మైండ్ రేప్ | Sakshi
Sakshi News home page

మైండ్ రేప్

Published Tue, Jun 7 2016 11:02 PM

మైండ్ రేప్ - Sakshi

చెవిలో దూది పెట్టుకుని, చెవులు గట్టిగా మూసుకోబుద్ధేస్తోంది! అలా చేస్తే కొందరి మాటలు వినడవు. కానీ ఈ మహానుభావులకు లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడానికి పోలీసు పర్మిషన్ కూడా దొరుకుతుంది. ప్రజా ప్రతినిధులూ... ప్రజా సేవకులూ మరి! ఎక్కడైనా దోషిని దుర్భాషలాడాలి కానీ... బాధితులను నిందిస్తామా? జీన్స్ తొడుక్కోవడం వల్ల, కురచబట్టలు వేసుకోవడం వల్ల... రాత్రి పూట తిరిగినందుకో, పదహారేళ్లకే పెళ్లి చేయనందుకో... రేపులు జరుగుతున్నాయట! వీళ్లది నోరా? మురిక్కాలువా? రేప్ తర్వాత రేప్ లాంటిది ఇది. మహిళలపై చిన్నచూపు కలిగేలా పురుషాధిక్య సమాజం ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. మైండ్ రేప్ ఇది. మహిళల క్యారెక్టర్‌నీ, వారి మనస్థైర్యాన్నీ బజారులో ఉరి వేస్తున్నారు. వీళ్ల నాలుకలకు ముడి వెయ్యాల్సిందే!

 

ఇటీవల శని శింగణాపూర్‌లో గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించినప్పుడు.. స్వామీజీ ఒకరు స్పందిస్తూ... ‘‘ఈ పరిణామంతో మహిళలపై అత్యాచారాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది’’ అని వ్యాఖ్యానించారు! ఈ వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలా ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒకచోట, ఎవరో ఒక ప్రముఖుడు... ‘అత్యాచారాలకు మహిళల వైఖరే కారణం’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవ్‌టీజింగ్.. హెరాస్‌మెంట్..  సెక్సువల్ అబ్యూజ్.. రేప్... సంఘటన ఏదైనా, దేశంలో ఏ మూల జరిగినా.. నేరస్థులను వదిలేసి బాధితుల ప్రవర్తనను తప్పుపట్టడం సాధారణమైపోయింది.  అసలు మహిళల నడతనే సరైంది కాదనే కామెంట్లూ చేస్తున్నారు. అలాంటి మాటలు అంటున్నది సామాన్యులు కాదు... ప్రజాప్రతినిధులు, ఉన్నత హోదాల్లోని వారు! వీళ్లు తమ మాటలతో రేప్ చేస్తున్నారు. సగం చచ్చిపడి ఉన్న మహిళలను ఆ మాటల బలత్కారాలతో పూర్తిగా చంపేస్తున్నారు! మహిళల పట్ల ఎవరెవరు ఎంతెంత నోటి దురుసుతనాన్ని...  ఇంకెంత బుద్ధిహీనతను ప్రదర్శించారో చూడండిక్కడ.

 

పెళ్లి చేసెయ్యాలి
అమ్మాయిలకు పదహారేళ్లకే పెళ్లిళ్లు చేసేయాలి. దేహవాంఛలు తీర్చడానికి భర్తలుంటారు కాబట్టి వాళ్లు బయట తిరగరు. దాంతో రేప్‌లూ జరగవు! - ఓమ్ ప్రకాష్ చౌతాలా,  హర్యానా మాజీ ముఖ్యమంత్రి

 

దుస్తులే కారణం
ఈవ్‌టీజింగ్ ఘటనలు పెరగడానికి అమ్మాయిలు వేసుకుంటున్న పొట్టి బట్టలే కారణం. వాళ్ల వస్త్ర ధారణే మగవాళ్లను రెచ్చగొడుతోంది!

 - చిరంజీత్ చక్రబర్తి,  తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే

 

స్పష్టంగా నిర్వచించాలి
అత్యాచారానికి, వ్యభిచారానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా నిర్వచించడం, చెప్పడం సమాజానికి చాలా అవసరం!
- కె. సుధాకరన్, కేరళ కాంగ్రెస్ ఎంపి.

