ఊపిరితిత్తుల కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

ఊపిరితిత్తుల కౌన్సెలింగ్

Published Mon, Jul 13 2015 11:30 PM

Lung counseling

రుతు సమయంలో ఆస్తమా?

 నా వయసు 40 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి?
 - సువర్ణ, నందిగామ

రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఇందులో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనాపూర్వకమైన అంశాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే... ఏదైనా వ్యాధి వల్ల రుతుక్రమానికి  విఘాతం కలగవచ్చు. తద్వారా అటు శారీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.
 కెటామెనియల్ ఆస్తమా అనేదాన్ని రుతుక్రమం ముందు వచ్చే (ప్రీమెనుస్ట్రువల్) ఆస్తమాగా కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం  కొంతమంది మహిళల్లో కనిపించిన దాఖలాలు ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు.

అయితే అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవేపాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. దాంతో ఆస్తమా పెచ్చరిల్లుతుంది. రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందుకే... రుతుక్రమానికి ముందుగా వచ్చే ఆస్తమా విషయంలో దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం.

చాలామంది రోగులు ల్యూటియల్ దశగా పేర్కొనే అండం ఆవిర్భవించే దశ నుంచి అది ఫలదీకరణ చెందనందువల్ల రుతుసమయంలో పడిపోయే సమయంలో వచ్చే ఆస్తమాకు గాను, మామూలుగా ఆస్తమాకు వాడే మందులనే అత్యధిక మోతాదుల్లో ఇస్తే ఉపశమనం పొందుతారు. ఇక మిగతావారిలో కండలోకి ప్రోజెస్టెరాన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నిమ్మళపడతారు. కాబట్టి మీకు ఏ అంశం ఆస్తమాను ప్రేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి.
 
 

Advertisement
Advertisement