ఎన్నున్నా... నేనున్నా | Sakshi
Sakshi News home page

ఎన్నున్నా... నేనున్నా

Published Fri, Nov 15 2013 1:20 AM

ఎన్నున్నా... నేనున్నా - Sakshi

 అప్పటికి -
 అమెరికా వెళ్లడం ఒక్కటే నాగేశ్వరరావు లక్ష్యం.
 అప్పటికి అంటే... చదువు పూర్తయ్యేనాటికి.
 చదువు పూర్తయింది. లక్ష్యం చేరువయింది.
 సడెన్‌గా యు-టర్న్ తీసుకున్నారు నాగేశ్వరరావు!
 నో అమెరికా అనుకున్నారు.
 అమెరికా వెళితే తనొక్కడే హ్యాపీగా ఉంటాడు.
 వెళ్లకపోతే?
 తనలాంటి వికలాంగులెందర్నో హ్యాపీగా ఉంచగలడు!
 వైకల్యం జీవన్మరణం అని ఆయనకు తెలుసు.
 అసౌకర్యాలుంటాయి, అవమానాలుంటాయి.
 అన్యాయాలంటాయి, అక్రమాలు ఉంటాయి.
 ‘ఎన్నున్నా... మీకు నేనున్నా’ అని నిలబడ్డారాయన.
 పట్టు సడలని ఆయన పోరాటమే...
 ఈవారం... ప్రజాంశం.
 
 అంతవరకు తోటిపిల్లలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు నాలుగేళ్ల నాగేశ్వరరావు. ఉన్నట్టుండి ప్రమాదవశాత్తూ చెయ్యి విరిగింది ఆ చిన్నారికి. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావుకి అకస్మాత్తుగా వచ్చిపడ్డ అంగవైకల్యం  అతడిలో క్రమేణా పట్టుదలను పెంచింది. చెయ్యిలేనివాడికి చదువెందుకంటూ ఎద్దేవా చేశారు చాలామంది. ఉన్నత చదువులతోనే వారందరికీ సమాధానం చెప్పాలనుకున్నాడు. చదువుకుంటూనే ‘వికలాంగుల విద్యార్థి సంఘం’ స్థాపించిన నాగేశ్వరరావు ఆ తర్వాత వికలాంగులకు కావలసిన  సౌకర్యాల కోసం వికలాంగుల హక్కుల సంఘాన్ని స్థాపించి, పోరాటం ప్రారంభించారు.ఈ పోరాట యోధుని అనుభవాలు ఆయన మాటల్లోనే...
 
  ‘‘మాది నెల్లూరుజిల్లా చౌటపల్లి. నాన్న నిరుపేద రైతు. బిడ్డల్ని చదివించడం తప్ప ఆయనకు మరో ధ్యేయం లేదు. నాకు పదేళ్ల వయసున్నప్పుడు, తెలిసిన వాళ్ల ద్వారా నన్ను మలక్‌పేట వికలాంగుల హాస్టల్లో చేర్పించారు. అక్కడే డిగ్రీ పూర్తిచేశాను. ఒక స్నేహితుడు ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీకాప్‌డ్’లో బి.ఈడీచేస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పడంతో వెంటనే అందులో చేరి బి.ఈడీ పూర్తిచేశాను. అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది కానీ వెళ్లదలచుకోలేదు. నాలా ఏ వికలాంగుడూ ఇన్ని కష్టాలు పడకుండా ఉండటం కోసం ఏమైనా చేయాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘వికలాంగుల హక్కులసంఘం’.
 
 పింఛన్ నుండి ‘పిలుపు’ వరకూ...
 ఏ మనిషికైనా డబ్బు ప్రధానం కాబట్టి, ముందు పెన్షన్ కోసం పోరాటం ప్రారంభించాను. అప్పటివరకూ వికలాంగులకు రు.200 మాత్రమే పెన్షన్ వచ్చేది. దాన్ని రు.500కు పెంచాలని చేసిన డిమాండ్ ఫలించింది. ‘మా సంక్షేమం గురించి అడిగేవారు లేకపోవడంతో మా కనీస హక్కులేంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.  దాంతో ‘పిలుపు’ పేరుతో ఓ మాసపత్రిక పెట్టాను. అందులో ప్రభుత్వ పథకాలు, హక్కులు, చట్టాలు... వంటి వివరాలన్నీ ఉంటాయి. ఏయే విద్యార్హతలకు ఏయే ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలియజేస్తూ ఆయా ఉద్యోగాల వివరాలు, దరఖాస్తులు అందుబాటులో ఉంచాను. అవే కాకుండా వికలాంగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, రాష్ర్టంలోని వికలాంగుల విజయగాథల ను కూడా అందులో ప్రచురిస్తున్నాం. వాటి ఆధారంగా దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు.
 
 సంఘం సాధించిన విజయాలు...
 వికలాంగులమంటూ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామంది ఉంటారు. వారి బండారం బయటపెట్టాను. నాలుగేళ్లక్రితం వచ్చిన ఓ సినిమాలో డైలాగ్‌లు వికలాంగుల మనోభావాల్ని గాయపరిచేలా ఉండడంతో వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి ఆ సినిమాలో మాటలు తొలగించాలని కోరాను. నిర్మాత పెద్దగా స్పందించకపోవడంతో సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగాం. వెంటనే ఆ డైలాగ్స్‌ని కట్ చేశారు. అంతేకాదు... ‘ఇకపై మరే సినిమాలో కూడా వికలాంగుల మనోభావాల్ని ఇబ్బందిపెట్టే మాటలు, సన్నివేశాలు ఉండనివ్వం’ అంటూ సెన్సార్ బోర్డు వారు మాట ఇవ్వడం మేం సాధించిన మరో విజయం.
 
 ఆటలు, అవార్డులు...
 మా సంఘపోరాటాన్ని ధర్నాలు, ఉద్యమాలకే పరిమితం చేయకుండా  వికలాంగుల్లో చైతన్యం తీసుకురావడానికి... క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించి, రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి 23 టీమ్‌లను ఏర్పాటుచేశాం. ఏటా వికలాంగుల దినోత్సవం నాడు ప్రత్యేక వేడుకల్ని జరుపుతున్నాం. మహిళా దినోత్సవంనాడు... వ్యాపారం, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించిన వికలాంగ మహిళలకు సన్మానాలు చేస్తున్నాం.సకలాంగులకు కూడా సాధ్యం కాని ఎన్నో విజయాలను సాధించిన నాగేశ్వరరావు అభినందనీయులు.
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

Advertisement
Advertisement