స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప కాదు! | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప కాదు!

Published Fri, Jan 30 2015 10:55 PM

స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప కాదు! - Sakshi

13-19  కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?!
 ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...

కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లలు తమ చుట్టూ ఉన్నదంతా మంచే అనుకుంటాను. ఎప్పుడూ సంతోషంలో మునిగితేలాలనుకుంటారు. మంచీ, చెడు తెలియని దశను సవ్యమైన మార్గంలో పెట్టడానికి నేటి కాలపు అమ్మనాన్నల ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. పదిహేనేళ్ల తన కుమారుడి గురించి ఓ తల్లి ఆందోళన చెందిన విధం ఇది...
 
రెండు నెలల క్రితం...


‘‘మా అబ్బాయి అభినవ్ 9వ తరగతి చదువుతున్నాడు. పదిహేనేళ్లుంటాయి. నేనూ మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగస్తులమే. మాకు ఒక్కగానొక్క బిడ్డ అభినవ్. వాడి మీదే మా ఆశలన్నీ. వాడి భవిష్యత్తు బాగుండాలని, ఇద్దరం కష్టపడుతున్నాం. గత ఏడాది వరకు వాడి పెంపకం మాకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఈ మధ్యే వాడి ప్రవర్తనకు తీవ్రంగా భయపడుతున్నాం. ఏమైపోతాడో అని దిగులుగా ఉంటోంది. పదిహేనేళ్ల పిల్లవాడు డ్రగ్స్ వాడుతున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రికైనా ఎంత షాక్!! అలా నివ్వెరపోయేలా మా అబ్బాయి చేశాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఎదురు తిరుగుతుంటే వయసు అలాంటిదిలే అని సరిపెట్టుకున్నాను. అబద్ధాలు చెబుతున్నాడు అని తెలిస్తే కోప్పడేదాన్ని. కానీ, మార్కెట్‌లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా, ట్యాబ్ వచ్చినా అది కావాలనేవాడు. ఇవ్వకపోతే చచ్చిపోతాను అని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బెదిరింపులు. హెయిర్‌స్టైల్ మార్చాలంటాడు. డ్రెస్సులు ఫ్యాషన్‌గా లేవంటాడు. ఫ్రెండ్స్‌తో తిరుగుళ్లు ఎక్కువయ్యాయి.. తన కన్నా వయసులో పెద్దవారితో స్నేహాలు. కాస్త మందలించినా ఎదురుగా ఉన్న వస్తువులను టీవీ, ఫ్రిజ్.. ఏదుంటే అది పగలకొట్టేంతవరకు వెళ్లింది. నాకు తెలియకుండా మా వారి దగ్గర, ఆయనకు తెలియకుండా నా దగ్గర బుక్ పోయిందనో, పెన్ను కావాలనో, ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అనో.. డబ్బులు అడుగుతూనే ఉంటాడు. ఇవ్వకపోతే దొంగతనం కూడా చేసేవాడు. కోప్పడ్తే ‘నువ్వింతే, నా మీద నీకు నమ్మకం లేదు’ అనేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మార్కులు బాగా తగ్గిపోయాయి. చెప్పింది అస్సలు వినడు అని స్కూల్లో టీచర్ల కంప్లయింట్. ఒక్కగానొక్క కొడుకు. ఏమైనా అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటాడో... అని భయం. అలాగని వదిలేస్తే ఏమైపోతాడో అని దిగులు. ఎవరి సలహా అయినా తీసుకుందామంటే ఇంట్లో ఉండేది మేం ముగ్గరమే! పెద్దవాళ్లు ఊళ్లో ఉంటారు. పిల్లవాడు బాగయ్యేదెలా?! చేస్తున్న ఉద్యోగం మానేయనా?! ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. కుటుంబం గడిచేదెలా?! ఈ తరహా ఆందోళన నాలో ఎక్కువై ఆరోగ్యం కూడా దెబ్బతింది.’
 - వసుధ (అభినవ్ తల్లి)

నిజాలు ఇలా..!

అభినవ్‌ని తీసుకొని తల్లీదండ్రి వచ్చినప్పుడు పిల్లవాడి స్థితి మామూలగానే ఉన్నట్టు అనిపించింది. తల్లితండ్రి చెబుతున్నట్టుగా ఏమీ లేడని, ఈ దశలో పిల్లల పట్ల ఉండే సహజమైన ఆందోళనే ఈ తల్లిదండ్రిలోనూ ఉందనుకున్నాను. అభినవ్‌తో ఒంటరిగా మాట్లాడి, క్రమం తప్పకుండా కొన్ని సేషన్స్‌కు అటెండ్ అయితే ఎన్నో విషయాలు తేటతెల్లమయ్యాయి.  అభినవ్ కళ్లలో కొద్దిగా ఎరుపు జీర కనిపించింది. ఆకలి ఎక్కువగా ఉంటుందనీ చెప్పాడు. అప్పటికే కొన్ని మెడికల్ టెస్ట్‌లు కూడా చేయించడం వల్ల వాటిలో మందు, పొగ, మాదకద్రవ్యాలకు అప్పుడప్పుడే అలవాటుపడ్డాడని అర్థమైంది. అదే విషయం అడిగితే ‘ స్నేహితుల బలవంతమ్మీద వాటిని తీసుకుంటున్నా’నని చె ప్పాడు. ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే నిజంగానే అభినవ్ పూర్తిగా చదువుమానేసేవాడే! తల్లిదండ్రుల ఆందోళ మరింత పెరిగేదే!

ఈ వయసులో...

సాధారణంగా టీనేజ్ పిల్లల్లో బిహేవియరల్ సమస్యలను కనుక్కోవడం కష్టం. పేరెంట్స్ మధ్యలో గొడవలుంటే ఆ ప్రభావం పిల్లల మీధ అధికంగా పడుతుంది. వారి మనస్తత్వంలో తీవ్ర మార్పులు వస్తాయి. ఇద్దరూ ఉద్యోగస్తులు అవడంతో తల్లిదండ్రులు తమ తీరికలేని పనులలో నిమగ్నమై ఉంటారు.. పిల్లలతో కొంత సమయం కూడా గడపకపోవడం వల్ల బయటి స్నేహితులను వెతుక్కుంటారు. స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలు చెప్పింది వినకపోయినా, మానసిక సమస్యలున్నా, తెలివితేటల్లో పురోభివృద్ధి లేకపోయినా.. అవే పెరుగుతాయిలే అని పెద్దలు మిన్నకుండిపోతారు. దీంతో పట్టించుకునేవారు ఎవరూ లేరులే అనే నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది.
 
ఇవి తప్పక పాటించాలి...
 
ముఖ్య సమస్యలపైన ముందుగా దృష్టి పెట్టాలి.ఇంట్లో సమస్యలు పిల్లల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి.
స్కూల్‌లో ఏ తరహా సమస్యలున్నాయో కనుక్కోవాలి. కొన్నిసార్లు టీచర్లు ఇద్దరు ముగ్గురు పిల్లలనే ‘పాయింట్ ఔట్’ చేసి కించపర చడం, దండించడం వంటివి చేస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. స్నేహితులు కూడా ఇంటి నుంచి ఏమైనా తీసుకురమ్మని డిమాండ్ చేస్తుంటారు. అలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో కనుక్కోవాలి.
     
తల్లిదండ్రులు టీచర్లతో సమయానుసారం తమ పిల్లల పోగ్రెస్, వ్యక్తిత్వం ఎలా ఉందో సంభాషిస్తూ ఉండాలి. మార్పు రావడానికి మంచి - చెడు కారణాలు ఏమున్నాయో చూడాలి. ఎన్ని పనులున్నా... రోజులో కొంత సేపు పిల్లలతో సంభాషించాలి. డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకుండా వస్తువుల రూపేణా భర్తీ చేయాలి. పిల్లవాడి చుట్టూ ఉన్న స్నేహితుల ప్రవర్తననూ పరిశీలించాలి. చాలామంది ‘మా పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ’ ఇస్తాం అని గొప్పగా చెబుతుంటారు. అంత స్వేచ్ఛ కూడా ఈ వయసులో మంచిది కాదు. స్వేచ్ఛకు కొన్ని పరిధులు ఉంటాయని తెలుసుకునేలా పెద్దల ప్రవర్తన ఉండాలి. అలాగని క్రమశిక్షణ పేరుతో అతిగా నియమాలు పెట్టకూడదు. అతి క్రమశిక్షణ పిల్లలను ఎదురు తిరిగేలా చేస్తుంది.

కొంతమంది తమ పిల్లలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటామని గొప్పగా చెబుతారు. స్నేహితులుగా అనేది కూడా కొంతవరకే అని తల్లిదండ్రి గ్రహించాలి.స్తబ్దుగా, మౌనంగా పిల్లలు ఉంటే అలాగే వదిలేయకుండా తగిన కారణం తెలుసుకొని వెంటనే పరిష్కరించాలి.తమ ఈడు పిల్లలతో ‘పోలిక’ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. తప్పు పట్టకుండా సాధ్యాసాధ్యాలను వివరించాలి.  రెండు నెలలుగా... ఇవన్నీ పాటించి, అభినవ్‌లో వచ్చిన మార్పులు చూసి తల్లీదండ్రీ సంతోషించారు. ‘ఇవే జాగ్రత్తలను పాటిస్తూ ఉండండి’ అనే సూచన వారి ముగ్గురి జీవితాల్లోనూ మార్పును తీసుకువచ్చింది.

 - డా. చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్
 
 

Advertisement
Advertisement