పదాలు తెలియడం అనువాదం కాదు.... | Sakshi
Sakshi News home page

పదాలు తెలియడం అనువాదం కాదు....

Published Fri, Mar 20 2015 10:31 PM

పదాలు తెలియడం అనువాదం కాదు.... - Sakshi

పండగ పలకరింపు
 
ఆర్.శాంతసుందరి ప్రతిఫలం ఆశించని సాహిత్య సేవ చాలాకాలం నుంచి చేస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని తెలుగు నుంచి హిందీలోకి ప్రమాణాలు పాటిస్తూ అనువాదం చేస్తున్న అతి కొద్ది మంది అనువాదకుల్లో ఆమె ఒకరు. తెలుగులో ఒక మంచి కథ వచ్చినా కవిత వచ్చినా జీవిత చరిత్ర వచ్చినా అడిగి మరీ అనువాదం చేసి పెద్ద సంఖ్యలో ఉన్న హిందీ పాఠకులకు చేరవేస్తారు. అందుకు బదులుగా ఆమె  పొందింది డబ్బు కాదు- అమూల్యమైన సంతృప్తి. హిందీ నుంచి తెలుగుకూ, తెలుగు నుంచి హిందీకి దాదాపు 60 పుస్తకాలు అనువాదం చేసిన శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం లభించడం కూడా ఆమె ఆశించని ప్రతిఫలమే. ప్రేమ్‌చంద్ జీవిత చరిత్ర ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’ను తెలుగులో అనువదించిన సందర్భంగా ఆమెతో సంభాషణ.
 
సాహిత్య అకాడెమీ అవార్డు రావడం ఎలా అనిపిస్తోంది?

బాగనిపిస్తోంది. నిజానికి నేను తెలుగు నుంచి హిందీకి ఎక్కువ అనువాదాలు చేశాను. కాని తెలుగు అనువాదానికి అవార్డు వచ్చింది. అయినా సంతోషమే.  ప్రేమ్‌చంద్ నా అభిమాన రచయిత. ఇంతకు మునుపు ఎన్‌బిటి కోసం ప్రేమ్‌చంద్ బాలసాహిత్యం 13 కథలు అనువదించాను. దానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం లభించింది. ఇప్పుడు ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’ పుస్తకానికి. అది మంచి పాఠకాదరణ పొందిన పుస్తకం.

సృజనాత్మక రచనలు చేసేవారికి వచ్చే గుర్తింపు కంటే అనువాద రచయితలకు వచ్చే గుర్తింపు తక్కువ.  అయినా మీరు అనువాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

సృజనాత్మక రచనలు చెయ్యాలన్న ఆలోచన ముందు నుంచీ లేదు. మా ఇంట్లోనే ఒక గొప్ప రచయిత (కొడవటిగంటి కుటుంబరావు) ఉన్నాడు. అంతేగాక చిన్నప్పట్నుంచీ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో గొప్ప గొప్ప రచనలు చదివాక మనం రాసేదేమిటిలే అనిపించేది. అనువాదాలు చేసే ఆలోచన కూడా హరివంశ్‌రాయ్ బచ్చన్ సూచించే దాకా నాకు రాలేదు. ఇవాళ ఇంత అనువాద సాహిత్యం సృష్టించానంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తే కారణం. అలాగే నా భర్త (గణేశ్వరరావు) అందించిన తోడ్పాటు కూడా చాలా ఉంది.

హిందీ నుంచి తెలుగులోకి మీరు అనువా దం చేసిన మొట్టమొదటి రచన?
 
హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన మొదటి పుస్తకం హిందీ ఏకాంకికలు. 1980లో దాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారికోసం చేశాను. తెలుగు నుంచి హిందీలోకి అచ్చయిన నా మొదటి అనువాదం సి.ఎస్.రావుగారి కథ ‘ఉభయభ్రష్టుడు’. పుస్తకరూపంలో వచ్చిన మొదటి రచన వాసిరెడ్డి సీతాదేవి నవల ‘వైతరణి’.

