మాట వినడం లేదా? మీరే వినండి! | Sakshi
Sakshi News home page

మాట వినడం లేదా? మీరే వినండి!

Published Thu, Apr 9 2015 3:10 AM

మాట వినడం లేదా?  మీరే వినండి!

పేరెంటింగ్
 
తలిదండ్రులు ఒక మాట చెప్తారు. అది పిల్లలు వినిపించుకోరు. తెలిిసీ తెలియనితనంతో ఎదురు చెప్తారు. గట్టిగా మందలిస్తే మరింత మొండిగా తయారవుతారు. పిల్లలు ఎదిగే క్రమంలో ఇలా జరగడం సర్వసాధారణం. పెద్దలే ఈ విషయాన్ని అర్థం చేసుకుని కొంచెం తగ్గితే మంచిది. ముందు పిల్లలపై కోప్పడి, రాత్రంతా ఆలోచించి తర్వాత పశ్చాత్తాపపడే బదులు కోప్పడటానికి ముందు రెండు నిమిషాలు ఆలోచిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ వాళ్లు చేసే పనులకు కోపం వచ్చినా చెప్పాల్సిన విధంగా చెప్తే వాళ్లే అర్థం చేసుకుంటారు. అంతేకానీ, కోప్పడటం శ్రేయస్కరం కాదు. ఈ కాలం పేరెంటింగ్‌లో కోప్పడటం చాలా వరకు తగ్గిస్తే మంచిదని మనోవైజ్ఞానిక నిపుణులు సూచిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు పిల్లల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. నేటి ఇంటర్నెట్ యుగంలో చిన్నారుల మనసు రోజురోజుకీ సున్నితంగా మారుతోంది. పెరిగే క్రమంలో వారు చవిచూసే అనుభవాలే పెద్దయ్యాక వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుంటే వారిని మందలించే ముందు... కాస్త ఆగి, ఆలోచించాలనే స్వభావాన్ని అలవరుచుకోవచ్చు.

ఆప్షన్లు ఇవ్వండి

పిల్లలు ఎప్పటికప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. వీలు చిక్కినప్పుడల్లా మీరు అవకాశం కల్పిస్తే, అన్ని విధాల ఆ స్వేచ్ఛను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తారు. పండుగలు, పార్టీలకు వారికి నచ్చిన డ్రెస్‌లు వేసుకోమనడం, వంట చేసేముందు వారికి ఏది ఇష్టమో అడగడం వంటి పనులు చేస్తుండాలి. ఇలా చేస్తే వారి మీద వారికి మరింత ఇష్టం పెరగడంతో పాటు మీ మాటల్ని కూడా గౌరవించేందుకు ప్రయత్నిస్తారు.

మంచిని పొగడండి

 పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే పొగడటానికి సందేహించకండి. వాళ్లు ఎంతో ఆశతో మీ దగ్గరికి వచ్చి, తాము చేసిన పని గురించి చెప్పినపుడు కచ్చితంగా స్పందించండి. మీ ఒక్క చిన్న స్పందన వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే ప్రతిరోజు ‘గ్రేట్ జాబ్’, ‘థాంక్యూ’ వంటి పదాల్ని పిల్లలపై ప్రయోగించండి. దీనివల్ల వాళ్లలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. మీరెప్పుడైనా ఏదైనా చెప్తే అందులో మంచిని పిల్లలు గ్రహించేందుకు ఈ అలవాటు ఉపయోగపడుతుంది.
 
నిబంధనలు పెట్టకండి

‘నువ్వు నా మాట వినకపోతే ఈరోజు నుంచి వీడియోగేమ్స్ కట్’, ‘టీవీ కట్’ వంటి మాటలు పిల్లలతో అనడం వల్ల వారిలో నెగెటివ్ ప్రవర్తనకు మీరే బీజాలు వేసినవాళ్లవుతారు. వీటి స్థాయి పెరిగితే పూర్తిగా మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. నమ్మకం కోల్పోయినపుడు మీరు చెప్పిన మాటలు వినబుద్ధి కాదు. అయినా సరే గట్టిగా చెప్తే ఎదురుతిరగాలనిపిస్తుంది.
 
మాటపై నిలబడండి


పిల్లలు ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. నేర్చుకుంటారు కూడా. వాళ్లకు ఏదైనా కొనిస్తానని చెప్పి మర్చిపోతే మాత్రం వెంటనే క్షమాపణ అడగండి. లేదంటే మీ మాటపై వారికి గౌరవం తగ్గుతుంది.
 
గొడవ పడకండి


పిల్లలు ఇంట్లో ఉన్నపుడు తలిదండ్రులు గొడవ పడటం అనేది వారి బంగారు భవిష్యత్తును చాలా ప్రతికూల మలుపులు తిప్పుతుంది. ఇద్దరిలో ఎవరిది పైచేయి అయినా పిల్లలపై పడేది దుష్ర్పభావమే.
 
దూరంగా వెళ్లండి


 కొన్నిసార్లు పిల్లలు కావాలని మారాం చేస్తుంటారు. తాము అడిగింది ఇస్తారా లేదా అని పరీక్షించడానికి వాళ్లు ఇలా చేస్తారు. దీన్ని మీరు ముందే గ్రహిస్తే మాత్రం అక్కణ్నుంచి దూరంగా వెళ్లిపోండి. అంతేకానీ వారిపై కోప్పడకండి.
 ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాల్లో సంయమనం పాటించడం వల్ల రేపటి పౌరులను ఈరోజే తీర్చిదిద్దవచ్చు.
 - డి.ప్రగత్
 

Advertisement
Advertisement