ప్రభుత్వపాఠశాలలో ప్రైమరీ తరగతుల విద్యార్థులకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పుతోంది. దీనికోసం ‘స్లీపింగ్ బహదూర్’ సంస్థ తరపున పిల్లలకు పెయింటింగ్ కిట్‌లు, పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తోంది. ఒక్కో స్కూల్లో ఒక్కో వారం క్లాసులు చెబుతోంది. జవహర్‌నగర్ స్కూల్లో ప్రతి గురువారం కావ్య చెప్పే పెయింటింగ్ క్లాసులకి ఒక్క విద్యార్థి కూడా డుమ్మా కొట్టరంటారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ శివకుమార్. ‘‘నేను ఒక రకం బొమ్మ గీసి చూపిస్తే...వాళ్లు రకరకాల ప్రయోగాలు చేసి నన్నే అబ్బురపరుస్తుంటారు. నేను కనిపించగానే అక్కా...అక్కా అంటూ నన్ను చుట్టుముట్టేస్తారు. క్లాస్ ముగియగానే వారందరికీ చాక్లెట్లు ఇచ్చి ఇంటికొస్తాను’’ అని చెప్పే కావ్య మాటల్లో చాలా సంతృప్తి కనిపించింది.
 
 నిజమే! గ్యాలరీ షోల్లో పెట్టాల్సిన బొమ్మల్ని ప్రభుత్వ స్కూలు గోడలపై ప్రదర్శించి అక్కడి విద్యార్థుల మనసుదోచుకున్న ఈ కళాకారిణిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ప్రముఖ లాయర్, నటులు సి. నరసింహారావు, ప్రముఖ అడ్వకేట్ అనురాధ కావ్య తల్లిదండ్రులు. బిడ్డ భవిష్యత్తుకి పునాదులు పడాల్సిన వయసులో కూతురు ఎంచుకున్న సేవాకార్యక్రమాలు వారి మనసుని కూడా కదిలించాయి. కావ్య పెయింటింగ్‌లు వేసిన పాఠశాలలను చూసిన మిగతా ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాల గదుల రూపురేఖలు మార్చమంటూ అడుగుతున్నారు. ఎన్ని పాఠశాలలకైనా రంగులద్దడానికి తన ఎడమచేయి సై అంటోందని నవ్వుతూ చెబుతున్న కావ్యకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.
 
 - జాయ్
 

Advertisement
Advertisement