అనువాదం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి?

అనువాదం పదకోశం కాదు. పదాల అర్థం తెలిస్తే సరిపోదు. వాటిని సందర్భోచితంగా వాడడం తెలియాలి. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కొంచెం కష్టమే. పేర్ల ఉచ్ఛారణ దగ్గర్నుంచి సరి చూసుకోవాలి. తెలుగు నుంచి హిందీ అనువాదాలు కొంచెం సులభం. సంస్కృతి పరంగా పెద్ద తేడా ఉండదు కనుక. ఏ భాష నుంచి అనువాదం చేసినా- చేసేటప్పుడు తెలుగులో ఆలోచించి చేస్తాను.
 
హిందీతో పోల్చి చూసినప్పుడు తెలుగు సాహిత్యం ఏ స్థాయిలో ఉంది?


చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా కవిత్వం, కథ చాలా దూరం అంటే దాదాపు 20 ఏళ్లు ముందున్నాయి. కాని దురదృష్టవశాత్తు మన సాహిత్యానికి ఎక్స్‌పోజర్ తక్కువ. మనల్ని మనం ప్రచారం చేసుకోము.

కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రసిద్ధ రచయిత కుమార్తె మీరు. నాన్నగారన మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించేవారు?

నిజం చెప్పాలంటే మా నాన్న ఇంట్లో తన గురించి గాని, తన రచనల గురించి గాని మాట్లాడినట్టు నాకు గుర్తు లేదు. ఎప్పుడూ ఇంకొకరి గొప్పదనాన్నే చెపుతూ ఉండేవారు. వాళ్లు రచయితలూ కావచ్చు. సంగీత విద్వాంసులు కావచ్చు లేదా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అద్భుతాలు కావచ్చు. అసలు నా పెళ్లి అయ్యేదాకా ఆయన రాసిన చందమామ కథలు తప్ప ఇతర రచనలేవీ అంత సీరియస్‌గా చదవలేదు. నా భర్త ఆ మాట విని ఆశ్చర్యపోయి, తను సేకరించిన నాన్న కథలు చదవమని ఇచ్చారు. నేను అనువాదాలే తప్ప సొంత రచనలేవీ చేయకపోయినా మా నాన్న ప్రోత్సాహం పరోక్షంగా ఉండేది. హిందీ/ఉర్దూ కవుల్లో నాకు ఇష్టమైన వారి గురించి అడిగి తెలుసుకునేవారు. సాహిర్ లూధియాన్వీ అంటే నాకు విపరీతమైన ఇష్టమని చెప్పినప్పుడు వెంటనే సాహిర్ పాటలు రాసిన ‘తాజ్ మహల్’ సినిమా రికార్డు కొని తెచ్చి ఇచ్చారు. ఆ సంగతి నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. ఏ విషయాన్నీ పెద్దగా వివరించి చెప్పడం, ఇలా చెయ్యి అని ఆదేశించడం ఆయన స్వభావంలో లేవు. మౌనంగా ఉంటూనే ప్రోత్సహించడం తెలిసిన మనిషి ఆయన. పిల్లలకి 15 ఏళ్లు దాటాక వాళ్లకి మార్గదర్శనం చేయాలి తప్ప ఆజ్ఞాపించి బలవంతంగా ఏ పనీ చేయించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానే తప్ప ఆయన ప్రతిభ నీడలో నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.
 మీ నాన్నగారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, మీకు కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు..
 తండ్రీకూతుళ్లకి సాహిత్య అకాడెమీ అవార్డులు రావడం అరుదేనేమో! నాన్న ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోలేదు. నేనూ ఇలాంటివాటికి గర్వపడను. అనుకున్నది సాధించినా అనుకోకుండా ఇలాంటి పురస్కారాలు వచ్చినా సంతోషం, సంతృప్తి మాత్రమే ఉంటాయి.
 -  డా.పురాణపండ వైజయంతి
 

Advertisement

తప్పక చదవండి

Advertisement