లివింగ్ స్కిల్స్ | Sakshi
Sakshi News home page

లివింగ్ స్కిల్స్

Published Sun, May 22 2016 11:08 PM

లివింగ్ స్కిల్స్

హ్యూమర్‌ప్లస్
మనుషులకే కాదు, జంతువులకు కూడా లివింగ్ స్కిల్స్ అవసరం. ఒక పిల్లి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా అవతారమెత్తి తోటి పిల్లులకు క్లాస్ తీసుకుంది.

 
‘‘ఈ ప్రపంచం చాలా సంక్లిష్టమైంది. అది పిల్లులకే క్యాట్ కోర్స్ నేర్పిస్తుంది. వంద జంతువులు కలిస్తే ఒక మనిషి. అందుకే వాడు క్యాట్‌వాక్ నేర్చుకున్నాడు. క్యాటరింగ్ చేస్తున్నాడు. కానీ క్యాట్‌ని మరిచిపోయాడు. ఇతరులు మనల్ని మరిచిపోయినప్పుడు మనల్ని మనమే గుర్తుంచుకోవాలి. పాలు, పెరుగు ఫ్రిజ్‌లోకి వెళ్లిపోయాయి. ఎలుకలు కనపడ్డంలేదు. మరి మనం ఏం తిని బతకాలి? ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకటి తిని బతకాల్సిందే. మనుషులైతే సాటి మనిషిని తినైనా బతుకుతారు. మనం పిల్లులం. వాళ్లకి మానవత్వం లేకపోయినా, మనకు జంతువత్వం వుంది. అందుకే ఎలుకల్ని తింటాం.

 
తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. తిండిగా మారాలనే కోరిక ఎవరికీ ఉండదు. కానీ ఒకర్నొకరు తినకపోతే ఈ ప్రపంచం నడవదు. అందుకే ఎలుకల్ని కలుగుల్లోంచి బయటకి రప్పించాలి. మనం మియ్యావ్ అని అరిస్తే అవి పోరా కుయ్యా అంటాయి. అందుకే ఎలుకల్లా కిచకిచలాడ్డం ప్రాక్టీస్ చేద్దాం. తనలా కాకుండా ఇతరుల్లా నటించేవాళ్లకి విలువ ఎక్కువ. మనం ఎలుకల్లా మిమిక్రీ చేస్తూ కలుగుల వద్ద ఎలుకల్ని ఆహ్వానిద్దాం. ఆశ శ్వాసలాంటిది. అది లేకుండా ఎవరూ జీవించలేరు. తిండి దొరుకుతుందని ఎలుకలు బయటికొస్తాయి. మనకు తిండి దొరుకుతుంది’’ అని చెప్పింది. దాంతో పిల్లులు గుంపులు గుంపులుగా మిమిక్రీ ప్రాక్టీస్ చేయసాగాయి.

 
నీ దగ్గర తెలివున్నపుడు, అవతలివాడి దగ్గర గిలివి ఉంటుంది. క్యాట్‌కి, ర్యాట్‌కి ఒక అక్షరమే తేడా. వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్ని జాతుల్లోనూ ఉంటారు. కంప్యూటర్లకి మౌజ్ వున్నపుడు, మౌజ్‌ల్లో కంప్యూటర్ బ్రెయిన్ ఉండదా? ఒక చిట్టెలుక జాతినుద్దేశించి ఇలా ప్రసంగించింది.

 
‘‘ప్రపంచమే ఒక కలుగుగా మారిపోతున్నపుడు, కలుగే ప్రపంచం అనుకోవడం ఒక మూర్ఘత్వం. మిత్రులు లేకుండా జీవించొచ్చు కానీ, శత్రువు లేకుండా జీవించడం కష్టం. అందుకే దేవుడు పిల్లిని సృష్టించాడు. మనం పిల్లి జోలికెళ్లకపోయినా అది మన జోలికి వస్తుంది. అందుకే పిల్లిని తప్పించుకోవాలి లేదా ఎదుర్కోవాలి. ఎదుర్కుని జీవించలేం కాబట్టి, తప్పించుకుని జీవించాలి. పిల్లులు ఎలుకల్లా మాట్లాడుతున్నాయని గూఢచారి వర్గాల భోగట్టా. బలవంతుడు బలహీనుడిలా మాట్లాడ్డం మొదలుపెట్టాడంటే, ఎవరి కొంపకో ఎసరు పెట్టాడని అర్థం. రుద్రాక్ష మాలలు కట్టుకున్నంత మాత్రాన పిల్లి పురోహితుడిగా మారడు. తెల్లగా వెన్నెల్లా కనిపించినా అది చందమామ కాదు. పిల్లి పిల్లే. నమిలి మింగినా, కొరికి తిన్నా, మెత్తగా మింగినా పోయేది ప్రాణమే. ఈరోజుల్లో తిండి సంపాదించుకుని బతకడం ఒక సమస్య అయితే, ఇంకొకడికి తిండిగా మారకుండా జీవించడం ఇంకో సమస్య...’’

 
ఇంతలో బయటి నుంచి ‘‘ఎలుకలూ... ఓ ఎలుకలూ... చిట్టెలుకలూ, పొట్టెలుకలూ, పెద్దెలుకలూ’’ అని స్వీట్ వాయిస్ వినిపించింది. ‘‘నేను పట్నం ఎలుకని... కలుగులో వడ్లు, జొన్నలు ఎంతకాలం ఏరుకుతింటారు? బయటికి రండి బిస్కెట్లు, కేకులు, బర్గర్‌లు...’’ ‘‘ఆ జంక్‌ఫుడ్ మాకెందుకన్నా? ధాన్యంలో, ధ్యానంలో ఈ ప్రపంచముందని రాందేవ్‌బాబా చెప్పాడు. టీవీలో ఎప్పుడూ వినలేదా?’’‘‘మనసు చెప్పే మాట తప్ప, ఇతరుల మాటలు వినకూడదు. ఒకసారి బయటికి వచ్చి చూడు’’ ‘‘మీరు మా అతిధులు, మీరే లోపలికి రండి’’ ‘‘మేము దీక్షలో ఉన్నాం. అమావాస్యరోజు ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించం’’ ‘‘మేమూ దీక్షలోనే... బయటికి రావడం నిషిద్ధం’’ ఎలుకల్ని తినడానికి పిల్లులు మరో పథకం, తినకుండా ఉండడానికి ఎలుకలు ఇంకో పథకం సిద్ధం చేసుకోసాగాయి. అవి అమెరికా పిల్లులు, క్యూబా ఎలుకలు.

 - జి.ఆర్. మహర్షి

Advertisement
Advertisement