Sakshi News home page

మామిడి పళ్లూ... పెసర గుగ్గిళ్లు

Published Fri, May 13 2016 1:52 PM

మామిడి పళ్లూ... పెసర గుగ్గిళ్లు - Sakshi

వేసవి జ్ఞాపకం...
వేసవి ఉక్కపోతను తట్టుకోలేక చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎండాకాలమంటే ఇష్టం ఎందుకంటే మగ్గిన మామిడి పళ్ల వాసనలు, మల్లెపూల పరిమళాలూనూ. లేత తాటిముంజలు, ఈతపళ్ల తియ్యదనాన్ని రుచి చూడాలంటే వేసవి కాలం రావలసిందే కదా. చిన్నప్పుడు ఎండాకాలం మొదలవడంతోటే అమ్మా, అమ్మమ్మా, నాయనమ్మా, అత్తలు కలిసి పెట్టిన అప్పడాలు, వడియాలను కాకులు ఎత్తుకుపోకుండా, కుక్కలు ముట్టుకోకుండా కాపలా కాసే డ్యూటీ పడేది! మధ్యమధ్యలో ఎండినయ్యో లేదో చూసే వంకతో పచ్చిపచ్చిగా ఉన్న వడియాలను రుచి చూడటం ఒక పచ్చి జ్ఞాపకం.

అన్నట్టు అప్పడాలు ఎండినయ్యో లేదో కనుక్కోవడానికి మా అమ్మమ్మ ఒక చిట్కా చెప్పింది. అదేమంటే అప్పడాలు వాటంతట అవి బోర్లాపడుకోబెట్టినట్టుగా కొద్దిగా పైకి లేస్తే అవి ఎండినట్టు. ఆరేసిన బట్ట కింద చిన్నగా చెయ్యి పోనివ్వగానే ఊడి వస్తుంటే గనక వడియాలు ఆరినట్టు. వాటి సంగతి ఏమోగాని వాటి వంకతో చెట్టు కింద కూచుని చందమామ పుస్తకంలో విక్రమార్కుడి భుజాన వేళ్లాడే తెల్ల తోకదెయ్యం బొమ్మను చూస్తూ కూచోవడం ఒక జ్ఞాపకం.
 
పొద్దున్న పదింటికల్లా అన్నం తినేసి, ఒక రౌండు ఆటలు ఆడుకునేవాళ్లం. మధ్యాన్నం పన్నెండున్నరా ఒంటిగంటకల్లా మా తాతయ్య ఇంట్లో కిటికీలన్నింటికీ తడిబట్టలు కట్టించి ఇంటిని ఏసీలా మార్చేసేవాడు. నాలుగున్నరా అయిదు వరకూ పిల్లలెవరూ ఇంట్లో నుంచి బయటకు కదలడానికి వీల్లేదు. నిద్దరొచ్చేదాకా తాతయ్య చెప్పిన కబుర్లు వింటూ వాసాలు లెక్కిస్తూ ఎండకు చివ్వుచివ్వుమనే పిచ్చుక కూతలను వింటూ చాపల మీద పడి దొర్లేవాళ్లం. కాసేపు బజ్జోని లేచేసరికి మామిడిపళ్ల వాసన గాలిలోంచి తేలుతూ వచ్చి పలకరించేది. ఒక చిన్నగిన్నెలో మామిడిపండు పెట్టి ఇచ్చేది మా నానమ్మ. అది తినకుండానే ఆశగా రెండో పండు వైపు చూసేవాణ్ణి. ‘ముందు ఇది తిను, దాని సంగతి తర్వాత చూద్దువుగానీ’ అనేది నవ్వుతూ.

మామిడిపండో, ఈతకాయలో, సపోటా పళ్లో... ఇలా ఏవో ఒక చిరుతిళ్లు సిద్ధంగా ఉండేవి ఇంట్లో ఎప్పుడూ! ఏవీ లేకపోతే కందులో పెసలో ఉడకబెట్టి, ఉప్పూకారం కొత్తిమీర, కరివేపాకు వేసి ఘుమఘుమలాడే గుగ్గిళ్లు చేసి పెట్టేది. ఇక సాయంత్రం పూట ఆడపిల్లలకు పూలజడలు వేసేవాళ్లు. జడతో ఫొటోలు తీయించేవాళ్లు. పూలజడ వేయించుకుని వచ్చి, పెద్దవాళ్లకు దణ్ణం పెట్టడం వాళ్లు ప్రేమగా బుగ్గలు పుణికి పదో పరకో చేతిలో పెట్టడం ఒక రూపాయి కాసులాంటి జ్ఞాపకం.
 
ఇప్పుడు అప్పడాలూ వడియాలూ పెట్టడం, పూలజడలు వేయించుకోవడం పల్లెటూళ్లలో కూడా చాలా అరుదుగా కనిపించే దృశ్యమే అయింది. పెద్దోళ్లేమో ఏసీలు, కూలర్లు పెట్టుకుని టీవీ చూస్తూ ఇంట్లో పడుకోవడం, పిల్లలేమో కంప్యూటర్‌లోనో, స్మార్ట్ ఫోన్లలోనో గేమ్స్ ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ నవ్వులు, ఉట్టుట్టి ఆటలు... అంతా ఉట్టుట్టికే!  అసలు ఉబ్బరింత ఇదే కదా. - బాచి

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement