మరపురాని మతిమరుపు చిత్రాలు | Sakshi
Sakshi News home page

మరపురాని మతిమరుపు చిత్రాలు

Published Wed, Nov 16 2016 10:44 PM

మరపురాని మతిమరుపు చిత్రాలు - Sakshi

సిల్వర్ అల్జైమర్స్

‘బ్లాక్ ’ చిత్రంలోని ఒకే ఒక్క పాట.. ‘హా మైనే షుకర్ దేఖా హై’. ఇందులోని... ‘క్షణాల వేలిని జ్ఞాపకాలు పట్టుకుని ఉన్నాయి. వరండాలోకి వచ్చాను. ఆ జ్ఞాపకాలను నేను తాకాను. చూశాను’ అనే చరణం  ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేస్తుంది.

అల్జైమర్స్‌లోని ప్రధాన లక్షణం మెమరీ లాస్. జ్ఞాపకశక్తి సన్నగిల్లడం లేదా నశించడం. మెమరీ లాస్ కథాంశంతో మంచి మంచి హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. బిఫోర్ ఐ గాట్ స్లీప్ (థ్రిల్లర్), ది వోవ్(రొమాంటిక్ డ్రామా), ది బార్న్ ట్రయాలజీ (యాక్షన్), ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్ (ఎమోషనల్), టోటల్ రీకాల్ (సైన్స్ ఫిక్షన్), 50 ఫస్ట్ డేట్స్ (రొమాంటిక్ కామెడీ), ఫైండింగ్ నెమో (ఉద్వేగం), మెమెంటో (సైకాలజీ)... అన్నవి మరపురాని సినిమాలు. నేరుగా అల్జైమర్స్ మీదే వచ్చిన సినిమాలూ ఉన్నాయి. ‘ది శావేజస్, ఎవే ఫ్రమ్ హర్, అరోరా బరియాలిస్, ది నోట్‌బుక్, ది సాంగ్ ఆఫ్ మార్టిన్, ఐరిస్: ఎ మెమొయిర్ ఆఫ్ ది ఐరిస్ ముర్డోక్, ఫైర్‌ఫ్లై డ్రీమ్స్, యాన్ ఓల్డ్ ఫ్రెండ్స్’... ఇలాంటివే.

‘మతిమరుపు’ వరం అంటారు. కావచ్చేమో కానీ చుట్టుపక్కల వారికి మాత్రం శాపం. చుట్టుపక్కల వాళ్లు అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు. వీళ్లందరికీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందుల గురించి మతిమరుపు ఉన్న వారికి తెలియకపోవడం మరో విషాదం. మరి ఇంత విషాదం ఉన్న అల్జైమర్స్... సినిమాలకు మంచి కథాంశం ఎలా అవుతోంది? అది దర్శకుల ప్రతిభ! ఈ డెరైక్టర్లు మతిమరుపును వినోదంగా, విడ్డూరంగా, ఉద్వేగంగా, ఊహించని విధంగా మలిచి ప్రేక్షకులను థియేటర్ లకు రప్పిస్తున్నారు.

బాలీవుడ్‌లో, ఇతర భారతీయ భాషల్లో కూడా అల్జైమర్స్‌పై కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగినవి ‘బ్లాక్, మాయ్, యు మి ఔర్ హమ్’ (హిందీ), ‘గోధి బన్నా సాధారణ మైకట్టు’ (కన్నడ), ‘తన్మంత్ర’ (మలయాళం). తెలుగులో, తెలుగు డబ్బింగులో ఇలాంటివి ఒకటీ అరా సినిమాలు వచ్చాయి. (గజనీ, నేను మీకు తెలుసు, భలే భలే మగాడివోయ్... వగైరా). 2005లో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘బ్లాక్’ సినిమా పూర్తిగా అల్జైమర్స్ మీదే నడుస్తుంది. రాణీ ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ నటించారు. ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె అంధురాలు. వినపడదు కూడా. టీచర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడుతుంది. ఆ టీచర్‌కి క్రమంగా అల్జీమర్స్ వచ్చి, ఆమెను మరిచిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే ‘బ్లాక్’. హెలెన్ కెల్లర్ జీవిత కథను ఆధారంగా చేసుకుని భన్సాలీ ఈ సినిమాను నిర్మించారు. ఎమోషనల్లీ హిట్. విషయం ఏమిటంటే... ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషా చిత్రాలకు ఎవర్‌గ్రీన్ క్లిక్ ఫార్ములా అల్జైమర్స్. మనుషుల్లో ఎన్ని ఉద్వేగాలు ఉంటాయో... అన్ని ఉద్వేగాలనూ పలికించగల సెంటర్ పాయింట్ సబ్జెక్ - అల్జైమర్స్.

Advertisement
Advertisement