 

పరిహారం.. పరిహాసం!
రేప్ బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి చెప్పాం. అదీ అసెంబ్లీలో. రేప్ బాధితులకే కాదు.. రేప్‌కాని అమ్మాయిలను కూడా అడగాలి.. ఒకవేళ భవిష్యత్‌లో మీరు రేప్‌కి గురైతే  మీరు ఎంత పరిహారం తీసుకుంటారని ముందే అడగాలి!
- అన్సూర్ రెహమాన్, సీపీయం నేత

 

అర్ధరాత్రిళ్లు ఏం పని?
చుట్టాలు, రక్తసంబంధీకులు కాని మగపిల్లలతో ఆడపిల్లలు అర్ధరాత్రిళ్లు తిరగాల్సిన పని, అవసరం ఏంటి? ఇలాంటి వాటిని ఆపాలి!
- అబు ఆజ్మీ, సమాజ్‌వాది పార్టీనేత

 

ఫోన్లు ఎందుకు?
ఆడవాళ్లకు మొబైల్ ఫోన్లు ఎందుకు? వాటి వల్ల వాళ్లు చెడిపోతున్నారు. అసలు పిల్లలకు, స్త్రీలకు ఫోన్లు ఇవ్వకూడదు. అనవసరం కూడా! మా అమ్మ, నా భార్య, చెల్లెలికి మొబైల్ ఫోన్ లేదు. వాళ్లు బతకట్లేదా?
- రాజ్‌పాల్ సైని,  బీఎస్‌పి నేత

 

పాశ్చాత్య ప్రభావం
పట్టణాల్లో తప్ప గ్రామాల్లో రేప్‌లు లేవు. పట్టణాల మీద పాశ్చాత్య ప్రభావమే దీనికి కారణం!  - మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

 

గ్రహాలు అనుకూలంగా లేవ్..
స్త్రీల మీద హింస పెరుగుతోంది.. ఏం చేస్తున్నారంటూ మా మీద విమర్శలు గుప్పిస్తే ఏం చెప్తాం? గ్రహాలు మాకు అనుకూలంగా లేవ్ మరి! అందుకే ఇలా జరుగుతోంది!  - నాన్కి రామ్ కన్వర్, చత్తీస్‌గఢ్ హోం మినిస్టర్

 

ఫాస్ట్ ఫుడ్ వల్లే
ఇవ్వాళ్టి యూత్ ఫాస్ట్‌ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. ఈ ఆహారం వల్లే హార్మోన్లు అసమతౌల్యానికి గురై యువతలో కోరికలను ప్రేరేపిస్తున్నాయి. అందుకే రేప్‌లు ఎక్కువయ్యాయి. - జితేందర్ ఛతర్, థువా ఖాప్ పంచాయత్ నేత

 

ఏ రకం?
ఈ రకమైన రేప్ జరగకుండా ఉండాల్సింది!  - సుశీల్ కుమార్ షిండే,  మాజీ హోమ్ మనిస్టర్  ( నిర్భయ రేప్ గురించి)

  

అంటే ఇంకోరకమైన రేప్ జరగొచ్చా? అని విమర్శకుల కౌంటర్.

 

‘నిర్భయ’ చట్టం వచ్చింది. ఇప్పుడిక... ‘భయ’ చట్టం రావాలి! స్త్రీల సేఫ్టీ కోసం నిర్భయ. స్త్రీల రెస్పెస్ట్ కోసం భయ. చెడ్డ పనికి చట్టం ఉన్నట్టే.. చెడ్డ మాటకూ చట్టం ఉండాలి. రేప్‌లపై చీప్‌గా మాట్లాడే మహానుభావుల నోళ్లకు...  ‘భయ’ అనే తాళం పడాలి.

 

‘అన్నా’ అంటే చాలు!
బాధితురాలు తన మీద దాడిచేయడానికి వచ్చిన మగవాళ్లను ‘అన్నా...’ అని పిలవాలి. రెండు చేతులు జోడించి ‘అన్నా.. నన్నేం చేయొద్దు’ అంటూ ప్రార్థించాలి!  - ఆసారామ్ బాపు, ఆధ్మాత్మిక గురువు

 

 

Advertisement
Advertisement