కొత్తగా... వింతగా..! | Sakshi
Sakshi News home page

కొత్తగా... వింతగా..!

Published Sat, Jan 18 2014 1:21 AM

కొత్తగా... వింతగా..!

అన్ని దేశాలూ ఆడితే ఒలింపిక్స్... కామన్వెల్త్ దేశాలు మాత్రమే ఆడితే కామన్వెల్త్ గేమ్స్... మరి ఒక భాష మాట్లాడే వాళ్లు ఉన్న దేశాల మధ్య గేమ్స్ జరిగితే...? అవి ‘లూసోఫోనియా గేమ్స్’. పోర్చుగీస్ భాష వాడుకలో ఉన్న దేశాల మధ్య జరిగే క్రీడలు లూసోఫోనియా క్రీడలు. (ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆ భాష మాట్లాడే వారున్నా ఆ దేశం ఈ క్రీడల్లో పాల్గొనవచ్చు)
 ఈసారి ఈ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 18 నుంచి 29 వరకు 11 అంశాల్లో ఈ ఆటలు గోవాలో జరుగుతాయి.
 ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభం
 పోర్చుగీసు భాష మాట్లాడే దేశాల మధ్య క్రీడలు నిర్వహించాలనే ఆలోచన 2004లో వచ్చింది. చకచకా ఏర్పాట్లు జరిగాయి. 2006లో మకావులో తొలిసారి ఈ క్రీడలు నిర్వహించారు. మకావులో జరిగిన ఈ ఈవెంట్‌లో 11 దేశాలకు చెందిన 733 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లిస్బన్ వేదికగా జరిగిన 2009 క్రీడల్లో 12 దేశాల నుంచి 1300 మంది బరిలోకి దిగారు. భారత్‌తోపాటు బ్రెజిల్, అంగోలా, కేప్‌వర్డె, ఈస్ట్ తిమోర్, గినియా బిసావూ, మొజాంబిక్, పోర్చుగల్, సావోతోమి ప్రిన్సిపి, ఈక్వటోరియల్ గినియా, ఘనా, ఫ్లోరెస్, మారిషస్, మొరాకో దేశాలు ఈ క్రీడల్లో పోటీపడుతున్నాయి. మళ్లీ ఇప్పుడు 2014లో భారత్‌లో ఈ క్రీడలు జరుగుతున్నాయి.
 బ్రెజిల్ టాప్...
 గత రెండు ఈవెంట్స్‌లో బ్రెజిల్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రెజిల్ సాధించిన మొత్తం 133 పతకాల్లో స్వర్ణాలు 62... రజతాలు 42... కాంస్యాలు 29 ఉన్నాయి. భారత్ మాత్రం ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం పది పతకాలు సాధించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement