కంటిపాప | Sakshi
Sakshi News home page

కంటిపాప

Published Sun, May 8 2016 11:21 PM

కంటిపాప

పిల్లలకు తొలి గురువు ఎవరు?... ఇంకెవరు తల్లే! మరి తల్లి గురువు పాత్రను ఎన్నాళ్లు పోషిస్తుంది? బహుశా ఐదారేళ్లు... పిల్లలు బడికి పోయే వరకు... సొంతంగా చదువుకునే వరకు. స్వర్ణలత మాత్రం ఇరవై ఏళ్లుగా తన బిడ్డకు గురువు పాత్రను పోషిస్తూనే ఉంది.  మల్టిపుల్ చాలెంజెడ్ చైల్డ్ సాహిత్య చేతిలో పలకబలపం అయింది స్వర్ణలత.
 
హైదరాబాద్.. బేగంపేట.. ఎయిర్‌లైన్స్ కాలనీలో ఉంది ‘సమన్వయ్ మల్టిపుల్ చాలెంజ్డ్’ పిల్లల శిక్షణ కేంద్రం. లోపలికి వెళ్లగానే సాహిత్య ఒక టేబుల్ ముందు కూర్చుని పూసలను దారంతో దండ గుచ్చుతోంది. తలెత్తి చూడకుండా తదేక దీక్షతో చేస్తోందా పని. ఎండాకాలం సెలవుల్లో పిల్లలు హాబీగా నేర్చుకుంటున్నట్లే ఉంది ఆ దృశ్యం. ‘హాయ్! సాహిత్యా’ అని పలకరించగానే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి గాల్లో చేతిని కదిలిస్తూ కొత్త గొంతును వింటున్నట్లు ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టి తలెత్తింది. అప్పటి వరకు ఆ పాప మల్టిపుల్ చాలెంజెడ్ కిడ్ అని తెలిసే అవకాశం లేదు.

తనతో మాటలు కలుపుతూ ‘ఏం చేస్తున్నావు, ఎస్‌ఎస్‌సి పరీక్షలు అయిపోయాయా, ఓ పాట పాడతావా’ అని అడిగిన ప్రతి ప్రశ్నకూ బదులిస్తోంది. పాట పల్లవి వరకు పాడి... వెంటనే తను చేస్తున్న పనిలో లీనమవుతోంది. ఇన్‌స్ట్రక్టర్ రాజేశ్వరి సూచనలను శ్రద్ధగా పాటిస్తోంది. అంతలో స్వర్ణలత ఆ గదిలోకి వచ్చారు.
   
సాహిత్యకు తొందరెక్కువ. ఆరవ నెలలోనే పుట్టింది. త్వరగా ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడింది. ఆ పాప తొందరపాటు వైద్యానికే సరిగా అర్థం కాలేదు. ఇంక్యుబేటర్‌లో ఉంచి ఆక్సిజెన్ ఇచ్చారు. అది కంటి మీద ప్రభావం చూపించింది. పుట్టిన నలభై రోజుల్లోనే కంటికి ఆపరేషన్ చేశారు. గ్లకోమాకు దారి తీసింది. బిడ్డ మూడు కిలోలు పెరిగితే తప్ప మళ్లీ ఆపరేషన్ చేయలేమన్నారు. నెలకో కేజీ చొప్పున పెరిగి నాలుగు నెలలకే ఆపరేషన్‌కు సిద్ధమైంది సాహిత్య. నెల విరామంలో రెండు కళ్లకు ఆపరేషన్ అయింది. దేహంలో అన్ని భాగాలనూ పట్టి పట్టి పరీక్షించారు డాక్టర్లు. చెవులు, నరాలు, గుండె, కాలేయం, కిడ్నీల పని తీరు... అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. చూపు మాత్రం... రాజీ పడాల్సిందేనన్నారు.
 
ప్రపంచాన్ని తొందరగా చూసేయాలని ఆరాటపడిన సాహిత్య ఇప్పుడు స్పర్శతో ప్రపంచాన్ని చదివేస్తోంది. స్వరంతో లోకాన్ని తెలుసుకుంటోంది. ఆ క్రమంలో తల్లి స్వర్ణలత ఇరవై ఏళ్లుగా సాహిత్య చుట్టూ తన జీవితాన్ని అల్లుకున్నారు. ఉద్యోగం వదిలేశారు. ఉన్న ఊరిని వదిలేశారు. సాహిత్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారామె. అదే తన గమ్యం అన్నట్లు పయనిస్తున్నారు.సాహిత్య పుట్టినప్పుడు ‘ఈ బిడ్డ బతకడం కష్టమే’ అన్న వాళ్లు సాహిత్య ఎస్‌ఎస్‌సి పాసయింది అనగానే ‘అవునా, నిజమా’ అని ఆశ్చర్యపోయారు. అప్పటి పెదవి విరుపుకి, ఇప్పటి ఆశ్చర్యానికి మధ్య ఇరవై ఏళ్ల జీవనప్రస్థానం ఉంది. ఇన్నేళ్లలో స్వర్ణలత అనుభవాలు చూస్తే బిడ్డ కోసం ఇంత చేయగలిగింది అమ్మ మాత్రమే అనిపిస్తుంది. సాహిత్య చేత ఎస్‌ఎస్‌సి పూర్తి చేయించడానికి స్వర్ణలత పడిన శ్రమను మాటల్లో వివరించడం సాధ్యం కాదు. చేతనైనంత ప్రయత్నం మాత్రం చేయగలమంతే.
 
తల్లికి పరీక్షలు!
‘‘మల్టిపుల్ చాలెంజడ్ పిల్లలను డీల్ చేయడం చాలా కష్టం. సాహిత్య చేత ఎస్‌ఎస్‌సి రాయించడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఎంత కష్టమో తెలిసే కొద్దీ నా ప్రయత్నాన్ని అక్కడితే వదిలేయకుండా ఇలాంటి పిల్లల కోసం ఓ దారిని ఏర్పాటు చేయాలనే పట్టుదల కూడా పెరిగింది. తను స్కూల్లో అందరి పిల్లల్లాగానే పాఠాలు వినేది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పాఠాలను మళ్లీ మళ్లీ చదివి వినిపించేదాన్ని. ప్రశ్నలకు జవాబులను కంఠతా వచ్చే వరకు చదివి వినిపిస్తూ, తన చేత పలికించేవాళ్లం. కష్టమవుతున్న ప్రశ్నలను రికార్డ్ చేసి వినిపించేదాన్ని. పది ప్రశ్నలను రికార్డ్ చేసి వినిపిస్తే, తిరిగి అన్నీ అదే వరుసలో చెప్పేసేది.

ఏది ప్రశ్న, ఏది జవాబు, ఏ ప్రశ్నకు జవాబు ఎంత వరకు అనేది తనకు తెలిసేది కాదు. అందుకు విడిగా ఆ ఒక్క ఆన్సర్ మాత్రమే వినిపించాల్సి వచ్చేది. నేను ఒక్కో ప్రశ్న, జవాబును వంద కంటే ఎక్కువ సార్లు పలికి ఉంటాను. తన చిన్నప్పుడు నేను ఇంట్లో పని చేసుకుంటూ తన చేత రైమ్స్ పలికించేదాన్ని. ఇప్పటి వరకూ అలాగే ప్రతిదీ నేర్పించాను. సాహిత్య ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోయేది కాదు. అన్ని సబ్జెక్టులనూ బట్టీ పట్టి నేర్చుకుంది. కానీ లెక్కలు అలా కుదరేవి కాదు.
 
అన్నీ రాయాల్సిందే!
లెక్కల పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా సాహిత్యకు మినహాయింపు ఇప్పించమని విద్యాశాఖ అధికారులను అడిగాను. ప్రయత్నించగా ప్రయత్నించగా ఛాయారతన్ గారు నా మొర ఆలకించారు. ఆమె సాహిత్యను స్వయంగా పిలిపించుకుని మాట్లాడి సంతృప్తి పడిన తర్వాత మ్యాథ్స్‌లో మినహాయింపుకు అంగీకరించారు. కానీ ఎస్‌ఎస్‌సి బోర్డు అనుమతించలేదు. ఆమె వరుసగా రెండేళ్లు సిఫార్సు చేశారు. మూడవ ఏడాది కూడా ప్రయత్నిద్దామనుకుంటే ఆమె రిటైరయ్యారు. దాంతో పట్టించుకునే వారు లేకపోయారు.

నాకున్న ఏకైక మార్గం కూడా మూసుకుపోయినట్లయింది. మరో ప్రయత్నంగా సాహిత్య చేత మ్యాథ్స్ బిట్ పేపర్ కంఠతా పట్టించి పాస్ మార్కులకు సరిపోయినంతగా ప్రిపేర్ చేశాను. అలా ఎస్‌ఎస్‌సి 2014లో పూర్తయింది, అప్పుడు నేర్చుకున్న జవాబులను ఇప్పటికీ చెప్పగలుగుతుంది. సాహిత్యకు బయాలజీ చెప్పిన టీచర్ అయితే తర్వాత బ్యాచ్ పిల్లలకు తనను మోడల్‌గా చెప్తుంటారు’’ అంటున్నప్పుడు స్వర్ణలత కళ్లు ఆనందంతో మెరిశాయి. బిడ్డ సాధించిన ఘనతకు మురిసిపోని తల్లి ఉండదు మరి.
 
ఒక్క దెబ్బ కూడా లేకుండా...
‘‘సాహిత్య పుట్టినప్పుడు హడావుడి చేసింది. కానీ ఆ తర్వాత ఎప్పుడూ హాస్పిటల్‌ను చూడాల్సిన అవసరం రాలేదు. బోర్లా పడడం, నడవడం వంటివి మామూలు పిల్లలకంటే ఒక నెల ఆలస్యంగా చేసింది. విజువల్లీ చాలెంజ్‌డ్ కిడ్ అని జాగ్రత్త తీసుకోవడంతోపాటు తనకు కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పించాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పడి దెబ్బ తగిలించుకున్నదే లేదు. తను కొత్త ప్రదేశంలో చాలా నిదానంగా నడుస్తుంది. ఉదయం ఆరు గంటలకే లేచి తన పనులు, ఎలక్ట్రిక్ సైకిల్, ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేస్తుంది.

ఇంట్లో నా ఫోన్ రింగవుతుంటే శబ్దాన్ని బట్టి వెళ్లి తెచ్చి ఇస్తుంది. ప్రతి క్షణం నాతోనే ఉంటే ఇప్పుడు నాకు బాగానే ఉంటుంది. కానీ నేను ఉండని రోజు తనకు కష్టమవుతుంది. అందుకే నేను దగ్గర లేకపోయినా తాను మిగిలిన వారితో కలిసిపోవడం నేర్పిస్తున్నాను. ఇప్పుడు మేమిద్దరం ఎనిమిదన్నరకు ఇంటి నుంచి బయలు దేరుతాం. ఇక్కడికొచ్చాక బీడ్స్‌తో దండ కుడుతుంది, పేపర్‌తో బ్యాగ్ చేస్తుంది. తనకు పాటలు చాలా ఇష్టం.

పదేళ్ల వయసులో పాటలు వినాలనిపించినప్పుడు వాక్‌మేన్ పెట్టమనేది, అది పాడైందంటే టేప్‌రికార్డర్, సిడిప్లేయర్, లాప్‌టాప్, కంప్యూటర్... వరుసగా అన్నింటినీ గుర్తు చేసేది. ఇప్పుడు వాటన్నింటినీ హ్యాండిల్ చేస్తుంది మా ఎలక్ట్రానిక్ కిడ్’’ అని స్వర్ణలత చెబుతూండగా... తల్లి తన గురించే చెబుతోందని అర్థం చేసుకున్న సాహిత్య గారంగా దగ్గరకు వచ్చి తల్లిని ముద్దాడింది. సాహిత్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు స్వర్ణలత. అమ్మ మాత్రమే... అమ్మతనం మాత్రమే పడగలిగిన శ్రమ ఆమెది. అందుకే అమ్మకు వందనం.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

శ్రీకాంత్ బొల్లా : ప్రియశిష్యుడు
శ్రీకాంత్ పాతికేళ్ల కుర్రాడు. అమెరికా ఎమ్‌ఐటిలో చదివి స్వదేశంలో పరిశ్రమను స్థాపించాడు. అతడిది కృష్ణాజిల్లా మచిలీపట్నం. విజువల్లీ చాలెంజ్‌డ్ కిడ్ కావడంతో శ్రీకాంత్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేక పాఠశాలలో చేర్పించారు. అతడికి మార్గదర్శనం చేశారు స్వర్ణలత. ఆమె బొల్లాంట్ పరిశ్రమలో డెరైక్టర్.
 
‘‘నేను దేవనార్ స్కూల్‌లో వాలంటీర్‌ని. శ్రీకాంత్ ఐదవ తరగతి నుంచి తెలుసు. వాడి అబ్జార్బింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. ఎంత చెప్పినా నేర్చుకునే మేధాశక్తినిచ్చాడు దేవుడు. వన్ టు వన్ క్లాసుల్లో నేను ఏ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నా శ్రీకాంత్ నా చుట్టూనే తిరిగేవాడు. తనకంటే పెద్ద వాళ్లకు చెబుతున్న సిలబస్ కూడా ఫాలో అయ్యేవాడు. వాళ్లకిచ్చే యాక్టివిటీలను శ్రీకాంత్ కూడా చేసేవాడు. డబుల్ ప్రమోషన్‌కు రికమండ్ చేశాను. పెద్దయి ఆ స్కూల్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా నాకు కాంటాక్ట్‌లోనే ఉండేవాడు. యుఎస్‌లో ఉన్నప్పుడే బొల్లాంట్ యూనిట్ గురించి ఆలోచన వచ్చింది.

వెకేషన్‌కు ఇండియా వచ్చినప్పుడంతా బాగా వర్కవుట్ చేసేవాడు. చివరి సెమిస్టర్‌కు ఆరు నెలలు విరామం తీసుకుని యూనిట్ ప్రారంభించాడు. తను వచ్చి అందుకునే వరకు మొత్తం నేనే చూసుకున్నాను. ఇప్పుడు రోజు వారీ వ్యవహారాలు శ్రీకాంత్ చూసుకుంటున్నాడు. శ్రీకాంత్‌కు మంచి ఆదర్శాలున్నాయి. బొల్లాంట్ ద్వారా స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌కి ఉపాధినిస్తున్నాం. ఒక కుర్రాడైతే ‘మీ దగ్గరకు వచ్చే వరకు యాచనకు చేయి చాచిన రోజులు కూడా ఉన్నాయి’ అని ఉద్యోగం చేసుకుంటూ పై చదువులు చదువుకుంటున్నాడు. బొల్లాంట్ శాఖలు హైదరాబాద్‌లో మూడు, నిజామాబాద్‌లో ఒకటి, హుబ్లీలో ఒకటి పని చేస్తున్నాయి.                 - స్వర్ణలత

Advertisement
Advertisement