క్రీస్తు ప్రేమకు పాత్రులమవుదాం... | Sakshi
Sakshi News home page

క్రీస్తు ప్రేమకు పాత్రులమవుదాం...

Published Thu, Apr 17 2014 11:53 PM

క్రీస్తు ప్రేమకు పాత్రులమవుదాం...

క్రీస్తు మనందరికోసం పునరుత్థానం చెందాడు. ఆ పునరుత్థాన శక్తిని మనలో నింపుకుని జీవితంలోని  అన్ని దశల అనుదిన జీవనంలో చెడు నుంచి మంచి వైపుకు మనం అడుగులు వేయాలి.  రోమ్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ప్రియ సోద ర సోదరీమణులందరికీ... హ్యాపీ ఈస్టర్.
 
 ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. నేను ప్రకటించబోయే వర్తమానం అటువంటిది. క్రీస్తు తిరిగి లేచాడు! క్రీస్తు పునరుత్థానం చెందాడు. ఈ సంగతిని ఇంటింటికీ వెళ్లి, ప్రతి కుటుంబం చెంతకూ వెళ్లి, ముఖ్యంగా పీడితులు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో... ఆసుపత్రులలో, కారాగారాలలో... అక్కడికి వెళ్లి చెప్పాలని ఉంది నాకు.
 
 క్రీస్తు సమాధి వద్దకు వెళ్లి, అది ఖాళీగా ఉండడం చూసి అబ్బుర పడిన ఆయన శిష్యురాళ్ల వలే మనకూ ఆశ్చర్యం కలగవచ్చు. ఏమిటి దీనికి అర్థం? క్రీస్తు తిరిగి లేచాడంటే ఏమిటి అంతరార్థం? ఏమిటంటే - మరణం కన్నా, పాపం కన్నా కూడా దేవుని ప్రేమ శక్తిమంతమైనదని! దేవుని ప్రేమ పూర్తిగా మన జీవితాలను మార్చివేసిందని! మన హృదయంలో ఎడారులై ఉన్న ప్రదేశాలను వికసింపజేసిందని! దేవుని ప్రేమ ఏదైనా చేయగలదు.
 
 ఈ ప్రేమ కోసమే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనిషిగా జన్మించాడు. నిరాడంబర మార్గాన్ని అనుసరించాడు. చిట్టచివరి వరకు తనను తను అర్పించుకుంటూ దేవుని నుంచి విడివడ్డాడు. ఇదే కారుణ్య ప్రేమ సమాధిలోని క్రీస్తు దేహంపై ఒక ఉద్ధృతిగా ప్రసరించి ఆ దేహాన్ని నిత్య జీవంతో నింపింది.
 
 కాబట్టి నేనిప్పుడు ఎవరితోనైతే మాట్లాడుతున్నానో వారందరికీ నాదొక ఆహ్వానం. క్రీస్తు పునరుత్థాన మహిమకు లోబడదాం. దేవుని కారుణ్యంతో మనల్ని మనం పునర్నవీకరించుకుందాం. క్రీస్తు ప్రేమకు పాత్రులమవుదాం. ఆయన ప్రేమతో మన జీవితాలను వెలిగించుకుందాం. ఈ భూమికి జలాన్ని, శాంతిని అందిస్తున్న ఆయన కారుణ్యానికి  ప్రతినిధులమవుదాం.
 
 అదేవిధంగా, తిరిగి లేచిన క్రీస్తును మనం... మనలోని ద్వేషాన్ని ప్రేమగా, ప్రతీకార భావాన్ని క్షమాగుణంగా, యుద్ధాన్ని శాంతిగా మార్చమని అడుగుదాం. ప్రపంచాన్ని శాంతివనంగా మార్చమని ప్రార్థిద్దాం. ప్రియ సోదర సోదరీమణులారా... రోమ్ నుంచి నా మాటలను ఆలకిస్తున్న ప్రపంచ పౌరులందరికీ ‘సామెతలు’ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నిరంతరమైన ఆయన ప్రేమకు, కారుణ్యానికి వందనాలు సమర్పించండి.
 
 ఈ శాంతి సందేశాన్ని, సంతోష సందేశాన్ని, ఆకాంక్షల సందేశాన్ని మీ కుటుంబాలలో, మీ దేశాలలో ప్రతి సంవత్సరం ఈస్టర్ రోజున వినిపించండి.
 
 (వాటికన్ సిటీ నుంచి పోప్ ఫ్రాన్సిస్ గత ఏడాది ఇచ్చిన ఈస్టర్ శాంతి సందేశంలో కొంతభాగం)
 

Advertisement
Advertisement