అంతంత ఖర్చు అవసరమా? | Sakshi
Sakshi News home page

అంతంత ఖర్చు అవసరమా?

Published Wed, Apr 2 2014 1:41 AM

అంతంత ఖర్చు అవసరమా?

పెళ్లి సందర్భంగా అమ్మాయికి పెట్టే నగలు, వస్త్రాలు, అలంకరణ... అన్నీ ఖరీదైనవే. వాటికి ఖర్చుపెట్టే లక్షల సొమ్ముని దంపతుల భవిష్యత్తు కోసం జాగ్రత్త చేస్తే ఎంత ఉపయోగంగా ఉంటుంది చెప్పండి!
 
 మొన్నామధ్య మా బంధువులమ్మాయి పెళ్లి పిలుపు వచ్చింది. పెళ్లి పత్రిక ఓ చిన్నసైజు ఇంగ్లీషు మ్యాగజైన్‌లా ఉంది. పత్రికే ఇలా ఉందంటే... ఇక పెళ్లి హడావిడి ఎలా ఉంటుందో అనుకున్నాను. అయితే నేనూహించినదానికంటే పదిరెట్లు ఎక్కువ హంగామా ఉందక్కడ. పెళ్లి సెట్‌కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ ్డడెరైక్టర్‌ని మాట్లాడుకున్నారట. పెళ్లి సెట్‌కి వాళ్లు పెట్టిన ఖర్చు తెలిస్తే....పెళ్లికి బంధువులకంటే ముందు ఇన్‌కమ్‌టాక్స్‌వాళ్లు వస్తారు. పెళ్లయిపోయాక అందరూ బయలుదేరుతున్నారు.

నేను పెళ్లికూతురు తరపున కదా! చివరిదాకా ఉన్నాను. పెళ్లివాళ్లంతా వెళ్లిపోయాక సెట్టింగ్‌వాళ్లు దిగారు. వస్తూనే సెట్‌నంతా ఓ నాలుగుగంటల్లో విప్పేశారు. ‘ఈ కాస్త దానికి... ఏకంగా అంత డబ్బు ఖర్చుపెట్టారా...’ అనుకుని నేను కూడా వెనుదిరిగాను. అన్నట్టు... భోజనాల గురించి చెప్పలేదు కదా! ఒక్కో ప్లేటు 1500 రూపాయల ఖరీదట. అంటే ఒక మనిషి తినే తిండి ఖర్చన్నమాట.  ‘భోజనాలు అదరగొట్టార్రా...’ అనే కామెంట్ బాగానే ఉంటుంది కానీ, 1500 రూపాయలకి చక్కని భోజనం ఎంతమంది చేయొచ్చనే కనీస ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది కదా! వీటన్నిటికంటే ప్రవేశద్వారం దగ్గర ఓ నలుగురమ్మాయిలు ఖరీదైన చీరలతో అచ్చం సినిమా తారల్లా ముస్తాబయి, వచ్చినవారిపై అత్తరు చల్లుతున్నారు. బంధువులనుకుంటారేమో...కాదు, ఈవెంట్ మేనేజర్ చేసిన ఏర్పాట్లలో వారు కూడా ఒకటన్నమాట. ఇవన్నీ అతిథులకోసం చేసిన హంగామా.
 
ఇక పెళ్లికూతురు ఇంట్లో హంగామా దీనికి రెట్టింపు. నార్త్ నుంచి దిగుమతి అయిన మెహందీ ఫంక్షన్ గురించి వినే ఉంటారు మీరు. గోరింటాకు పెట్టుకునేటప్పుడు కూడా ఖర్చు లక్షల్లోనే ఉంటోంది.  పెళ్లిచీర అరకోటికి పైగా ఉంటోంది. పెళ్లి సందర్భంగా అమ్మాయికి పెట్టే నగలు, వస్త్రాలు, అలంకరణ...అన్నీ ఖరీదైనవే. వాటికి ఖర్చుపెట్టే లక్షల సొమ్ముని దంపతుల భవిష్యత్తు కోసం జాగ్రత్త చేస్తే ఎంత ఉపయోగంగా ఉంటుంది చెప్పండి! పెళ్లికి వచ్చిన బంధువులకి మేకప్ చేయడం కోసం పార్లర్ సిబ్బందికి ఇచ్చే డబ్బుతో ఓ పేదవాడి పెళ్లయిపోతుందని మా స్నేహితుడెవరో అంటే నేను నమ్మలేదు. నా కళ్లతో చూశాక నమ్మక తప్పలేదు.

  పచ్చని పందిట్లో ఆకు నిండా పలహారాలతో భోజనం పెట్టి ఓ పూటలో ముగించే పెళ్లితంతుని ఐదురోజుల పెళ్లి, ఏడు రోజుల పెళ్లి.. అంటూ బోలెడంత హంగామా చేస్తున్నారు. పెళి ్లపేరుతో ఇన్నివేల మంది పేదలకు ఉచితంగా భోజనం పెట్టాం, ఉచితంగా బట్టలు పంచాం అని చెప్పుకుంటే కూడా గొప్పగానే ఉంటుంది. అలాంటి పనులను గొప్పగా చెప్పుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాను. డబ్బున్నవారిని చూసి మధ్యతరగతివారి మతులు చెడుతున్నాయి. వారికున్నదానితో సరిపెట్టకుండా... ఓ నాలుగో, ఐదో కట్టలు ఎక్కువ ఖర్చుపెట్టి తర్వాత తలపట్టుకుంటున్నారు. మొత్తానికి పెళ్లి వెల పెరుగుతోంది.
 -ఎస్. రామారావు, హైదరాబాద్
 
 

Advertisement
Advertisement