నవయువం : మిలియన్ డాలర్ బేబీ | Sakshi
Sakshi News home page

నవయువం : మిలియన్ డాలర్ బేబీ

Published Tue, Oct 8 2013 11:56 PM

నవయువం : మిలియన్ డాలర్ బేబీ

 ఉత్సాహం మార్పును ఒడిసి పట్టుకోగలుగుతుంది. నవ్యతకు స్వాగతం పలుకుతుంది. అద్భుతాలను సాధించగలుగుతుంది. మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాంటి ఉత్సాహం మిలియనీర్‌ను చేస్తుంది. అందుకు సాక్షి మిచిగాన్(యుఎస్)కు చెందిన ఆష్లే క్వాల్స్...
 ‘‘ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో పాశ్చాత్య యువతకు దిశానిర్దేశం చేసేవి సెవెంటీన్, టీన్‌వోగ్, కాస్మోగర్ల్.. ఈ  మూడు మ్యాగ్జిన్‌లను ఎంతమంది కొని చదువుతున్నారో.. ఈ 22 యేళ్ల అమ్మాయి వెబ్‌సైట్‌ను అంతే మంది చూస్తున్నారు...’’ ఆష్లే క్వాల్స్ గొప్పతనం గురించి  ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ ప్రస్తావించింది. 14 యేళ్ల వయసులో వెబ్‌పేజ్‌ల డిజైనింగ్ ను  ఒక హాబీగా ప్రారంభించింది క్వాల్స్. మైస్పేస్ సైట్‌లో తన స్నేహితుల అకౌంట్స్ కోసం వెబ్‌పేజ్‌లను డిజైన్ చేసేది. తర్వాతి రోజుల్లో ఆ హాబీ ఒక వ్యాపారంగా మారింది. పేజ్ లేఔట్‌లను డిజైన్ చేయడానికి ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వాట్‌ఎవర్‌లైఫ్.కామ్ అనే వెబ్‌సైట్‌తో తన వ్యాపారాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానించింది ఆష్లే. అచిరకాలంలోనే ఆ వెబ్‌సైట్ పాపులర్ అయ్యింది.
 
 రెడీమేడ్ పేజ్‌ల వ్యాపారం..
 సోషల్‌నెట్‌వర్కింగ్ మ్యానియాను క్యాష్ చేసుకొనే వ్యాపారం ఇది. ఫేస్‌బుక్, మై స్పేస్ వంటి సైట్ల యూజర్లకు ఆష్లే రెడీ మేడ్ వెబ్‌పేజ్‌లను అందిస్తుంది. నిరంతం హోమ్ పేజ్ డిజైన్‌లను మార్చడానికి ఇష్టపడే యువతకు అష్లే ప్రారంభించిన సైట్ మంచి విందు భోజనంగా మారింది. ఆ సైట్ నుంచి కొత్త డిజైన్స్‌ను తమ పేజ్‌లకు అనుసంధానించుకోవడం మొదలుపెట్టారు. అలా వాట్‌ఎవర్‌లైఫ్.కామ్ సూపర్‌సక్సెస్ అయ్యింది. ఆష్లే సైట్‌ను  నెలకు దాదాపు 70 లక్షల మంది సందర్శిస్తున్నారు. దాదాపు ఆరు కోట్ల వ్యూలు ఉంటున్నాయి. వారందరికీ ఇక్కడ ఉచితంగా వెబ్‌పేజ్‌లు అందుబాటులో ఉంటాయి. విజిట్స్ ఎక్కువగా ఉండటంతో ఆష్లే పేజ్‌కు యాడ్స్ వస్తాయి. యాడ్స్ రూపేణా డబ్బు వస్తుంది.
 
 లక్షల డాలర్లను కాదంది...
 2009లోనే వాట్‌ఎవర్‌లైఫ్.కామ్ సైట్‌ను కొనడానికి ఒక కార్పొరేట్ సంస్థ ముందుకొచ్చింది. 15 లక్షల డాలర్ల డబ్బు, లక్ష డాలర్లు విలువ జేసే కారును ఆఫర్ చేసి వెబ్‌సైట్‌ను కొనడానికి ప్రయత్నించింది ఆ సంస్థ. ఆష్లే ఆ ఆఫర్‌ను నిరాకరించింది. వెబ్‌సైట్ తన చేతిలోనే ఉండటం వల్ల డబ్బుకు మించిన క్రేజ్‌ను సంపాదించవచ్చని ఆష్లే అభిప్రాయం. తనే సొంతంగా అనేక మందికి ఉపాధిని అందిస్తున్నాననే తృప్తి కూడా ఉంటుంది.  ప్రస్తుతానికి వెబ్‌సైట్ ద్వారా ఆష్లేకు 20 లక్షల డాలర్ల ఆదాయం వచ్చి ఉంటుందని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా.
 
 అష్లే ఒక సెలబ్రిటీ...
  ఇప్పుడు ఆష్లే ఒక సెలబ్రిటీ. ఆమె ఏదైనా సినిమా గురించి మాట్లాడినా, సోషల్‌ట్రెండ్స్ గురించి మాట్లాడినాఅదొక వార్త అవుతోంది. యువతలో సోషల్‌నెట్‌వర్కింగ్ ఫీవర్ కొనసాగినంత వరకూ తనకు తిరుగే ఉండదు అనే ఆత్మవిశ్వాసంతో ఉంది ఆష్లే.
 
 తిరుగులేదు...
 ఎవరైనా ఫేస్‌బుక్‌లోనో, మై స్పేస్‌లోనో హోమ్‌పేజ్‌ను మార్చుకోవాలని ఆలోచన వస్తే ఆష్లే వెబ్‌సైట్ వైపు చూడాల్సిందే. అలా తన ప్రాధాన్యతను కాపాడుకొంటోంది ఆష్లే. అందుకు తగ్గ ఉత్సాహం, ముందుచూపు తనకున్నాయని ఆష్లే అంటోంది.

Advertisement
Advertisement