జీవితమంటే నిన్న, రేపు కాదు... నేడే! | Sakshi
Sakshi News home page

జీవితమంటే నిన్న, రేపు కాదు... నేడే!

Published Sat, Oct 12 2013 11:59 PM

జీవితమంటే నిన్న, రేపు కాదు... నేడే!

 ముందెంతో జీవితముందన్న భరోసాతో రోజులు వెళ్లబుచ్చడం ఎండమావిలో నీళ్లు వెదకడమే! మనకున్న జీవితమల్లా ఈరోజు ఒక్కటేనన్నది కఠోర వాస్తవం. దీన్ని ఎంత ఫలభరితంగా, దేవునికి ఆమోదయోగ్యంగా జీవిస్తామన్నదే అత్యంత ప్రధానమైన అంశం. జీవితంలో భయాలు, చింతలు అందరికీ ఎప్పుడూ ఉండేవే! వాటికి కృంగకుండా, వాటికన్నా ప్రాముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయని గ్రహించి ముందుకు సాగాలి. మహా సముద్రాల అంతు చూడాలనుకుంటే ముందు మన దృష్టి తీరం మీదినుండి వైదొలగాలి కదా!
 
 భౌతికశాస్త్ర పితామహుడు సర్ ఐజక్ న్యూటన్ గదిలో వేలాది పుస్తకాలు, ఆయన రాసిన పరిశోధన వ్యాసాలు కాగితాలు గుట్టలుగా పడి ఉండేవట. అక్కడే కొవ్వొత్తి, పెంపుడు కుక్కపిల్లా ఉండేవి. ఒకరోజు కుక్కపిల్ల కాలు తగిలి వెలిగే కొవ్వొత్తి కాగితాల మీద పడి అవి నిప్పంటుకున్నాయి. ఎన్నో ఏళ్ల ఆయన పరిశోధనంతా నిమిషాల్లో బూడిదయింది. బాగా కృంగిపోయిన న్యూటన్ చాలా కాలం తర్వాత తన పరిశోధనంతా కొత్తగా ఆరంభించాడు. అలా కొత్తగా ఆలోచించడమే తనకు ఖ్యాతినిచ్చిన గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొనడానికి తోడ్పడిందని ఆయన ఒకచోట రాసుకున్నాడు.
 
 జీవితం వృథా అయిపోయిందని వాపోయేవాళ్లకు మోషే జీవితం ప్రేరణనిస్తుంది. మోషే 120 ఏళ్లు బతికాడు. మొదటి 40 ఏళ్లూ ఫరో రాకుమారుడిగా గమ్యం లేకుండా బతికాడు. పిదన తాను నిజానికి హెబ్రీయుణ్ణని తెలుసుకుని, ఇశ్రాయేలీయులపైన పెత్తనం చేయబోయి భంగపడి ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి అక్కడ 40 ఏళ్ల మర దలు కాస్తూ బతికాడు. ఆయన ఇక అంతటితో చనిపోవాలి. ఎందుకంటే నరుని ఆయువు మహా అయితే 80 ఏళ్లని ఆయన తను రాసిన ఒక కీర్తనలో పేర్కొన్నాడు (90:10). కాని దేవుడు అతని అంచనాలు తారుమారు చేస్తూ 80 ఏళ్ల వయసులో మండే పొద ద్వారా మాట్లాడి సేవకు పిలచుకున్నాడు. అలా మోషే ఐగుప్తునకు వెళ్లి ఇశ్రాయేలీయులను దాస్యం నుండి విడిపించి మరో 40 ఏళ్లపాటు వారిని అరణ్యంలో నడిపించి వాగ్దాన దేశమైన కనానుకు చేర్చాడు (నిర్గమ 3:1-22). అలా 80 ఏళ్ల నిష్పల జీవితం తర్వాత ఉత్తేజ భరితమైన, అర్థవంతమైన 40 ఏళ్లను దేవుడాయనకిచ్చాడు.
 
 చేజారిన అవకాశాలను తలంచుతూ నిర్వీర్యంగా బతకడం కాదు, ఆ పాఠాలే పునాదిగా ఫలభరితమైన జీవితాన్ని విశ్వాసి పునర్నిర్మించుకోవాలి. ముందెంతో జీవితముందన్న భరోసాతో రోజులు వెళ్లబుచ్చడం ఎండమావిలో నీళ్లు వెదకడమే! మనకున్న జీవితమల్లా ఈరోజు ఒక్కటేనన్నది కఠోర వాస్తవం. దీన్ని ఎంత ఫలభరితంగా, దేవునికి ఆమోదయోగ్యంగా జీవిస్తామన్నదే అత్యంత ప్రధానమైన అంశం. జీవితంలో భయాలు, చింతలు అందరికీ ఎప్పుడూ ఉండేవే! వాటికి కృంగకుండా, వాటికన్నా ప్రాముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయని గ్రహించి ముందుకు సాగాలి.

మహా సముద్రాల అంతు చూడాలనుకుంటే ముందు మన దృష్టి తీరం మీదినుండి వైదొలగాలి కదా! మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిచ్చిన కానుక. వాటితో మనం ఆయనకోసం చేయబోయే కార్యాలు, సాధించబోయే విజయాలు మనం దేవునికివ్వబోయే కానుక. చీకటిగదిలో మనకు కావాల్సిన వాటికోసం తడుములాడటం దేనికి? బల్బు వెలిగించే స్విచ్ కోసం ముందు వెదికి లైట్ వేస్తే అదెంత సులువు? అందుకే ‘మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడవన్నీ మీకు దొరుకుతాయి’ అని యేసు ప్రభువు సులువైన సూత్రం చెప్పాడు (మత్త 6:33). కష్టాల చీకట్లు కమ్మినప్పుడు జీవితంలో పరిష్కారాలు, జవాబులకోసం కాక ముందుగా దేవుని సాన్నిధ్యాన్ని వెతకాలి.

మనమెల్లప్పుడూ ధైర్యంగా, నిబ్బరంగా ఉండాలని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని విడనాడనని దేవుడు వాగ్దానం చేశాడు( ద్వితీ 31:8). దేవుని సాన్నిధ్యాన్ని, రాజ్యాన్ని కాక లోక సంబంధమైనవి ఏవేవో పొందడానికి మనం వ్యయం చేసే రోజులన్నీ వృథా కిందే లెక్క. అలా డబ్బు, బంగారం, ఆస్తులు మాత్రమే సంపాదించుకున్న వాడు కటిక పేదవాడు. దేవుని సాన్నిధ్యాన్ని పుష్కలంగా కలిగి బోలెడు మంది ఆప్తులను, స్నేహితులను సంపాదించుకున్నవాడు అవేమీ లేకున్నా మహా ధనవంతుడు. దేవుడుంటే ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే. దేవుడు లేకుంటే అన్నీ ఉన్నా జీవితంలో ఏమీ లేనట్టే!
 
 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
 
 హితవాక్యం:  ఆకాశంలో విహరించేందుకు ఆశపడేవాడు భూమి మీద పాకడానికి ఇష్టపడడు.
 - హెలెన్ కెల్లెర్

 

Advertisement
Advertisement