మహాశివరాత్రి - ఓ మహత్తరమైన రాత్రి! | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి - ఓ మహత్తరమైన రాత్రి!

Published Thu, Feb 5 2015 11:20 PM

మహాశివరాత్రి -  ఓ మహత్తరమైన రాత్రి! - Sakshi

 సద్గురు జగ్గీ వాసుదేవ్
 
మహాశివరాత్రి అనేక ఆధ్యాత్మిక అవకాశాలను అందించే రాత్రి. మాఘ మాసంలో (ఫిబ్రవరి- మార్చి) పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది.
 మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి!

ఈ రోజు ప్రకృతి నుంచి సహజంగానే ఎంతో సహాయం లభిస్తుంది. సాధకుడు తనలోని ఆధ్యాత్మికతను మేలుకొలపడానికి, శక్తులను ఉత్తేజపరచడానికి ఆరోజు గ్రహస్థానాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాత్రి తెల్లవార్లు మేల్గొని వెన్నెముక నిటారుగా నిలపటం మీలోని సహజ శక్తులు ఉప్పొంగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దేశంలో సనాతనంగా ఋషులు, మునులు ఈ శక్తులు ఉప్పొంగడానికి ఈ రాత్రి కల్పించే ఆసరాతో తమ సర్వోత్తమస్థితికి చేరుకున్నారు.

కేవలం ఒక జీవిగా ఉండే స్థితి నుంచి అధ్యాత్మిక స్థితికి చేరుకోవాలంటే శక్తులు ఊర్ధ్వఃముఖంగా పయనించాలి. మనం మన శరీరానికి మాత్రమే పరిమితమైపోతే మనం పిల్లల్ని కనడానికే పరిమితమైపోతాము. భౌతిక జీవనానికి అంతకంటే మించిన ప్రయోజనం లేదు. ఈ భూమి మీద ఏ ప్రాణిని చూసినా తమ జాతి కొనసాగడానికి అవి కూడా సంతానం కంటూనే ఉన్నాయి. కాని ఒకసారి మానవ జన్మ ఎత్తాక, అంటే వెన్నెముక నిటారైన తరువాత, జీవితం కేవలం అలా కొనసాగడంతో సరిపోదు. జీవశాస్త్రవేత్తలు జీవపరిణామ క్రమంలో సమాంతరంగా ఉండే వెన్నెముక నిటారుగా కావడాన్ని ఎంతో పెద్ద పరిణామంగా పేర్కొంటున్నారు. ఇలా వెన్నెముక నిటారయ్యాకే మీ తెలివి వికసించింది. మహాశివరాత్రి నాటి ఉత్సవంలో రాత్రంతా ఇలా శక్తులు ఉత్తేజమవడాన్ని ఉపయోగించుకొని, సైరైనమంత్రోచ్ఛారణ, ధ్యానాలూ చేస్తూ మనం దివ్యత్వానికి చేరువ కావచ్చు. ఏ సాధన లేకపోయినా ఈ శక్తులు ఉత్తేజమవడం జరుగుతుంది. కాని ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఇలా శరీరాన్ని నిటారుగా ఉంచుకోవడం, తెల్లవార్లూ మేలుకొని ఉండడం చాలా ముఖ్యం.
 
శివుడే ఆదియోగి, ఆదిగురువు కూడా!

ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి, సంసార జీవనం సాగించేవారికి, అభ్యుదయం కోరుకునే వారికి కూడా మహాశివరాత్రి ఎంతో మహత్తరమైనది. సంసారిక జీవనం సాగించేవారు ఈ దినాన్ని శివుడు కళ్యాణమాడిన దినంగా జరుపుకుంటారు. అభ్యుదయం కోరుకునే వారు శివుడు శత్రువులను జయించిన విజయదినంగా జరుపుకుంటారు. యోగా సంప్రదాయంలో శివుడిని దేవునిగా కాక ఆది యోగి, ఆది గురువుగా పరిగణిస్తారు. యోగ విధానాన్ని ఆరంభించింది ఆయనే. ఆయన ముందు ఏడుగురు శిష్యులను ఎంచుకున్నారు. వారినే ఈనాటికి కూడా మనం సప్తర్షులుగా ఆరాధిస్తాము, వారితోనే యోగా శాస్త్ర బోధన మొదలయింది. ఇది కేదార్‌నాథ్ దగ్గర ఉన్న కాంతి సరోవర తీరంలో జరిగింది. అంటే ఇక్కడే ప్రపంచంలో మొదటి యోగ కార్యక్రమం జరిగిందన్నమాట.

