Sakshi News home page

తాళాలు, చెవులు

Published Mon, Apr 25 2016 12:39 AM

తాళాలు, చెవులు - Sakshi

హ్యూమర్‌ప్లస్
తాళం పుట్టినపుడే దొంగతనం పుట్టింది. దొంగలతో పాటు పోలీసులూ పుట్టారు. వాళ్లకు జీతాలివ్వడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఓటర్లు పుట్టారు. తాళం వల్ల ఏర్పడిన అనవసర మేళమిది. ప్రపంచంలో అన్నింటికీ తాళమేసేవాళ్లు ఉంటారు. ఏ తాళాన్నయినా తీసిపడేసే వాళ్లూ ఉంటారు. తాళమంటూ ఉన్న తరువాత చెవి కూడా ఉంటుంది. చెవులతో పనిలేకుండా చేతులతో పని చేసేవాళ్లని దొంగలు అంటారు. తాళం చెవులు అనేకరకాలుగా ఉన్నట్టే దొంగలు కూడా డిఫరెంట్‌గా ఉంటారు. వెనుకటికి కన్నం దొంగలుండేవాళ్లు.

ఇప్పుడు కన్నం వేసేంత పటిష్టంగా గోడలు లేవు. అపార్ట్‌మెంట్ గోడకి కన్నం వేయడానికి ప్రయత్నిస్తే మొత్తం బిల్డింగే కూలిపోయే ప్రమాదముంది. బిల్డర్లు గట్టివాళ్లే కానీ బిల్డింగ్‌లు కాదు కదా! పూర్వం కృష్ణ సినిమాల్లో పనీపాటా లేని వాళ్లు నిధిని తీసుకెళ్లి చచ్చీచెడి కొండగుహల్లో పెట్టేవాళ్లు. అంతటితో ఆగకుండా ఐదారు లావాటి తాళాలు వేసి, ఆ చెవుల్ని తలా ఒకటి పంచుకుని గుర్రాలేసుకుని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లేవాళ్లు. ఇందులో ఒకాయన చేయి తిరిగిన చిత్రకళా నైపుణ్యంతో మ్యాప్ గీసేవాడు.

ఇది విలన్ సత్యనారాయణకి తెలిసి చిత్రహింసలు పెట్టి మ్యాప్‌ని స్వాధీనం చేసుకునేవాడు. అప్పుడొస్తాడు కృష్ణ. గిటార్ వినిపిస్తుంటే, రివాల్వర్ పొగని ఊదుతూ, మంచివాళ్లకి మంచివాణ్ణి, మోసగాళ్లకి మోసగాణ్ణి అంటూ చెయ్యంత పొడవున్న ఒక్క తాళాన్ని స్వాధీనం చేసుకుంటూ చివరికి ఆ నిధిని పేదవాళ్లకి పంచేస్తాడు. కృష్ణ సినిమాలు చూసిన తరువాత నిధి తాళాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని మేము ఎంతో ప్రయత్నించాం. సైకిల్ తాళాలు కూడా దొరకలేదు.
 
గోడలకి చెవులుంటాయో లేదో తెలియదు కానీ, కొన్ని ఇళ్ల గోడలకి తాళం చెవులు తప్పకుండా ఉంటాయి. మా మిత్రుడు ఒకాయన ఎండాకాలంలో తలుపులు తెరిచి నిద్రపోయాడు. నిద్రపట్టని ఒక దొంగ ఇంట్లోకి వచ్చి గోడకి ఉన్న బీరువా తాళాలు తీసుకుని బీరువా తెరిచాడు. అది పాతకాలం గాడ్రేజ్ బీరువా. తలుపు తీస్తే ‘కుయ్యోకిక్‌కిక్’మని రెండు వీధులకి వినిపించేలా సౌండొస్తుంది. అయినా మనవాడు లేవలేదు. దొంగ తన విధి ధర్మాన్ని వీడలేదు.
 
దొంగ చేతికి తాళాలివ్వడం అని ఒక సామెతుంది. ప్రజాస్వామ్య పారిభాషిక పదమిది. ఎవరు మనకు చెవులు మూసి చావగొడతారో వాళ్లకే మనం తాళం చెవులు అప్పగిస్తాం.
 
ఒక చిన్న రంపంతో తాళం చెవి పళ్లుతోమి, ఏ తాళమైనా తెరిచేవాళ్లుంటారు. వాళ్లు రోడ్డు మీద పేదరికంతో ఉంటారు. తాళం తీయడం తెలిసిన ప్రతివాడు దొంగకాదు. మా ఊళ్లో చిన్న ఏడుకొండలు అని ఒకాయన ఉండేవాడు. ఆయన మొలతాడుకి ఒక పొడుగాటి తాళముండేది. బీరువాలో బంగారు నాణాలు దాచాడని అందరూ అనుకునేవారు. కొడుకులు కోడళ్లు కూడా మర్యాదగా చూసేవాళ్లు. బీరువాలో ఏముందో ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఒకరోజు పోయాడు. కొడుకులు కోడళ్లు ఆదరాబాదరాగా బీరువా తెరిచారు. నాలుగు గణేష్ బీడీల కట్టలు, రెండు అగ్గిపెట్టెలు కనిపించాయి.
 
మన ఆత్మ తృప్తి కోసం ఇళ్లకి తాళాలు వేసుకుంటాం గానీ దొంగలనుకుంటే అవొకలెక్కా? తాళం హృదయం దొంగలకి అర్థమైపోతుంది. దాని పొట్టలో ఎన్ని లీవర్లున్నాయో కనిపెడతారు. తాళాల జాతకం దొంగలకి తెలిసినట్టే, దొంగల జాతకం పోలీసులకి తెలిసిపోతుంది. ఒక్కో దొంగకి ఒక్కో స్టయిలుంటుంది. అన్ని స్టయిల్స్ తెలిసిన స్టయిల్ కింగ్స్ పోలీసులు.
 
దేవుడు మనల్ని సంకెళ్లతో పుట్టిస్తాడు. కీ ఎక్కడుందో తెలుసుకోడానికి జీవితమంతా ప్రయత్నిస్తాం. దొరికేసరికి మనం సంకెళ్లకి అలవాటు పడివుంటాం. అవి లేకుండా జీవించలేం.మృచ్ఛకటికం నాటకంలో ఒక దొంగ కళాత్మకంగా కన్నం వేస్తాడు. దొంగ నేర్పుని చారుదత్తుడు ప్రశంసిస్తాడు. దొంగల్ని ప్రశంసించే చారుదత్రులతో రాబోయే రోజుల్లో లోకం నిండిపోతుందని బహుశా శూద్రక మహాకవి ఊహించి ఉండడు.
మనం ప్రశాంతంగా జీవించాలంటే తలుపుల కంటే నోటికే ఎక్కువ తాళం అవసరం.
- జి.ఆర్. మహర్షి

Advertisement

తప్పక చదవండి

Advertisement