పట్టు విడుపులు | Sakshi
Sakshi News home page

పట్టు విడుపులు

Published Sun, Jan 28 2018 1:39 AM

News about Lunar eclipse - Sakshi

ఖగోళ పరంగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు. సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణమనీ అంటారు.

31న చంద్రగ్రహణం
ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనున్నది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం వేళలు ఇవీ...

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం
సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలం (గ్రహణ మోక్షం )గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ కాలం 3 గంటల 23 నిమిషాలు.

ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది..?
భారతదేశంతో సహా ఆసియా ఖండం, అమెరికా, యూరప్‌ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాలలో కనబడుతుంది.

గ్రహణ గోచారం ఇలా...
ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం, ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశి అవటం చేత ఈ రెండు రాశులవారు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఏ రాశివారిపై ఏ ప్రభావం?
ధనస్సు–మేషం–కర్కాటక–సింహ రాశుల వారికి అధమ ఫలం. వృశ్చిక–మకర–మీన–మిధున రాశుల వారికి మధ్యమ ఫలం. కన్య–తుల–కుంభ వృషభ రాశుల వారికి శుభ ఫలాలు. చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ.. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిణులు ప్రత్యేక్షంగా చూడకూడదు, మనస్సులో భగవంతుని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది. గర్భిణులు కదలకుండా పడుకోవాలనేది అవాస్తవం. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును. ఇందులో ఎలాంటి సందేహాలూ లేవు. గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చేయకూడదు అనే అపోహలు వద్దు.

గ్రహణ వేళ ఆహార పానీయ నియమాలు
అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. గ్రహణం పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, పండ్లరసాలు వంటివి తీసుకోవచ్చును. గ్రహణం పూర్తి అయిన తర్వాత తలస్నానం చేసి వంట చేసుకొని తినాలి. ఉదయం చేసిన అన్నం కూరలు పనికి రావు. గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్థాలు విష స్వభావాన్ని కలిగి ఉండటమే అందుకు కారణం. అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిదానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రీయ పద్ధతి అవసరం
గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణం పట్టటానికి ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్‌ స్మరణతో ఉండగలిగితే మామూలు సమయంలో చేసిన ధ్యాన ఫలితం కన్న రెట్టింపు ఫలితం లభిస్తుంది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు చేయనక్కర్లేదు.

తర్వాత ఇలా చేయాలి
గ్రహణం పూర్తయిన తరవాత ఇంట్లో దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి. విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి. జంధ్యం ధరించే సంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి. మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వాత ఆవుకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహార, వస్త్ర, వస్తు రూపంలో దానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహబాధలు కొంతవరకు నివారణ కలిగి భగవత్‌ అనుగ్రహం కలుగుతుంది.

ఆలయాలను ఎందుకు మూసివేస్తారు?
సూర్యచంద్రులతో భూమికి గల సంబంధాన్ని బట్టే కాలగణన జరుగుతుంది. అటువంటి సూర్య చంద్రులకు గ్రహణం కలిగిందంటే అది దుర్దినమేకదా! సామాన్య భాషలో చెప్పాలంటే లోకానికి వెలుగు, వేడిని ప్రసాదించే సూర్యచంద్రులను క్రూరగ్రహాలైన రాహుకేతువులు మింగడమంటే అది లోకానికంతటికీ కష్టకాలమే కదా! ఆలయాలు సమాజమంతటినీ కలిపే కేంద్రాలు కాబట్టి, దేవాలయాలను గ్రహణ కాలంలో మూసివేసి, గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేస్తారు. ఆ తర్వాతనే పూజాదికాలు ప్రారంభిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement