Sakshi News home page

మదీనాకు పయనమైన ఆమినా

Published Sat, Jan 23 2016 11:09 PM

MedinaTravels to amina

ఇస్లాం
ఒకరి పెదవులపై మందహాసం, మరొకరి మోముపై విచారం. ఆమినా మోము ఆనందపు జల్లులు కురిపిస్తుంటే, హలీమా కళ్ల నుండి దుఃఖవిచారాలు వర్షిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఇరువురి భావోద్రేకాలు సమంజసమైనవే, న్యాయమైనవే.
 
చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు చిన్నారి ముహమ్మద్‌కు ఐదేళ్ల వయసొచ్చింది. ఎంత వయసొచ్చినా ఈ చిన్నారి శాశ్వతంగా తన దగ్గరే ఉండాలని హలీమా మనసు బలంగా కోరుకుంటోంది. కాని ఇది ఎలా సాధ్యం? ముహమ్మద్ మహనీయుని శుభాలు ఏ ఒక్కరికో పరిమితం కావు. ఆ మహనీయుని జననం లోకకల్యాణం కోసం. ఆ పవిత్రాత్మ నుండి ప్రసరించే కాంతిపుంజాలు యావత్ భూమండలాన్ని పావనం చేయాల్సి ఉంది కాబట్టి తప్పదు... ఈ బిడ్డను తల్లికి అప్పగించాల్సిందే.
 
ఒకనాటి ఉదయం హలీమా చిన్నారి ముహమ్మద్‌ను వెంటబెట్టుకొని మళ్లీ మక్కాకు బయలుదేరింది. ఆమినా ఇంటికి చేరుకొని ‘అప్పగింత’ను భద్రంగా తల్లికి అప్పగించింది. ప్రాణసమానమైన తన గారాల పట్టి తిరిగి ఇంటికొచ్చినందుకు ఆమినా ఆనందంతో పొంగిపోయింది. ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీనికి భిన్నంగా హలీమా పరిస్థితి దీనాతిదీనంగా తయారైంది. తన అదృష్టం చేజారిపోయినందుకు చాలా బాధ పడుతుంది.
 
ఒకరి పెదవులపై మందహాసం, మరొకరి మోముపై విచారం. ఆమినా మోము ఆనందపు జల్లులు కురిపిస్తుంటే, హలీమా కళ్ల నుండి దుఃఖవిచారాలు వర్షిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఇరువురి భావోద్రేకాలు సమంజసమైనవే, న్యాయమైనవే. ఈ దుఃఖం, ఈ ఆనందం రెండూ శుభప్రదమైనవే. ఈ రెండు ‘స్థితులూ’ ఒకే ఆస్తిత్వంతో, ఒకే వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్నాయి.
 ఇప్పుడిక కొడుకే లోకంగా ఆమినా కాలం వెళ్లదీస్తున్నారు. ముద్దుల బిడ్డలను చూసుకొని మురిసిపోతూ, గుండెల్లోని దుఃఖాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నారామె. అమ్మ మమతానురాగాలు, తాతయ్య ప్రేమాభిమానాల మధ్య మరో ఏడాది గడచిపోయింది. ఇప్పుడు చిన్నారి ముహమ్మద్‌కు ఆరేళ్లు నిండాయి. ఈ క్రమంలోనే ఒకసారి ఆమెకు భర్త సమాధిని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది.

పుట్టింటి బంధుగణం కూడా మదీనాలో ఉంటారు కాబట్టి, కొన్నాళ్లు అక్కడ గడిపితేనైనా మనసుకు కాస్తప్రశాంతత చేకూరుతుందన్న ఆవిడగారి ఆశ. వెంటనే, తన ఆశల పంట చిన్నారి ముహమ్మద్‌ను వెంటబెట్టుకొని, పరిచారిక ఉమ్మెఐమన్ తోడుగా మదీనాకు పయనమయ్యారు ఆమినా. అబ్దుల్లాహ్ తనయుడు చేసే ఈ ప్రయాణం బహుశా భవిష్యత్తులో జరగబోయే ‘హజ్రత్’కు, మానవ ఇతిహాసంలో సంభవించనున్న మహోజ్వల, మహిమాన్విత సంఘటనలకు నాందీ వాచకమేమో!
 రాకరాక వచ్చిన మదీనా ఆడపడుచు ఆమినాకు ఆమె బంధుగణం అపూర్వ స్వాగతం పలికారు. అందరి కళ్లల్లో ప్రేమ, సానుభూతితో కూడిన భావోద్రేకాల ఆనందభాష్పాలు. భర్తను కోల్పోయి, తొలిసారిగా పుట్టింటి బంధుజనుల మధ్య, ఆడపడుచు అందుకుంటున్న ప్రేమానురాగాల సజల నీరాజనాలు.
 
ఇక చిన్నారి ముహమ్మద్ విషయమైతే చెప్పనవసరమే లేదు. అందరి సానుభూతి, ప్రేమానురాగాలకు కేంద్రబిందువుగా మారిన ఆ చిన్నారి క్రమశిక్షణ, పసివయసులోనే తొణికిసలాడుతున్న హుందాతనం వారికి ఆనందంతోపాటు, ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది.
 - యం.డి. ఉస్మాన్‌ఖాన్
(వచ్చేవారం మరికొన్ని విశేషాలు)

Advertisement

తప్పక చదవండి

Advertisement