 యోగా అంటే శరీరాన్ని వంచడం, ఊపిరి బిగబట్టడం అని మీరు అనుకోకండి. యోగా అంటే మేము అసలు జీవనరీతి గురించి మాట్లాడుతున్నట్టు. తన శరీరాన్ని, జీవన గమనాన్ని పూర్తిగా తిరగరాసుకో గలిగేవాడే యోగి. శివ అన్నప్పుడు మనం కోరికలు తీర్చే ఒక దేవుడో, లింగమో అనుకోకూడదు. శివ అంటే లేనిది అని అర్థం. ప్రస్తుతం శాస్త్రవిజ్ఞానం కూడా అన్నీ శూన్యంలో నుంచే పుట్టి శూన్యంలోనే లీనమవుతున్నాయి అని చెబుతున్నది, తార్కికంగా కూడా అదే యధార్థం. ఆ శూన్యమే శివ అంటే. అన్నీ కలిగినది, ఏమీ కానిది, అదే శివ అంటే. మీలో మీరు కాక, ఆ శివుడే ఉండేటట్లు మిమ్మల్ని మీరు మలుచుకోగలిగితే, మీకో కొత్త దృష్టికోణం ఏర్పడుతుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఎంతో స్పష్టంగా చూసే అవకాశం వస్తుంది. శివుడు త్రయంబకుడు లేక మూడుకళ్ళు కలవాడు అని అంటారు. ఈ మూడవ కన్నే అసలై దృష్టి ఇస్తుంది. భౌతికమైన కళ్ళు రెండూ కేవలం జ్ఞానేంద్రియాలు మాత్రమే, మీరు చూసే అవాస్తవాలనే అవి మనసుకు చేరవేస్తాయి. మీరు ఏదో ఒక మనిషిని చూసి అతని గురించి ఏదో ఆలోచిస్తున్నారు, కాని అతనిలోని శివుని చూడలేకపోతున్నారు. ఈ రెండు కళ్ళూ యధార్ధాన్ని చూడలేవు. నిశితంగా చూడగలిగే ఇంకో కన్ను తెరచుకోవాలి. ఈ దేశంలో, ఈ సంస్కృతిలో, తెలుసుకోవడం అంటే పుస్తకంలో ఏదో చదవడం, ఎవరో చెప్పింది వినడం, ఏదో సంగ్రహించడం కాదు. తెలుసుకోవడం అంటే మరో దృష్టికోణాన్ని ఏర్పరచుకోవడం. మహాశివరాత్రి నాడు ప్రకృతి ఈ అవకాశాన్ని మనకు కలిగిస్తున్నది. ఈ అవకాశం ప్రతిరోజూ ఉంటుంది, ఈ ప్రత్యేక దినం కోసం వేచి ఉండనవసరం లేదు, కాని ఈరోజు మాత్రం ప్రకృతి ఆ అవకాశాన్ని మీకు సులభంగా చేకూరుస్తుంది.
 
కేవలం జాగరణ రాత్రే కాకూడదు
 
మనం శివుడు అనేది పరమోత్తమ జ్ఞానమూర్తినే కానీ, వేరొకరిని కాదు. అందువల్లే ఈశా యోగా కేంద్రంలో మహా శివరాత్రిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. అసలు సంవత్సరమంతా ఈశా యోగా కేంద్రం మహాశివరాత్రి కోసం ఎదురుచూస్తుంది. ఇది అందరు తమ ఎరుక(్చఠ్చీట్ఛ్ఛటట)ను ఎంతో కొంతైనా ముందుకు తీసుకువెళ్ళే మహత్తర అవకాశం. ఇది జీవితం గురించిన ఆలోచనలూ, అభిప్రాయాలూ, భావావేశాలకు దూరంగా ఉండే అవకాశం. శివ అన్నా, యోగా అన్నా అదే - ఆలోచనలూ, అభిప్రాయాలూ, భావావేశాలకూ దూరంగా ఉండే ఎరుక (్చఠ్చీట్ఛ్ఛటట)! ఈ మహాశివరాత్రి కేవలం జాగరణ రాత్రి కాకుండా, మిమ్మల్ని సచేతనత్వం, ఎరుకలతో నింపేది కావాలని, ప్రకృతి ఈరోజు మనకు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తాను. మీరందరూ ఉప్పొంగే ఈ శక్తితరంగం ఆలంబనగా శివ అన్న శబ్దంలోని పారవశ్యాన్నీ, రమణీయతనూ తెలుసుకుంటారని ఆశిస్తాను.

సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు.  మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద రాసి పంపడమే!
 చిరునామా: సద్గురు సమాధానాలకోసం  సన్నిధి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34
 ఈ మెయిల్: sadgurusakshi@gmail.com
 

Advertisement
Advertisement