మహిళల ముద్ర | Sakshi
Sakshi News home page

మహిళల ముద్ర

Published Mon, Jan 27 2020 1:57 AM

Mahim In Mumbai To Have All Women Post Office - Sakshi

ఆకాశంలా.. మహిళాశక్తి అనంతం.ఈ విషయాన్ని మహిళాలోకం ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది.  తాజాగా ఇప్పుడు మహిళలు అధిగమించిన మరో మైలురాయి..  ముంబాయి మాహిమ్‌ బజార్‌ పోస్టాఫీస్‌. శనివారం మాహిమ్‌ బజార్‌ పోస్ట్‌ఆఫీస్‌ శాఖ ‘మహిళా డాక్‌ఘర్‌’గా గుర్తింపు తెచ్చుకుంది. అంటే ఆల్‌ ఉమెన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ అయింది. ఈ పోస్ట్‌ ఆఫీస్‌లో ఇప్పుడు పోస్ట్‌ మాస్టర్‌ (ఇన్‌చార్జ్‌) నుంచి కౌంటర్‌ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ మహిళలే!

మాహిమ్‌ బజార్‌ పోస్ట్‌ ఆఫీస్‌ శాఖకు వచ్చే వాళ్లలో 70 శాతం మంది మహిళలే. వారికి సౌకర్యంగా ఉండడం కోసమే పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. అందుకోసం అవసరమైతే మగ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసి మరీ మహిళలతో భర్తీ చేస్తోంది. ‘‘ఆల్‌ ఉమెన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఒక మంచి ఏర్పాటు. ఇందువల్ల పోస్టాఫీస్‌కు వచ్చేవారికే కాక, ఇక్కడ పనిచేస్తున్న మహిళలకూ అనువైన పని వాతావరణాన్ని కల్పించడం సాధ్యమౌతుంది’’ అంటారు ముంబాయి రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ స్వాతి పాండే. ఇప్పుడు ఈ వరుసలోనే అంధేరీ, బోరివెల్లి, వదాలా శాఖలను కూడా ఆల్‌ ఉమెన్‌ పోస్ట్‌ ఆఫీస్‌లుగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారామె.

హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లను ఆల్‌ ఉమెన్‌ పోస్ట్‌ ఆఫీస్‌లుగా మార్చడానికి మాత్రం కొంత సమయం తీసుకుంటున్నామని, తొలి ప్రయత్నంలో చిన్న శాఖలను మహిళా డాక్‌ఘర్‌లుగా మార్చుతున్నామని స్వాతి తెలిపారు. ప్రస్తుతం ముంబాయి రీజియన్‌లోని పోస్ట్‌ ఆఫీసుల్లో స్త్రీ పురుష ఉద్యోగుల నిష్పత్తి 60–40గా ఉంది. కాబట్టి పోస్ట్‌ ఆఫీస్‌లను మహిళాశక్తితో నడిపించడం కష్టమేమీ కాదు. ముంబాయి నగరంలో ఆల్‌ ఉమెన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఇప్పటికే ఒకటి ఉంది. అది టౌన్‌ హాల్‌ పోస్ట్‌ ఆఫీస్‌. ఇప్పుడీ మాహిమ్‌ బజార్‌ శాఖ కూడా ఆ హోదాను దక్కించుకుంది. ఈ రెండిటికంటే ముందు.. న్యూఢిల్లీ ఈ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. భారతీయ తపాలా శాఖ న్యూఢిల్లీలో 2013లోనే ఆల్‌ ఉమెన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ను నెలకొల్పింది.

Advertisement
Advertisement